”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న దాశరథి కృష్ణామాచార్య కవితా వాక్యం తెలంగాణ ఉద్యమానికి నినాదమై కోట్లాదిమందిలో స్ఫూర్తి నింపిందని, తెలంగాణ సాహిత్యోద్యమాల చరిత్రలో దాశరథి పేరు చిరస్థాయిగా నిలచి వుంటుందని జూలై 22న దాశరథి 93వ జయంతి సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు.
మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన రవీంద్రభారతిలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని దాశరథికి ఘనంగా నివాళులర్పించారు. 23 ఏళ్ళ యవ్వనంలోనే దాశరథి ఆనాటి రాజ్యంమీద అగ్నిధారలు కురిపించారని శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, దాశరథి ఆశించిన అన్నార్తులు, అనాథలు ఉండని సమాజాన్ని రాష్ట్రంలో ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృషి చేస్తున్నారన్నారు. కవులు, కళాకారులను గౌరవించడంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, ఉర్దూ కవి గాలిబ్ ను దాశరథి గొప్పగా అనుసరించారని అన్నారు. తెలంగాణే దాశరథి, దాశరథే తెలంగాణ అన్న స్థాయిని దాశరథి అందుకున్నారని సి.ఎం.ఓ. ఓ.ఎస్.డి. దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దాశరథి స్మృత్యర్థం ఏర్పాటుచేసిన అవార్డును సుప్రసిద్ధ కవి, ఆచార్య ఎన్. గోపికి అందజేశారు. ఈ అవార్డు కింద డాక్టర్ గోపికి లక్షా వెయ్యినూటపదహార్ల నగదు, జ్ఞాపిక, శాలువాను బహూకరించారు. ‘తెలంగాణము రైతుదే’ అని పద్యమై ఉద్యమించిన దాశరథి పేరున ఏర్పాటుచేసిన అవార్డును తంగేడుపూలతో కవిత్వాన్ని ప్రారంభించిన ఆచార్య గోపికి ఇవ్వడం సముచితంగా ఉన్నదని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. పురస్కార గ్రహీత ఆచార్య గోపి మాట్లాడుతూ, కవులను గౌరవించేదే నిజమైన ప్రభుత్వమని అన్నారు. సభలో సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.