magaబతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీని తెలంగాణ ఆడపడచులు తమకు తల్లిగారు సారెపెట్టిన విధంగా భావిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నారని, కేసీఆర్‌ను తమ పెద్దన్నగా అనుకుంటున్నారని భారీ పరిశ్రమలు, ఐటీ, చేనేత పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడచు లకు ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరల పంపిణీతో మహిళలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా మహిళల్లో నూతనోత్సాహం, పండగ కళ కానవస్తున్నదన్నారు. పేదల ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ పండగ సందర్భంగా చీరల పంపిణీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాలను తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుందన్నారు. ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి సంబురంగా జరుపుకునే పండగ బతుకమ్మ అని, అలాంటి పండగకు చీరలను

ఉచితంగా ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్‌ పెద్దన్నలాగా ఆలోచించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఆరులక్షల చీరలను పంపిణీ చేశామని కేటీఆర్‌ చెప్పారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించడం కోసం చీరల ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చామన్నారు. సమయం తక్కువగా ఉండడంతో సగభాగం సూరత్‌కు ఇచ్చామన్నారు. తెల్ల రేషన్‌ కార్డులున్న పేదలకోసం మొదటిసారి చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వచ్చే సంవత్సరం చీరల తయారీతో పాటు ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే అన్ని వస్త్రాల తయారీ ఆర్డర్లు వంద శాతం సిరిసిల్ల నేతన్నలకే ఇస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.

నేతన్నలకు చేతినిండా పని: చేనేతజౌళి శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌

తెలంగాణలో భక్తిశ్రద్ధలతో ప్రతిమహిళ ఘనంగా జరుపుకునే పండగకు చీరలు అందించడం, నేతన్నలకు చేతినిండా పనికల్పించాలన్న ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ చీరల పంపిణీ చేపట్టారని చేనేతజౌళి శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ తెలిపారు. కోటి చేనేత చీరలను నేయడానికి మూడేండ్లు పడుతుందని అందుకే పవర్‌లూంపై తయారు చేసిన వాటిని పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 3.70 కోట్ల మీటర్ల 58 లక్షల చీరలు సిరిసిల్లలో తయారు చేసినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో తయారుచేసే పూర్తి సామర్ధ్యం మేరకు వారితో చేయించామని, సమయం లేనందున సూరత్‌లోని వ్యాపారుల నుంచి కొనుగోలు చేశామన్నారు. అయిదువందల రకాల డిజైన్లతో సరఫరా చేశామన్నారు. సిరిసిల్లలో తయారు చేసిన చీరలకు రూ. 224, సూరత్‌ నుంచి సరఫరా చేసిన చీరకు రూ. 200 చెల్లించినట్లు తెలిపారు. బతుకమ్మ చీరల కారణంగా సిరిసిల్లలోని మరమగ్గ కార్మికుల ఆదాయం రూ. 8 వేల నుంచి రూ. 20 వేలకు పెరిగిందన్నారు. అక్కడి కార్మికులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. నేతన్నల కోసం గత రెండేళ్ళుగా చేపడుతున్న కార్యక్రమాలతో వారి వేతనాలు పెరగడంతో పాటు చేతినిండా పని దొరుకుతుందని చేనేతజౌళి శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ పేర్కొన్నారు. బతుకమ్మ చీరల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదని, నాలుగు సార్లు నాణ్యతా పరీక్షలు నిర్వహించామని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ పేర్కొన్నారు.

Other Updates