cmsతెలంగాణ సాధనలో గజ్జెకట్టి, పాటపాడి ప్రజలను చైతన్యవంతులను చేసి, పోరాటానికి ఊపిరులూదిన కళాకారుల రుణం తీర్చుకోలేనిదని, వారికి ఎంతచేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్వేగంతో వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 19న జరిగిన తెలంగాణ సాంస్కృతిక వారథి కళాకారుల సమ్మేళన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు చేసిన కృషికి, త్యాగాలకు తాము కల్పిస్తున్న ఉద్యోగాలు చాలా చిన్న విషయమన్నారు. ఈ ఆటా, పాటా, డప్పు చప్పుళ్ళు, గజ్జెల మోతలు బంగారు తెలంగాణ సాధించేవరకు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమాన్ని అజేయశక్తిగా మార్చింది కళాకారులేనని కేసీఆర్‌ కొనియాడారు. ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా కళాకారులు బస్సులు, బండ్లు, లారీలు అని చూడకుండా సభలకు వచ్చి వారి ఆటా, పాటలతో ప్రజలను ఉద్యమంలోకి ఉరికించి, కార్యోన్ముఖులను చేశారన్నారు. కడుపులు మాడినా లెక్కచేయకుండా, ఆకలి, దప్పులకు వోర్చి తమ ప్రదర్శనలు ఇచ్చారన్నారు. ఎక్కడెక్కడో ఉన్న కళాకారులందరినీ ఒక్క వేదిక మీదకు తెచ్చి ధూందాం కార్యక్రమాన్ని ప్రారంభించి రసమయి బాల్‌కిషన్‌ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాడని ప్రశంసించారు. బాల్‌కిషన్‌ త్వరలోనే క్యాబినెట్‌ మంత్రి అవుతాడన్నారు.
తమ ఆటా, పాటలతో జనాలను ఉద్యమం వైపు నడిపి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన కళాకారులు ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథిగా ఉంటూ ఈ ప్రభుత్వం మాది, మనకోసం ఉంది అనే విధంగా ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యేలాగా ప్రజలను ఆ దిశగా ఆలోచింపచేసే విధంగా తమ కళారూపాలతో చైతన్యం తేవాలని సూచించారు. తాను ఈ సభలో పాల్గొంటుంటే తన పుట్టింటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. గత పది మాసాలుగా అధికారిక కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి అయిన తాను ఈ సభకు రావడం ఎంతో సంతోషాన్ని కలుగచేసిందన్నారు. కళాకారులకు ఉద్యోగాల కల్పనే కాదు, వారి కుటుంబాలకు హెల్త్‌కార్డులు కూడా అంచేస్తామన్నారు.

పాత జ్ఞాపకాల్లో ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమకాలం నాటి పాత జ్ఞాపకా లను నెమరువేసుకున్నారు. ఒక్కొ పాట ఒక్కొ ఆణిముత్యంలా ఆంధ్రపాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిందన్నారు. అయ్యోనివా నీవు అమ్మోనివా.., గుంటూరు జిల్లాలో గుంటెడు జాగడిగితిమా లాంటి పాటలు జనాలను యుద్దరంగంలోకి దూకించాయన్నారు. ఎన్ని అణచివేతలు ఎదురైనా బెదరకుండా కళాకారులు తీసుకున్న దృఢ సంకల్పం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు.

ప్రభుత్వం 550 మంది కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసింది, ఎవరైనా ఇంకా మిగిలి వుంటే వారిని కూడా భాగస్వాములను చేస్తామన్నారు. సాంస్కృతిక వారథి భవనంలో కళాకారులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. నిన్నటిదాక ఉద్యమకారులైన మీరు నేటి నుంచి బంగారుతెలంగాణ సాధనలో కరదీపికలు కావాలి అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారానికి సినిమా యాక్టర్లను పెట్టమని, కళాకారులే వాటికి ప్రచారకర్తలుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాలైన మిషన్‌ కాతతీయ, వాటర్‌గ్రిడ్‌ పథకాలకు తగిన ప్రచారం కల్పించి ప్రజల్లోకి వెళ్ళేలా చూడాలన్నారు. వీటితో పాటు ప్రజల్లో నెలకొన్న మూఢాచారాలు, వెనకబాటుత నాన్ని పారద్రోలేందుకు ప్రయత్నించాలని సూచించారు. కళాకారులకు కావాల్సిన అన్ని వసతి సౌకర్యాలు, వస్తు సామగ్రి సమకూర్చాలని ఆయన సాంస్కృతిక శాఖ ముఖ్య` కార్యదర్శి బి.పి.ఆచార్యను ఆదేశించారు.

బోర్ల కాలం పోయి బావుల కాలం

రాష్ట్రంలో చేపట్టిన మిషన్‌కాకతీయ కార్యక్రమంతో బోర్ల కాలం చెల్లిపోతుందని, తిరిగి బావుల కాలం వస్తుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. చెరువులు పునరుద్ధరిస్తే ఒకసారి చెరువు నిండితే మూడు సంవత్సరాలు రైతులకు సాగునీరు లభించే విధంగా పరిస్థితులు మారిపోతాయన్నారు. అలాగే కృష్ణా బేసిన్‌ నుంచి 95 టి.ఎం.సిలు, గోదావరి బేసిన్‌ నుంచి 175 టి.ఎం.సిల నీటిని కూడా నిలువచేసుకునే సామర్ధ్యం లభిస్తుందన్నారు. అందుకే మిషన్‌ కాకతీయకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

దారిద్య్రాన్ని పారద్రోలాలి

తెలంగాణ రాష్ట్రం నుంచి పేదరికం, దారిద్య్రం ప్రారద్రోలగలిగినపుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు సార్దకత చేకూరుతుందని కేసీఆర్‌ అన్నారు. దళితులు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వారిని పైకి తేవడానికి ప్రణాళికలు రూపొందించాల న్నారు. తెలంగాణ ప్రభుత్వం దారిద్య్ర నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆ దిశగానే తమ ప్రణాళికలు తయారు చేశామని, ఎన్నికల మానిఫెస్టోలో కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కళాకారులతో సహపంక్తి భోజనం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళాకారులతో కలిసి సహపక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో అన్నం తింటున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. కళాకారులందరినీ పేరుపేరున పలకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక వారథి చైర్మన్‌ రసమయి బాల్‌కిషన్‌, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, ఢల్లీిలో ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ బి.పి.ఆచార్య, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Other Updates