tsmagazine
తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధి స్తూ దేశంలో మరోసారి అగ్రభాగాన నిలిచింది.రాష్ట్ర స్వీయ ఆదాయం (స్టేట్‌ ఓన్‌ టాక్స్‌)లో 17.2 శాతం సగటువృద్ధితో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వెబ్‌ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్‌ నెల నుంచి 2018 మే వరకు వివరాలను సిఎజి ప్రకటించింది. కాగ్‌ విశ్లేషణ ప్రకారం, తెలంగాణ 17.2శాతం వృద్ధిరేటుతో మొదటి స్థానంలో ఉండగా, హర్యానా (14.2శాతం), మహారాష్ట్ర (13.9శాతం), ఒడిశా (12.4శాతం) పశ్చిమ బెంగాల్‌ (10.3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ కారణంగానే ఇంతటి ఆర్థిక వృద్ధి సాధించగలిగామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు పన్నుల చెల్లింపుల్లో ప్రజలు ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి ఆర్థికవృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి దోహదం చేసిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, సుస్థిరమైన వృద్ధిరేటుతో తెలంగాణ మాత్రం ఆర్థిక ప్రగతిని సాధించి అగ్రపథాన నిలవడం శుభసూచకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి పదే పదే గుర్తు చేస్తున్న అంశం తెలంగాణ ధనిక రాష్ట్రమని. నడకలు నేర్చుకుంటున్న నాలుగేళ్ల సమయంలోనే ఆర్థిక సత్తాను చాటి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. తొలి ఏడాదిలోనే సొంత రాబడుల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర సొంత రాబడి తొలి పది నెలల కాలంలో కేవలం రూ.37 వేల కోట్లు మాత్రమే. అందులోనూ ఏడువేల కోట్లు కేంద్ర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కలిసి ఉంది. ప్రభుత్వం రాబడి పెంపకానికి చేపట్టిన నిర్మాణాత్మక అభివృద్ధి పనులు, ప్రత్యేక చర్యల వల్ల ఆర్థిక వృద్ధి రేటు ఊహించని విధంగా పెరిగింది. ఏ రాష్ట్రం తనకు సాటిలేదని, ఎన్నో సవాళ్లను, ప్రతిబంధకాలను, అధిగమించి తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది.

2015-16 లో సొంత రాబడుల ద్వారా రూ.43,260 కోట్ల రాబడి రాగా కేంద్ర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కలుపుకొని అది రూ.50,810 కోట్లకు చేరింది.దీంతో ఆ ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధి రేటు సాధించగలిగింది.2016-17 లో సొంత రాబడుల ద్వారా రూ.54,211 కోట్లు సంపాదించగా.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌తో కలిసి రెవెన్యూ రాబడులు రూ.64 వేల కోట్లకు పెరగడంతో, ఆ సంవత్సరంలో వృద్ధి రేటు 21శాతానికి పెరిగింది. 2017-18 లో సొంత రాబడులు ఒకేసారి రూ.65వేల కోట్లకు చేరుకొన్నాయి. కేంద్ర పన్నుల వాటా కలుపుకొని రూ.73 వేల కోట్లకు చేరుకొన్నది.దాంతో తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 16.8 శాతంగా ఉన్నట్లు కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంమీద తెలంగాణ సగటున 17.2 శాతం వృద్ధిరేటు సాధించినట్లుగా కాగ్‌ లెక్కలు తేల్చాయి.స్టాంపులు,రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, ల్యాండ్‌ రెవెన్యూ వంటి పన్నుల వల్ల వచ్చే రాబడులను సొంత రాబడులుగా పరిగణిస్తారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా తన సొంత రాబడులను పెంచుకుని దేశ ఆర్థిక వ్యవస్థలో అగ్రభాగాన నిలుస్తున్నది.

Other Updates