ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దత్తత గ్రామం ఎర్రవల్లి తరహాలో పుట్టినిల్లు చింతమడకను దేశం గర్వించేలా సమగ్ర అభివృద్ధి చేస్తాం. ప్రగతి బాటలో ఎదురయ్యే ఆటంకాలను ఐక్యంగా ఎదుర్కొంటామని చింతమడక గ్రామస్తులంతా ఒకే తాటిపైకొచ్చారు. మనందరిదీ ఒకే మాట.. ఒకే బాటగా ఉంటేనే అనుకున్న ఆశయం నెరవేరుతుందని గ్రామ కమిటీగా ఏర్పడి నిర్ణయించారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదామని చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాల ప్రజలు శ్రీకారం చుట్టారు. ఏకతాటిపైకొచ్చిన ఆ మూడు గ్రామాల ప్రజలంతా సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి అభివృద్ధిని సందర్శించారు.

ఎర్రవల్లి గ్రామ తరహాలో.. చింతమడక గ్రామ అభివృద్ధి జరగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. ఆ దిశగా గ్రామస్తులంతా.. ఐక్యతతో కలిసి ముందుకు వస్తే అభివృద్ధి సులువుగా జరుగుతుందని చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామస్తులకు మాజీ మంత్రి, స్థానికి శాసన సభ్యుడు హరీశ్‌ రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలోని ఫంక్షన్‌ హాల్‌ లో ఆదర్శ గ్రామం ఎర్రవల్లి అభివృద్ధి పై చింతమడక గ్రామస్తులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ రెడ్డిలు హాజరై.. ఎర్రవల్లి గ్రామ ఐక్యత.. స్ఫూర్తితో పని చేద్దాం. మూడు నెలల్లో అనుకున్న అభివృద్ధి ఫలాలు సాధిద్దాం. వేగంగా ఐక్యంగా కలిసి పని చేద్దాం. సమష్టిగా కలిసి పని చేస్తే.. సాధించలేనిదేమీలేదంటూ.. గ్రామస్తులందరి సహకారంతో చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాలను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకుందాం. గ్రామమంతా కుటుంబంలా ఉండేలా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చింతమడక గ్రామస్తులతో కలిసి హరీశ్‌ రావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డిలు ఎర్రవల్లి గ్రామాన్ని పరిశీలించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలోకి వెళ్లి నిర్మాణ తీరు, ఖాళీ స్థలం తదితర వాటిని పరిశీలించారు. ఇదే స్ఫూర్తితో చింతమడకలో కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తూ గ్రామస్తుల సందేహాలను నివృత్తి చేశారు.

అక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి అంశాన్ని మూడు గ్రామాల ప్రజలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. దేశం గర్వించేలా చింతమడక అభివృద్ధి చేస్తాం. మూడు నెలల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా కషి చేస్తూనే.. ప్రగతి బాటలో ఎదురయ్యే ఆటంకాలను గ్రామస్తులంతా ఐక్యంగా ఎదుర్కొంటామని ఎర్రవల్లి అభివృద్ధికి తొమ్మిది నెలలు లక్ష్యంగా ఉంటే., చింతమడక అభివృద్ధికి మూడు నెలలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామస్తులు చెప్పారు.

3 గ్రామాలు.. 6 బృంందాలు

చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామస్తులు ఎర్రవల్లి మొత్తం కలియ తిరిగారు. ఒక్కో బృంందానికి నలుగురు ఇంచార్జీలుగా వ్యవహరిస్తూ.., అభివృద్ధి జరిగిన తీరుపై ఆరా తీయగా అభివృద్ధి తీరును ఎర్రవల్లి వీడీసీ వివరించింది. ముందుగా ఎర్రవల్లిలోని ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌ రావు, జిల్లా కలెక్టర్‌తో పాటు ఎర్రవల్లి గ్రామస్తులు వారి అనుభవనాలను వివరించారు. భోజనాల అనంతరం గ్రామంలో పర్యటించారు. 3 గ్రామాల నుంచి మొత్తం 400 మంది రాగా వారిని 6 బృంందాలుగా విభజించి ఒక్కో బృంందానికి ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులు, వీడీసీ సభ్యులు నలుగురిని ఇన్‌ఛార్జ్‌ లుగా నియమించారు. ఆయా గ్రూప్‌ల ఇన్‌ఛార్జ్‌లు గ్రామంలో అభివృద్ధిని వారికి వివరించారు.

ఒక్కో బృంందం ఒక్కో ప్రాంతానికి వెళ్లి అభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎర్రవల్లిలో పాత ఇళ్ల కూల్చివేత నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని వీడీసీ సభ్యులు గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా సందర్శనకు వచ్చిన వారు వారి సందేహాలను వెలిబుచ్చగా వాటన్నింటికీ సమాధానాలు చెబుతూ వీడీసీ నిర్మాణం, గ్రామంలోని కమిటీల ఏర్పాటు, ఆయా కమిటీల పనితీరు తదితర వివరాలను చింతమడక గ్రామస్తులకు వివరించారు. గ్రామంలోని అన్ని ఇళ్లను పరిశీలించి అభివృద్ధి తీరు విషయాన్ని రాబట్టారు.

తిరిగి సాయంత్రం ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమై గ్రామంలో వారు పరిశీలించిన వివరాలు, వారి అనుభవాలను సమావేశంలో పంచుకున్నారు. ఈ స్ఫూర్తితో చింతమడక గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని సభావేదికగా చెప్పారు.

Other Updates