acharya– ఆగస్టు 6న సారు జయంతి
– గన్నమరాజు గిరిజామనోహర బాబు

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే విషయం తెలంగాణా ఉద్యమం – దానికి వారిచ్చిన దిశానిర్దేశం వంటి విషయాలే ప్రధానం. కాని వారొక విద్యావేత్త, గొప్ప దార్శనికుడు, భాష విషయంలో నిబద్ధత కలిగిన ఆలోచనా శీలి. తార్కిక భావయుక్తంగా ప్రతీ విషయాన్ని విశ్లేషించగలిగే మనస్తత్వం – ఇవన్నీ జయశంకర్‌ను ఎత్తయిన స్థాయిలో నిలబెట్టాయి. ఒక ఆదర్శనీయుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి.

మౌలికంగా ఆయన విద్యా ప్రేమికుడు. ఉర్దూ మాధ్యమంగా పాఠశాల విద్య, కొంతవరకు కళాశాల విద్య కూడా ఉర్దూ మాధ్యమంగానే సాగింది. ఉర్దూ భాష తనకు మిక్కిలి ఇష్టమైనదిగా తనే చెప్పుకున్నారు. ఉర్దూ – ఇంగ్లీష్‌ – తెలుగు భాషల్లో అనేక విశేషాల్ని గురించి పలు సమావేశాల్లో, పలు సందర్భాల్లో ప్రస్తావించారు. తెలంగాణేతరులు తెలంగాణ భాష, యాసను హేళనగా మాట్లాడిన సందర్భాల్లో వారున్నప్పుడు, సరియైన తర్కంతో తెలంగాణా భాష ఎంతటి శక్తిమంతమైందో కూడా నిరూపిస్తూ వచ్చారు. విజయవాడ వంటి తెలంగాణేతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలంగాణా భాషకు ఎంత ”అడాప్టబిలిటీ” ఉందో ఎన్నో సార్లు విపులంగా చెప్పారు. కరుణశ్రీ వంటి సుప్రసిద్ధ కవులు కూడా తెలంగాణా భాష ఉర్దూ పద భూయిష్ఠమని భ్రమల్లో ఉన్నప్పుడు, వీరు స్వయంగా వారున్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు మాట్లాడే భాషలో వాళ్లకు తెలియకుండానే ఇతర భాషా పదాలను ఎట్లా వాడుతుంటారో కూడా తేల్చి చెప్పేవారు. ఈ విషయంలో కాళోజీ ఎంతటి ప్రజ్ఞ చూపించేవారో, జయశంకర్‌ కూడా అంతటి ప్రతిభ చూపించే వారు. ”మామూలుగా”, ‘పర్వాలేదు” – వంటి పదాలు ఉర్దూవే నన్న స్పృహ కూడా లేకుండా వాళ్ళు ప్రయోగిస్తుంటారు. పైగా కొన్ని పదాలను వ్యతిరేకార్థంలో ప్రయోగిస్తుంటారు ”తనఖా” అంటే ”జీతం” అని అర్థం – కాని దాన్ని ”తాకట్టు పెట్టడం” అనే అర్థంలో వాడు తుంటారు. ”భూమి తనఖా, బ్యాంకు” వంటి ప్రయోగాలు అవే. ఇటువంటి ప్రయోగాలను జయశంకర్‌ కొల్లలుగా చూపించి వాళ్ళ నో ళ్ళు మూయించేవారు. ఆయా భాషల్లో సరైన ప్రవీణ్యం లేకపోతే ఇది సాధ్యం కాదు.

విద్వాన్‌ టి.వి. సుబ్బారావు బహుభాషావేత్త. ఆయన రచించిన ఉర్దూ సాహిత్య చరిత్రకు ఆచార్య జయశంకర్‌ విపులమైన పీఠిక రచించారు. ఆ పీఠికలో తెలంగాణీయులు, తెలంగాణేతరులు మాట్లాడే తెలుగులో ఎన్నెన్ని ఉర్దూ పదాలు ఇమిడిపోయాయో వివరించి, అర్థవంతమైన చర్చచేశారు. భాష పట్ల వారికున్న ప్రత్యయానికి ఈ పీఠిక నిదర్శనం.

కాళోజీ తన గురువుగా భావించే జయశంకర్‌కు కాళోజీ సోదరులపైన వారి కవిత్వ సృజనపైన గొప్ప అభిమానం ఉండేది. ముఖ్యంగా కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవిత్వంపైన మక్కువ ఎక్కువ. హిందుస్తానీ సంగీత ప్రేమికుడైన జయశంకర్‌ కాళోజీ రామేశ్వరరావు గజల్స్‌ గానం చేస్తున్న అనేక సందర్భాల్లో ఆ కవిత్వంలోని విశేషాల్ని, తాత్వికాంశాల్ని గురించి గంటల తరబడి చెప్పేవారనీ, వారిని తెలిసిన గుమ్మడి జనార్దన్‌ వంటి సంగీత విద్వాంసులు చెబుతుంటారు. ఎన్నో సందర్భాల్లో జయశంకర్‌ సామల సదాశివ ఉర్దూ సాహిత్య విశారదత్వాన్ని, ఆయన సంగీత శాస్త్ర ప్రతిభను ప్రస్తావించి అందులోని విశేషాంశాల్ని వివరిస్తుండేవారు.

ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్‌, గొప్ప రాజనీతివేత్త, గొప్ప భాషాప్రేమికుడు. సీఫెల్‌ రిజిష్ట్రార్‌గా, సి.కె.యం. కాలేజీ ప్రిన్సిపాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా తన పరిపాలనా దక్షతను చూపించిన ప్రతిభాశాలి.

చిన్నతనం నుంచే తెలంగాణాపట్ల, తెలంగాణా సంస్కృతి పట్ల, తెలంగాణా వేష భాషలపట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడం వల్ల ఉద్యమస్ఫూర్తి నరనరానా జీర్ణించుకుపోయింది. ఎక్కడ, ఏ విషయంలో తెలంగాణాను చిన్న చూపు చూసినా, అట్లా చూసినవాళ్ళకు సరియైన రీతిలో సమాధానం చెప్పగల ప్రజ్ఞాశాలి.

కొంపెల్లి వెంకట గౌడు, మరికొందరు మిత్రులు వారితో జరిపిన ఇంటర్వ్యూలను తెలుసుకుంటే వారిది ఎంతటి పట్టుదలో, ఎంతటి ప్రతిభో, ఎంతటి స్పష్టమైన ఆలోచనా ధోరణో మనకు అర్థమవుతుంది. వారి బహుముఖీన ప్రతిభే వారిని తెలంగాణా సిద్ధాంతకర్తగా నిలిపింది.

ఆచార్య జయశంకర్‌ మరో పార్శ్వాన్ని సందర్శించినప్పుడు మనం విశేషమైన ఆనందాన్ని పొందడం తథ్యం. తెలంగాణా రాష్ట్ర సాకారం అయిన తరువాత ఇట్లాంటి మహనీయుల జీవన విధానాన్ని, ప్రతిభా సంపత్తిని తదనంతర తరాలకు అందించినప్పుడే తెలంగాణా ప్రతిభ తేటతెల్లం అవుతుంది.

Other Updates