ఏ ప్రపంచమ్మైన ఈ కవి
తాప్రపంచము బోలనేరదు,
రాతిగుండెలపైననైనా
రాజ్యమేలునురా కవిత్వము!-అంటూ కవిత్వ విశిష్టత, ఔన్నత్యాలపై సాధికారిక ఫర్మానా జారీ చేశారు కవి ముకురాల రామారెడ్డి. తెలుగు సాహిత్యంలోని పద్యం, గేయం, వచన కవిత, వ్యాసం, విమర్శ, కథానిక, మున్నగు భిన్న ప్రక్రియల్లో సృజనాత్మక రచనలెన్నో చేసి తెలుగు సాహిత్యాన్ని, ప్రత్యేకించి తెలంగాణా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రతిభాశాలి ముకురాల. విశాల ఫాల భాగం, దరహాసం విరిసే గుండ్రటి ముఖం, నిశితంగా సూటిగా చూసే కళ్ళు, సౌష్ఠవంతోడి శరీరం, లాల్చీ, పంచెకట్టుతో ప్రత్యేక వ్యక్తిత్వం ప్రతిఫలించే స్ఫురద్రూపం ఆయన సొంతం.
ఆయన, పూర్వ కల్వకుర్తి తాలూకా, మహబూబ్‌నగర్ జిల్లా, మొకురాల గ్రామంలో, కాయకష్టం చేసుకొనే మధ్య తరగతి రైతు కుటుంబంలో రామలక్ష్మమ్మ బాలకిష్టారెడ్డి దంపతులకు జనవరి 3, 1929న జన్మించారు. ఇంటిపేరు మంద, కాని స్వగ్రామంపై అభిమానంతో ‘మొకురాల’ను కవితాత్మకంగా అద్దంలాంటిదనే అర్థంలో ‘ముకురాల’గా మార్చారు. వారి తండ్రి బాలకిష్టారెడ్డికి సంకీర్తన కార్యక్రమాల్లో మంచి మార్దంగికునిగా పేరుండేది. చుట్టుపట్టు వూళ్లలో
రాత్రుళ్లు భజన కార్యక్రమాల్లో పాల్గొని, మద్దెల వాయించి, యధావిధిగా మళ్లీ మోటగొట్టే వేళకు పొలం దగ్గరికి చేరుకునే వాడట! రామారెడ్డిలో బాల్యంనుండి సంకీర్తన సాహిత్య స్పర్శతో కవితాసక్తి మొగ్గతొడిగింది.
నాగలి మేడిపట్టిన రైతుబిడ్డ రామారెడ్డి ప్రస్తుత సమాజంలో చదువుకుగల ప్రాశస్త్యాన్ని గమనించి, ఆత్మవిశ్వాసంతో నిర్విరామంగా శ్రమించి, గ్రామంలోని కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించి, క్రమక్రమంగా పరీక్షలు ప్రైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పి.హెచ్.డి. చేసి డాక్టరేటు పొందారు. ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో ఉప సంచాలకునిగా 17 సం||ల సుదీర్ఘకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా నిర్వహించి పదవీ విరమణ చేశారు.
అయితే ఇదంతా వృత్తిపరంగా ఒక పార్శ్వం, ప్రవృత్తిపరంగా ఆయన సాహిత్య సృష్టి ప్రశంసనీయమైన మరొక పార్శ్వం! సాహిత్య సృష్టికవసరమైన ప్రతిభ, వ్యుత్పత్తి, సాధనలు ఆయనలో ముప్పిరిగొన్నాయి. అలా పాలమూరు జిల్లాలో పటిష్ఠమైన సాహితీ నిర్మాతల్లో ఒకరుగా ఉచిత స్థానంలో నిలిచారు. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, ఆంగ్లం, సంస్కృతాల్లో ప్రావీణ్యం సంపాదించారు. మానసిక శాస్త్రంపట్ల ఆయనకు అభిరుచి మెండుగా వుండేది.
ముకురాల రామారెడ్డి వ్యక్తిత్వం గంభీరమైంది. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా నిర్భయంగా చాటు ధిక్కార స్వరం ఆయనది. ఆయన రచనలన్నీ ధ్వస్తమౌతున్న రాజకీయ, సామాజిక, నైతిక విలువలపట్ల మానసిక సంక్షోభంతో, ఆవేదనతో వెలువరించినవే. మానవ విలువల పతనంపట్ల కలత చెందాడు-
‘ఒడలు తెలియని బడుగుజీవుల
కూపిరూదునురా కవిత్వము’-అన్న కవితా చరణాలు ఆయన కవితోద్దేశాన్ని పట్టిస్తాయి. సందర్భానుకూలంగా రాజకీయ నాయకులపట్ల నిశిత వ్యంగ్య కవితాస్త్రాలు సంధించారు. ఆయన జీవితంలో సుమారు నలభై సంవత్సరాలు సాహిత్య సృష్టికే అంకితం చేశారు. అలా వారు వెలువరించిన రచనలు;
దేవరకొండ దుర్గము (ఖండకావ్య సంకలనం) 1962; (2) మేఘ దూతం (కాళిదాసకృతికి అనుకృతి) 1970; (3) నవ్వే కత్తులు (జాతీయ విప్లవకావ్యం) 1971; (4) హృదయశైలి (ఖండకృతుల సంకలనం) 1979; (5) ప్రాచీనాంధ్రకవిత-ఆదర్శాలు-పరిణామాలు (సిద్ధాంత వ్యాసం) 1989; (6) సాహిత్య సులోచనాలు-1992; (7) రేడియో ప్రసంగాలు-కవితా ప్రతిభ-1999;
ఇంకా పరిపాలన న్యాయ పదకోశం (సంపాదకత్వం) తెలుగు అకాడమీ-సాహిత్య పదకోశం (సంపాదకత్వం), తెలుగు అకాడమీలో పనిచేసినప్పటివి. వీరి ‘రాక్షస జాతర’ పుస్తకం ఆముద్రితం.
‘దేవరకొండ దుర్గము’ గేయకావ్యం ఆయనను సాహిత్య ప్రపంచంలో కవిగా నిలబెట్టింది. తాను అన్నగారు అని గౌరవాదరాలతో పిలుచుకునే కవివతంసుడు సి. నారాయణరెడ్డికి ఈ కావ్యం అంకితమిచ్చాడు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ‘మనసులోని మాట’గా కావ్యావలోడనం చేస్తూ ముకురాలవారి కవిత్వయోగ్యతల్ని వెలువరించి మంచికితాబునిచ్చారు. తెలంగాణ రాజులుగా పేరుపొందిన దేవరకొండ ఏలికలు పద్మనాయకుల శౌర్యసాహసాలు, రాజసాలు, వైభవాలు సత్పరిపాలన, తదనంతర కాలంలో విధ్వంసాలు కండ్లకు కట్టినట్టుగా మాత్రాఛందస్సులో కవిత్వీకరించారు. సందర్భానుకూల శైలీ విన్యాసంతో, కంఠంలోని విచిత్రమైన, ఆయనకే సొంతమైన నొక్కులతో, గొంతెత్తి ఆలపిస్తుంటే సభంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి నిశ్శబ్దం అలముకునేది.
‘వీరలక్ష్మికి కంఠ / హారమే! యెంత గ
ట్టున కోట! యెంత నె / ట్టునకోట! ఎన్నడే / మొనగాడు గట్టెరా
మూడు గుట్టల మూట!-అంటూ మొదలుపెట్టి యుద్ధరంగ వర్ణనను ప్రత్యక్షం చేస్తూ,
‘జోహుకుం సర్దారులేరీ?
జోడుగుర్రపు దౌడులేవీ?
తాడునిచ్చెన,
లాడు గోడు,
కాచిపెట్టిన నూనె కాగులు
కట్ల బల్లెపు కాలిబలగల
మరఫిరంగులు
తోపుబండ్లు
మందుగుండ్లు
మారుదండ్లు
డప్పుకొమ్ములు
డాలుకత్తులు
ఏవి తమ్ముడ?
ఎచట తమ్ముడ?
ఏదిరా ఆనాడు మ్రోగిన
వెలమదొర ఢంకా?-అని ఆలపించి ముక్తాయింపు
ఇవ్వడమే ఆలస్యం, సభాసదులనుండి ఎడతెగని కరతాళ ధ్వనులు, కోలాహలం! మళ్లీ ఒకసారి అంటూ శ్రోతల అభ్యర్థనలూ! మిన్నుముట్టేవి- చాలాసార్లు ఆకాశవాణిలో దేవరకొండ దుర్గం ప్రసాదరమయింది. దేవరకొండ దుర్గము ఖండకావ్యంలో 11 పద్యకృతులు, 9గేయకృతులున్నాయి.
‘మేఘసందేశం’, ‘ఉపమా కాళిదాసస్య’ అని పేరుగాంచిన కాళిదాస కవివరుడు సంస్కృతంలో, మందాక్రాంతవృత్తుల్లో రచించిన మనోహర విరహకావ్యం.-ఈ కావ్యాన్ని ముకురాల వారు ‘మేఘదూత’పేరుతో కులాసాగా పాడుకునే గేయ ప్రక్రియలో స్వతంత్ర రచనగా రూపొందించారు. వారికి సహజంగా అలవడ్డ తెలంగాణ మాండలికాలు, జాతీయాలు, నుడికారాలను అందంగా కావ్యంలో పొదిగారు. ఎడబాటు తొలగిపోయి ఒక్కటైన ప్రేయసీప్రియుల మమతల గురించి
‘నవ్వేకత్తులు’ జాతీయ విప్లవ ఖండకావ్యం.-ముకురాల వారు ఈ ఖండకావ్యాన్ని రెండు భాగాలుగా వ్రాసినారు. మొదటి భాగంలో 113 పద్యాలు, రెండో భాగంలో 17 గేయఖండికలున్నాయి. మతాన్ని, మూఢనమ్మకాలను, సంఘదురాచారాలను నిరసిస్తూ వ్యంగ్యంగా, చమత్కారంగా, విమర్శనాత్మకంగా కవితలల్లారు. దేశభక్తి, జాతీయతలను గురించి స్ఫూర్తిమంతంగా రచనసాగింది. నవ్వేకత్తులు జాతీయ సమైక్యతకు దర్పణంగా నిలిచే కావ్యం!
సాహిత్య సులోచనాలు-ఇందులోని వ్యాసాలెన్నో ఆయా సందర్భాల్లో సాహితీవేత్తల సుముఖంలోరాసి పాడినవి.
పరిపాలన న్యాయపదకోశం, తెలుగు సాహిత్య పదకోశాలు రామారెడ్డి సంపాదకత్వంలో వెలువరించినవి. ఈ రెండు పుస్తకాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖమైనవే కాకుండా ప్రశంసాత్మకమైనవి.
సామాజిక సంక్షోభ సందర్భాల్లో వారి నిజాయితీ, నిర్భీకత ప్రశంసనీయమైనవే. 1969 తెలంగాణ ఉద్యమంలో, వలసాంధ్ర నాయకుల ధాష్టీక పాలనలో 369 విద్యార్థులు తుపాకీ కాల్పుల్లో పిట్టల్లా రాలిపోయారు. తెలంగాణలో మహాకవులనుపించుకున్నవారు, కవి పుంగవులు నాడు సమైక్యతారాగాలు ఆలపిస్తుంటే ముకురాలవారి కవి హృదయం తీవ్రంగా స్పందించింది. తాను ఉద్యోగై వుండి కూడా కలం విదిలించారు. నిర్భయంగా నిరసన తెలిపింది నాడు ఆయనొక్కడే!
‘అలనాడు సవరింపబడిన
తెలంగాణ కోటి రత్నాల వీణ
తీగలను తెంపేసి
అతుక నేర్చుకుంటున్నదా? నెరజాణ,
వీర తెలంగాణానికి
వైరులు ఏకోదరులా?
పల్లె తమ్ములు పూటగడువక
పస్తు పండీ మొలక సీమన
పూడుబావికి మోటతోల్తే
సాగినన్నల పొలాలకు
సాగరం కాల్వా?-అంటూ నిలదీశాడు.
కరవు జిల్లా, లేబర్‌జిల్లా పిలువబడే మహబూబ్‌నగర్ బడుగు బతుకులు కవి రామారెడ్డి హృదయాన్ని గాయపరిచినాయి. 1977 సం||లో తీవ్రమైన కరువుకు జిల్లా ప్రజలు దేశం నలుమూలలా వెళ్లిపోయారు. కోస్తాకు పోయి బ్రతుకుదామని పాలమూరు జాలర్లు పొట్ట చేతబట్టుకొని వలలు భుజాన వేసుకొని వెళ్లారు. కానీ నవంబర్ 19, 1977న ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉప్పెనలో జాలర్లు జాడ తెలియకుండా గల్లంతయినారు. ఈ హృదయవిదారక సంఘటనతో స్పందించిన ముకురాల వారిపై కన్నీటి పాట వ్రాశారు.
కూలి మస్తుగ దొరుకుతాదని
కోస్త దేశం పోతివా? / ఎన్నడొస్తవు లేబరీ!
పాలమూరు జాలరీ!
కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు?
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకూ వెయ్యనందుకు,
ఆ సముద్రం భూతమైపడి అవనిగడ్డకు పొర్లెనంటా!
చర్చినీ, గుడినీ, మసీదును జలసమాధే కలిపెనంటా!
పాడు వార్తే వింటిమోయీ పాలమూరి జాలరీ!
ఎక్కడుంటివి లేబరీ, ఎప్పుడొస్తవు జాలరీ!
1954లో ఆంధ్రపత్రికలో మొదటిసారి అచ్చయిన వీరి కథానిక ‘సర్కారు పైకం’ సార్వకాలీనమూ, సార్వజనీనమూ, నిత్యనూతనం కూడా. -ముకురాల రామారెడ్డి మంచి వక్త. సభారంజకత్వం వారి సొత్తు-పద్యాలావనలో ప్రత్యేక బాణీ. బోధనలో ఆకర్షణీయమైన సరణి-ఇవన్నీ కలిసి ఆయన విద్యార్థులెందరో విశ్వవిద్యాలయస్థాయికి ఎదిగి, తమ రచనలతో తెలంగాణ సాహిత్యాన్ని సంపద్వంతం చేశారు.
డా|| ముకురాల రామారెడ్డి అర్థాంగి శ్రీమతి ఈశ్వరమ్మ. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. జీవిత చరమాంకంలో వీరు కల్వకుర్తిలోని స్వగృహంలో నివసిస్తూ- అనారోగ్యంతో మార్చి 24, 2003లో జీవయాత్ర ముగించారు.
జి. యాదగిరి