సామల రాజవర్థన్‌
tsmagazineఅంతరించిపోతున్న జానపద కళలను బతికించుకోవాలని ఆరాటపడుతూ, ఆధారం కోల్పోతున్న వృత్తి కళాకారులలోని ప్రతిభను వెలికితీసి, వారి పనితనాన్ని మెరుగుపరిచే మెళకువలు నేర్పి, సంప్రదాయ వృత్తి పనులకు ఆధునికతను మేళవించి, కొత్తకొత్త డిజైన్లను రూపకల్పనచేసి, తద్వారా వారు తయారుచేసిన వస్తువులకు మార్కెట్‌ను కల్పించాలని తపనపడుతూ, తమ కళలద్వారా దేశవిదేశాలలో అసంఖ్యాకమైన అభిమానులను, శిష్యులను తయారుచేసు కున్నారు కళాతపస్వి రవీంద్రకుమార్‌ శర్మ. ఆదిలాబాద్‌ పట్టణ శివారు ప్రాంతంలో కళాశ్రమాన్ని స్థాపించి ఆదిలాబాదు ఖ్యాతిని శర్మ దేశమంతటా విస్తరింపజేశారు. రవీంద్రకుమార్‌ శర్మ ఈ యేడాది ఏప్రిల్‌ 29న ఈ లోకాన్ని విడిచి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

ఆదిలాబాదు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బహుభాషావేత్త, సాహితీశిఖరం డా|| సామల సదాశివ. మరొకరు కళాశ్రమ వ్యవస్థాపకులు రవీంద్రకుమార్‌ శర్మ గురూజీ.

బయటినుంచి విచ్చేసిన కళాకారులు, సాహితీప్రియులు, పరిశోధక విద్యార్థులు ఈ ఇద్దరినీ కలుసుకోకుండా వెనుదిరిగేవారు కాదు. 2012 ఆగస్టు 7న డా|| సామల సదాశివ దివంగతులైనారు. తర్వాత ఆరు సంవత్సరాలకు రవీంద్రశర్మ గురూజీ స్వర్గస్తులైనారు. ఆదిలాబాదుకు పెద్ద దిక్కులైన ఈ ఇద్దరు కళారత్నాలు ఈ లోకాన్ని విడిచిపోవడం పలువురిని ఆవేదనకు గురిచేసింది.

రవీంద్రశర్మ ఆదిలాబాద్‌ వాసులు. కళాకారులు, అభిమానులు ఆయనను గురూజీ అని సగౌరవంగా పిలుచుకుంటారు. ఇతని కుటుంబీకులు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆదిలాబాదుకు వలసవచ్చినారు. రవీంద్రశర్మ గురూజీ తండ్రిపేరు బనారసీలాల్‌శర్మ. రవీంద్రశర్మ వారికి మూడో సంతానం. అనగా రవీంద్రకుమార్‌ శర్మకు నరేంద్రకుమార్‌ శర్మ, మహేంద్రకుమార్‌ శర్మ అనే ఇద్దరన్నయ్యలు శివకుమార్‌ శర్మ అనే ఒక తమ్ముడు, శోభ అనే ఒక చెల్లెలున్నారు.

బనారసీలాల్‌శర్మవారి అన్న కుందన్‌లాల్‌శర్మ తమ కుటుంబాలతో ఆదిలాబాదు చేరుకొని బ్రాహ్మణవాడలోని ఒక అద్దె ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఎదురుగా ఒక క్యాంటీన్‌ ఏర్పాటు చేసుకున్నారు. బహుశా ఆదిలాబాదులో మొట్టమొదటి క్యాంటీన్‌ అదే కావచ్చు. అది శర్మా క్యాంటీన్‌గా ప్రచారం పొంది… ఈనాటికీ నిలిచివున్నది. కానీ దానికి నాటి వైభవంలేదు.

రవీంద్రశర్మకు చిన్ననాటినుంచి మట్టిలో, పెండ(పేడ)తో బొమ్మలు చేయడం, రాళ్లపై శిల్పాలు చెక్కడం, అంటే మక్కువ. చదువు మీదికంటే వీటిమీదనే అధిక సమయం వెచ్చించడం గమనించి పెద్దవారు ఆ బొమ్మలు కూడూ, గుడ్డా పెట్టవని, బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మందలించేవారు. అయితే అతడు చదువుకుంటూ వుండే ప్రభుత్వ హిందీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవేంద్ర శైలే మాత్రం రవీంద్రశర్మలోని కళాతృష్ణను గుర్తించి ప్రోత్సహించినాడు.
tsmagazine
రవీంద్రశర్మ గురూజీ కుటుంబం మంగమఠం పక్కన ఒక ఇల్లు కొనుక్కుని స్థిరపడిన తర్వాత ఆయన చాలా సమయం మంగమఠంలోనే గడిపేవారు. అక్కడి ప్రశాంత వాతావరణం అతని శిల్పనైపుణ్యం పెంచుకోవడానికి

ఉపయోగపడింది. (ఈనాడు మంగమఠం చాలా మారి పోయింది) కలెక్టర్‌, ఎస్పీ బంగ్లాల చుట్టూ విస్తారంగా బలపం రాళ్ళుండేవి. అవి అతని శిల్ప కళా చాతుర్యాన్ని మెరుగుపరిచే ముడివస్తువులు. ఆ తర్వాత సిరిసెల్మనుంచి పెద్దపెద్ద రాళ్లు తెచ్చుకొని పెద్ద శిల్పాలు తయారు చేయడం మొదలు పెట్టినాడు. ఆ సమయంలోనే గజాసురుణ్ణి చీల్చిన శివుని ప్రతిమ రూపుదిద్దుకున్నది. నటరాజ విగ్రహం. ‘యుద్ధానంతరం’ అనే బొమ్మలు తయారైనవి. దక్షప్రజాపతి బొమ్మకూడా తయారు చేసినాడు. అప్పటికే రవీంద్రశర్మ గురూజీ హైదరాబాదులోని ఫైనార్ట్స్‌ కళాశాలలో చేరిన ఏకైక శిల్ప శాస్త్ర విద్యార్థిగా ప్రొఫెసర్ల మన్ననలు అందుకుంటున్నాడు.

హైదరాబాదులో చదువు పూర్తయిన తర్వాత బరోడాలోని శాయాజీరావు గైక్వాడ్‌ కళాశాలలో చేరి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినారు. అక్కడివారు ఇతనిలోని కళా నైపుణ్యాన్ని గుర్తించి అక్కడే వుండిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినారు. ఉద్యోగం, కళాసాధన.. ఈ రెండింటితో అతని ప్రవాస జీవితానికి ఒక నివాసం ఏర్పడేది. కానీ రవీంద్రశర్మ దానికి ఒప్పుకోలేదు. తాను పుట్టి పెరిగిన ఆదిలాబాదుకు ఏదైనా చేయాలనుకుని తిరిగి వచ్చినారు. చాలామంది అతని శ్రేయోభిలాషులకు అది నచ్చలేదు. కానీ కార్యసాధకునికి అవన్నీ అవసరంలేదు కదా! తాననుకున్నది సాధించడమే అతని లక్ష్యం. దానికోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగువేసేదిలేదని నిశ్చయించుకున్నారు.

ఆదిలాబాదులోని రవీంద్రశర్మ గురూజీ ఇంటిముందు భగవాన్‌రావు రాజే అనే సీనియర్‌ అడ్వొకేట్‌ తన కుటుంబంతో హైదరాబాదు వెళ్లిపోతూ తమ నివాసగృహాన్ని గురూజీ కళాసాధనకు ఉపయోగించుకోమన్నారు. అక్కడనే గురూజీ తాను స్థాపించబోయే కళాశ్రమానికి బీజం పడిందనవచ్చు.

విశాలమైన వాకిలిగల పురాతనమైన మట్టిమిద్దె అది. ప్రాచీన ఆదిలాబాదు కళావైభవాన్ని చాటే హవేలీవంటి ఆ ఇంట్లో గురూజీ కనుమరుగవుతున్న వస్తువులను, ఒకటొకటిగా సేకరించి అక్కడ భద్రపరుస్తూ వచ్చినాడు. ఆదిలాబాదు వాసులకు కొంచెం కొంచెం అతని ప్రతిభ అవగతమవుతూ వచ్చింది.

అతని ప్రతిభ ఆధారంగానే ఆదిలాబాదులోని కొలాం ఆశ్రమ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయ ఉద్యోగం దొరికింది. గిరిజన విద్యార్థులతో సహజంగా వుండే కళలను వెలికి తీయాలని వారికి చిత్రకళ, సంగీత, నృత్యాలు నేర్పవలసిన అవసరం లేదని వారి రక్తంలోనే ఈ కళలు వున్నాయని గట్టిగా విశ్వసించే రవీంద్ర విద్యార్థులకు తెల్లకాగితాలు, పెన్సిల్లు, స్కెచ్‌ పెన్నులిచ్చి మీకు ఇష్టమైన బొమ్మలు వేయమన్నారు. ఆశ్చర్యకరంగా ఆ విద్యార్థులు వేసిన చిత్రాలు అందరినీ అబ్బురపరిచాయి. తర్వాత రవీంద్ర మట్టిపెనాలపై ఆ చిత్రాలను తిరిగి వేయించి తమ కళాశ్రమంలో భద్రపరిచినారు. రవీంద్ర 16 కళల్లో నిష్ణాతులు. మట్టి, కర్ర, శిల, లోహాలతో బొమ్మలు చేయడంలో నేర్పరి. డ్రాయింగయితే మౌలికమైన విషయమే కనుక దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు.

రవీంద్రకుమార్‌ శర్మ సతీమణి రాజశ్రీ సహధర్మచారిణి అనే పదానికి అచ్చమైన ప్రతిరూపం ‘మీ కళాసాధన మీరు చేసుకొనండి. మిగతా సాంసారిక విషయాలను నేను చూసుకుంటాను’ అని చెప్పకనే చెప్పినట్లు చేసి చూపింది. వారిల్లు చిలుకలు వాలిన చెట్టులాగా కళకళలాడుతూ అతిథి అభ్యాగతులతో సందడిగా వుండేది.

రవీంద్రకుమార్‌ శర్మకు అపూర్వకుమార్‌ శర్మ అనే కుమారుడు, కుమార్తె దివ్య వున్నారు. ‘గురూజీ’కి అసంఖ్యాకమైన పురస్కారాలు, సన్మానాలు లభించాయి. ముఖ్యంగా 2010-2011 సంవ త్సరానికిగాను కళారత్న, హంస పురస్కారాన్నందించి ఏపీ ప్రభుత్వం గౌరవించింది. 2015 సంవత్సరం తెలంగాణా ప్రభుత్వం ఉగాది పురస్కారమందించి గౌరవించింది. హర్యానాలోని గురుగ్రామ్‌ ఎస్జీటీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానంచేసి సత్కరించింది. వివిధ విశ్వవిద్యాలయాలు ఆహ్వానించి అతని ఉపన్యాసాలను ఆలకించి, అతనితో చర్చాగోష్ఠులలో పాల్గొని అతనిలోని వాణికి నతమస్తకులై గౌరవించినాయి.

ప్రతి దీపావళికి, ఉగాదికి ఆది లాబాదులోని గురూజీ కళాశ్రమా నికి భారతదేశంలోని వివిధ ప్రాం తాలనుండి కళా కారులు, వృత్తి విద్యా నిపుణులు, మేధావులు, అభి మానులు ఒక చోట చేరి గోష్ఠులు, సంగీత కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు జరుపుతారు. మూడురోజులు సాగే ఈ కార్యక్రమానికి ‘మిత్రమిలన్‌’ అని పేరు పెట్టుకున్నారు.

ఆకాశవాణి ఆదిలాబాదు కేంద్రంవారు ‘శిలాం తరంగాలు’ శీర్షికన ప్రోగ్రాం ఆఫీసర్‌ కీ.శే. ఎస్వీ ప్రసాద్‌ రికార్డు చేసినారు. తర్వాత ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సీ.ఎస్‌. రాంబాబు రవీంద్రశర్మ గురూజీ రేడియో బయోగ్రఫీ రికార్డు చేసి భావితరాలకోసం భద్రపరిచినారు. ప్రస్తుతం ఆకాశవాణి ఆదిలాబాదు కేంద్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి సుమనస్పతిరెడ్డి రవీంద్రశర్మ గురూజీ డాక్యుమెంటరీ చిత్రాలు తీయడమేగాక ‘ఒకనాటి ఆదిలాబాదు’ శీర్షికన గురూజీ ముచ్చట్లను రికార్డు చేసి సంగ్రహాలయంలో భద్రపరిచినారు. అంతేగాక ఆకాశవాణిలో జరిగే ఏ సభా కార్యక్రమానికైనా రవీంద్రశర్మ గురూజీని ఆహ్వానించి వేదికపై కూర్బోబెట్టేవారు. తద్వారా సభకే అందం వచ్చేది.

ఇదంతా గతం. రవీంద్రశర్మ గురూజీ వెళ్లిపోయినారు. వారు ప్రారంభించిన కళాశ్రమం విషాదంలో మునిగి పోయింది. జూన్‌ 07న అనగా తెలంగాణలో మిరుగు (మృగ శిరానక్షత్రం)నాడు 1979వ సంవతర్సంలో ప్రారంభమైన కళాశ్రమం ఈ ‘మిరుగు’నాటికి 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

మిరుగునాడు ఏమి తినాలి? గురూజీ! మిరుగు అంటే ఏమిటి? అని ఇప్పుడు ఎవరినడగాలి? కాలాన్ని ఆపడం ఎవరితరం?

Other Updates