ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరితోనే వ్యవహరించడం వలన పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు చెడిపోయినాయి. అంతర రాష్ట్ర వివాదాలు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. ఫలితంగా ఇచ్చంపల్లి, పెన్ గంగా , ప్రాణహిత, లెండి ప్రాజెక్టులు అమలు కాకుండా లేదా పూర్తి కాకుండా పెండింగ్ పడిపోయినాయి. 1975 లోనే వీటిపై అంతర రాష్ట్ర ఒప్పందాలు జరిగినా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపకపోవడంతో, అంతర రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చలు జరిపి వారిని విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో అవి దశాబ్దలుగా అమలుకు నోచుకోలేకపోయినాయి. దానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులపై చూపించిన వివక్ష తోడైంది.ప్రాజెక్టులపై ఈ స్థితి కొనసాగుతున్న సందర్భంలోనే పొరుగు రాష్ట్రాలతో నీటి పంపకాలు, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం, కోర్టు కేసులు, ట్రిబ్యూనల్‌లో వాదనలు తదితర అంశాలపై పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు బలహీనపడినాయి.
మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ స్థితి మారాలని ప్రభుత్వం భావించింది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం, పరస్పర అవగాహనతో చర్చల ద్వారా అంతర రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకోవాలని భావించింది. తెలంగాణకు అది అత్యవసరం. అంతర రాష్ట్ర వివాదాల కారణంగా పెండింగ్ పడిపోయిన ప్రాజెక్టులన్నీ తెలంగాణవే. ఈ ప్రాజెక్టులని నిర్మించాలంటే మహారాష్ట్ర సహకారం తప్పనిసరిగా అవసరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి అంతర రాష్ట్ర ప్రాజెక్టులపై, వాటి వివాదాలపై దష్టి సారించినారు. గత ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో అనుసరించిన ఘర్షణాత్మక వైఖరిని వీడి స్నేహ సంబంధాలని పెంపొందించుకోవాలని, తమది ఇచ్చి పుచ్చుకునే వైఖరని ప్రకటించినారు. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని పొరుగు రాష్ట్రాలతో చర్చల ప్రక్రియ ద్వారానే అంతర రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకుంటామని అన్నారు.
అందులో భాగంగానే మహారాష్ట్రాతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులైన తుమ్మిడిహట్టి, పెన్ గంగ, లెండి ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి, ప్రాజెక్టు పనులని పురోగతిలో పెట్టడానికి చర్చలకు ఉపక్రమించినారు. తొలుత సాగునీటి శాఖా మంత్రి హరీశ్‌రావు పలు మార్లు ముంబాయి వెళ్లి మహారాష్ట్రా సాగునీటి మంత్రులతో చర్చలు జరిపినారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా ఫిబ్రవరి 2015లో ముంబాయి వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పెన్‌గంగ, ప్రాణహిత, లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించినారు. ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకతను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కి వివరించినారు. ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజిపై వారి అభ్యంతరాలను, మనోభావాలను విన్నారు. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో వ్యవహరించి మూడు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రాత్మక ఒప్పందానికి వారిని ఒప్పించారు.
ఆ తర్వాత మంత్రుల స్థాయిలో, అధికారుల స్థాయిలో సంప్రదింపులు కొనసాగినాయి.ఈ నిరంతర సంప్రదిం పులు ఫలించినాయి. 12 జనవరి 2016 న ముంబాయిలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖా మంత్రుల స్థాయిలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంతర రాష్ట్రాల ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం, వాటి అమలు కోసం ఒక ఉమ్మడి అంతర రాష్ట్ర బోర్డ్ ఏర్పాటుకు సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. బోర్డ్ అంతర రాష్ట్ర ప్రాజెక్టులపై పెండింగ్ సమస్యలని వేగంగా ఇరు రాష్ట్రాలకు అమోద యోగ్యంగా పరిష్కరించాలి. ప్రాజెక్టు పనులను పురోగతిలో పెట్టడానికి పరస్పరం సహకరించుకోవాలి. బోర్డ్ యొక్క విధివిధానాలు ఖరారు అయిన తర్వాత 8 మార్చ్ 2016 న ముంబాయిలో రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి ఉమ్మడి ప్రాజెక్టులపై అంతర రాష్ట్ర బోర్డ్ ఆవిర్భా వానికి ఒప్పందంపై సంతకాలు జరిగినాయి. ఈ క్రింది ప్రాజెక్టులను బోర్డ్ పరిధిలోనికి తీసుకువచ్చి నారు.లెండి ప్రాజెక్టు
- డా. బి ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రాణహితపై తమ్మిడి హట్టి బ్యారేజీ, గోదావరి నదిపై మేడిగడ్డ బ్యారేజీని బోర్డ్ పరిధిలో చేర్చడం జరిగింది.
- పెన్ గంగ నదిపై రాజాపేట్ వద్ద బ్యారేజి
- పెన్ గంగ నదిపై చనకా కొరట వద్ద బ్యారేజి
- పెన్ గంగ నదిపై పింపరాడ్ పర్సోడా వద్ద బ్యారేజీ
- దిగువ పెన్ గంగ ప్రాజెక్ట్
పైన పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణానికి ముందు, నిర్మాణం తర్వాత తలఎత్తే అన్ని సాంకేతిక ఇతర సమస్యలని పరిష్కరించడానికి అంగీకారం కుదిరింది. ఇవే కాక భవిష్యత్తులో గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులు కూడా ఈ అంతర రాష్ట్ర బోర్డ్ పరిధిలోనికే వస్తాయి. బోర్డ్ అవిర్భావం తర్వాత దశాబ్దాలుగా అటకెక్కిన ప్రాజెక్టులు వేగంగా కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, ఉన్నతాధికారులు పరస్పరం సహకరించు కుంటూ ప్రాజెక్టుల సాంకేతిక అంశాలని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నారు.
చనాక కొరాటా బ్యారేజికి సంబంధించిన అటవీ, వన్యప్రాణి, గనుల అనుమతులని మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు చనాక కొరాట బ్యారేజీ పనులు ప్రారంభమయినాయి.
23 ఆగస్ట్, 2016న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులపై సమగ్ర ఒప్పందంపై ముంబాయిలో జరిగిన సమావేశంలో సంతకాలు చేసినారు. ఆదిలా బాద్ జిల్లా తాంసీ, జైనాథ్, బేలా మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన చనాక కొరాట బ్యారేజీ పనులు ప్రారంభం కావడానికి ఈ అంతర రాష్ట్ర ఒప్పందం కారణమయ్యింది.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గత 40 సంవత్సరాలుగా పెన్ గంగ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా తలాపున పెన్ గంగ ఉధతంగా పారుతున్నా అవి సముద్రం లోకి పోయినాయి తప్ప ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా రైతాంగానికి మాత్రం దక్కలేదు. ఈ ఒప్పందం కారణంగా ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా ప్రజల చిరకాల వాంచ అయిన పెన్ గంగ నీరు తాంసీ, బేల, జైనాథ్ మండలాల భూములను తడపబోతున్నది.
లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు చరిత్ర :
తెలంగాణలోఅన్ని ప్రాజెక్టులు ఎదుర్కొన్న వివక్షనే లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు ఎదుర్కొన్నది. వెంగళరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో1975లో మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య లోయర్ పెన్ గంగ ప్రాజెక్టుపై సూత్రప్రాయమైన ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రాలోని యవత్మాల్ జిల్లా ఘటాంజి తాలూకా తాడ్సోలి గ్రామం వద్ద లోయర్ పెన్ గంగ డ్యాం నిర్మాణానికి అంగీకారం కుదిరింది. లోయర్ పెన్ గంగ ద్వయంవద్ద లభ్యమయ్యే నీటిని 88 : 12 నిష్పత్తిలో మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినియోగించుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుని కూడా అదే నిష్పత్తిలో భరించాలి. డ్యాంనుంచి ప్రారంభమయ్యే ఎడమ కాలువ 12వ కిలోమీటర్‌వద్ద పెన్‌గంగ నదిని దాటి ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ మండలంలో గుబడి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. అక్కడినుంచి 90 కిమీల వాలు కాలువ ద్వారా తాంసీ, బేల, జైనథ్ మండలాల్లో 47,500 సాగునీరు అందించడానికి, అటు ఎడమ కాలువ ద్వారా మహారాష్ట్రాలో యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లో 3.77 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపకల్పన జరిగింది. 75 శాతం విశ్వసతనీయతపై మహారాష్ట్రాకు 37.55 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 5.12 టీఎంసీలు వినియోగించుకోవడానికి అంగీకారం కుదిరింది.అయితే 39.92 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ డ్యాం నిర్మాణం వలన మరాఠ్వాడాలోని నాందేడ్ జిల్లాలో సుమారు 47 గ్రామాల, 39,500 ఎకరాల భూమి ముంపు బారిన పడుతుంది. డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక వ్యాజ్యాలు నాగపూర్, ముంబాయి హైకోర్టులలో దాఖలు అయినాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించకపోవడంతో వెనుకబడిన ప్రాంతాలైన ఆదిలాబాద్, యవత్మాల్, చంద్రపూర్ జిల్లాలు పెన్ గంగ నీటిని అందుకోలేకపోయినాయి. దశాబ్దాలు గడచిపోయినాయి. పెన్ గంగ ప్రాజెక్టు పేరు చెప్పి రెండు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు పదవులు పొందినారు. ప్రాజెక్టు మాత్రం కలగానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పెన్ గంగ ప్రాజెక్టుకు మోక్షం లభించింది.
ప్రత్యామ్నాయ పథకం:
భారీ ముంపు కారణంగా లోయర్ పెన్ గంగ డ్యాం నిర్మాణం ఆలస్యం కావడంతో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు పెన్ గంగ నీటిని వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించినారు. పెన్ గంగ డ్యాంకు దిగువన మూడు బ్యారేజీలను నిర్మించి పూర్తిగా కాకపోయినా కొంత నీటిని వినియోగించుకోవచ్చని నిర్ధారించినారు. మూడు బ్యారేజిల్లో రాజాపేట, పింపరాడ్ వద్దనిర్మించే రెండు బ్యారేజీలను మహారాష్ట్రా, రుదా వద్ద నిర్మించే బ్యారేజిని తెలంగాణా ప్రభుత్వం నిర్మించాలని ప్రతి పాదించినారు. బ్యారేజిల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇంజనీర్లు రూపొందించిన ఈ ప్రత్యామ్నాయ పథకాలని రెండు రాష్ట్రాలు అంగీకరించడంతో ఒప్పందంలో భాగమయినాయి. రుదా వద్ద తెలంగాణా ప్రభుత్వం నిర్మించే బ్యారేజి స్థలాన్ని సాంకేతిక కారణాల వలన మరికాస్త కిందకు జరపడంతో అది చనాక కొరాట బ్యారేజిగా మారింది. బ్యారేజికి ఎడమవైపున మహారాష్ట్రాలో యవత్మాల్ జిల్లాలో చనాక , కుడివైపున తెలంగాణా ఆదిలాబాద్ జిల్లాలో కొరాటా గ్రామాలు ఉన్నాయి. బ్యారేజిపై డబుల్ లేన్ బ్రిడ్జి కూడా నిర్మాణం అవుతున్నది కనుక రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు రవాణా సౌకర్యం కూడా ఏర్పడనున్నది. లోయర్ పెన్‌గంగ డ్యాం నిర్మాణం అయ్యేదాకా తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిన 5.12 టీఎంసీల నీటిని బ్యారేజి ద్వారా గ్రావిటీ కాలువలోకి ఎత్తిపోసు కొని వినియోగించుకోవడానికి మహారాష్ట్రా అంగీకరించింది.
చనాక కోరాట బ్యారేజి :
తెలంగాణాప్రభుత్వం చనాక కోరాట బ్యారేజి, పంప్ హౌజ్ , కాలువలు, ప్రెషన్ మెయిన్స్ నిర్మాణానికి రెండు విడతలుగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గ్రావిటీకాలువల నిర్మాణానికి జూలై 2015లో 1227 కోట్లు, బ్యారేజి, పంపు హౌజ్ , ప్రెషర్ మెయిన్స్ నిర్మాణానికి నవంబరు 2015లో 368 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పంపు హౌజ్ ద్వారా ఎత్తిపోసే నీటిని గ్రావిటీ కాలువ 47 వ కి మీ వద్ద జార విడుస్తారు. 42 కి మీ పొడవున్న గ్రావిటీ కాలువ ద్వారా 38,000 ఎకరాలకు జైనథ్, బేల మండలాల్లో సాగు నీరు అందుతుంది. ప్రెషర్ పైపుల ద్వారా ఎత్తిపోసే నీటి ద్వారా తాంసీ, భీంపూర్ మండలాల్లో 14 గ్రామాల్లో మరో 13,500 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మొత్తంగా చనాక కొరాట బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 51,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడనున్నది. మహారాష్ట్రాలో6 గ్రామాల్లో 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
చనాక కొరాట బ్యారేజి పొడవు 342 మీటర్లు, రెండు వైపులా మట్టి కట్టల పొడవు 550 మీటర్లు. బ్యారేజి మొత్తం పొడవు 837.50 మీటర్లు. 23 గేట్లు , బ్యారేజి నీటి నిల్వ సామర్థ్యం 0.85 టీఎంసీలు. జలాశయంలో నీటి నిల్వ నదిలోనే ఉంటుంది కనుక ముంపు లేదు. జలాశయం నదిలో28 కి మీ పొడవున విస్తరించి ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్‌లో నుంచి సుమారు 3 కి మీ ఎగువన పంప్ హౌజ్ నిర్మాణం జరుగుతున్నది.పంప్ హౌజ్‌లో మొత్తం 6 పంపులను బిగించడం జరుగుతుంది. ఇందులో 3 పంపులు ఒక్కొక్కటి 5.5 మేవా, మరో మూడు పంపులు ఒక్కొక్కటి 12 మే వా సామర్థ్యం కలిగినవి.
మొత్తంగా52.50 మే వా సామర్థ్యంతో పంప్‌హౌజ్ నిర్మాణం జరుగుతున్నది. ఈ పంపులను ఇదివరకే దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం తయారు చేయించినారు. వాటిని చనాక కొరటా బ్యారేజి కోసం వినియోగించుకోవడం జరుగుతున్నది. బ్యారేజి, పంప్ హౌజ్, ప్రెషర్ మెయిన్స్, కరెంట్ లైన్స్, సబ్ స్టేషన్, గ్రావిటీ కాలువ పనులు శరవేగంగా సాగుతున్నవి.ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి అయినాయి. జూన్ 2018 కల్లా పంపుల బిగింపు పూర్తి అయి జూలైలో ఖరీఫ్ పంటకు కాలువలోకి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికా బద్దంగా పనులు జరుగుతున్నవి. ప్రాజెక్టుకు అన్నిరకాల క్లియరెన్సులు లభించినాయి. సాగునీటిమంత్రి హరీశ్‌రావు నిరంతర సమీక్షలు, ప్రాజెక్టు వద్ద నిద్ర, వాట్సాప్ గ్రూప్ ద్వారా పర్యవేక్షణలో పనులు
చురుకుగా సాగుతున్నాయి. 2018 ఖరీఫ్‌లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ భగవంతరావు చెప్పారు. ఆ దిశగా ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. పంప్
హౌజ్ నిర్మాణాన్ని అన్ని దశల్లో పర్యవేక్షిస్తున్నారు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి. అట్లాగే పంప్
హౌజ్‌కి విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ టవర్లు, సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు తెలంగాణా ట్రాన్స్ కో డైరెక్టర్ సూర్య ప్రకాష్ 40 ఏండ్ల కల నిజం అవుతున్నందుకు జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాలువల తవ్వకానికి భూసేకరణకు ప్రజలు సహకరిస్తున్నారు. 40 ఏండ్లుగా సాధ్యం కాని ప్రాజెక్టు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన మూడేండ్లకే సాకారం అవుతున్నందుకు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సంబ్రమానికి లోనవుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి అభివద్ధి :
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ ”నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. నీటి వనరులను జిల్లా అవసరాలకు వినియోగించడానికి కొత్త చెరువులను, జలాశయాలను నిర్మిస్తాం” అని ప్రకటించినారు. ప్రకటించి నట్టుగానే పెన్ గంగ బ్యారేజి, కాలువల నిర్మాణానికి నిధులను వెంటనే మంజూరు చేసినారు. మిషన్ కాకతీయలో జిల్లాలో 42 కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతిని ఇచ్చారు. ఇప్పటికే 28 కొత్త చెరువులకు మొదటి దశ పరిపాలనా అనుమతులు జారీ అయినాయి. మిగతా 18 కొత్త చెరువులకు కూడా త్వరలోనే మొదటి దశ పరిపాలనా అనుమతులు జారీ కానున్నవి. కడెం నదిపై కడెం ప్రాజెక్టుకు ఎగువన కుప్టి గ్రామం వద్ద 5 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. డీపీఆర్ తయారైంది. ప్రభుత్వానికి నివేదించే పనిలో ఇంజనీర్లు కషి చేస్తున్నారు. గోదావరిపై సదర్మాట బ్యారేజి నిర్మాణం అవుతున్నది. బాసర వద్ద గోదావరిపై చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కావలసి ఉన్నది. సాత్నాలా, చెలిమెలవాగు, స్వర్ణ కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరు అయినాయి. గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టిన గాద్దేన్న వాగు, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, నీల్వాయి మీడియం ప్రాజెక్టులు పూర్తి అయినాయి. కుమ్రం భీం ప్రాజెక్టును 2019లో పూర్తి చేయడానికి పనులు సాగుతున్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 10 సంవత్సరాలుగా భూసేకరణ సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉన్న 34 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి కింద సుమారు 25 వేల ఎకరాలను కొత్తగా సాగులోనికి తెచ్చాము. జపాన్ ఆర్థిక సహకారంతో ప్రారంభమయిన 47 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 28 వేల ఎకరాలు సాగులోకి తెచ్చాము. మూడు దశల్లో అమలైన మిషన్ కాకతీయ పనులతో 75 వేల ఎకరాలు స్థిరీకరించాము. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఒక లక్షా యాభై వేల ఎకరాలు చెరువుల కింద సాగులోకి తెచ్చాము. వీటిలో బోథ్ ప్రాజెక్టు కింద 5000 ఎకరాలు, బజార్ హాత్నూర్ ప్రాజెక్టు కింద 4,500 ఎకరాలు, చింతల్ బోరి ప్రాజెక్టు కింద 1500 ఎకరాలు,కేస్లాగూడ ప్రాజెక్టులో 4 వేల ఎకరాలు ఈ సంవత్సరం సాగులోకి వచ్చాయి. మొత్తం మీద 1203 పునరుద్ధరణ చేసిన చెరువుల కింద ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణాకు ముందు సాగులో ఉన్న భూమి 50 వేలు మాత్రమే. తెలంగాణా ఏర్పడిన తర్వాత కొత్తగా సాగులోనికి వచ్చిన భూమి 1.30 లక్షల ఎకరాలు. జిల్లాలో ఇప్పుడు వీటి కింద సాగులో ఉన్న మొత్తం భూమి 1.80 లక్షల ఎకరాలు.ఆదిలాబాద్ జిల్లాలో మైనర్, మీడియం ప్రాజెక్టుల కింద ఈ మూడు ఏండ్లలో కొత్తగా 1,87,745 ఎకరాలకు నికరంగా సాగునీటి సదుపాయం కల్పించడం జరిగింది.
క్ర.సం. బ్యారేజి స్థలం నీటి నిల్వ నీటి పంపకం నీటి వినియోగం
తెలంగాణా మహారాష్ట్రా తెలంగాణా మహారాష్ట్రా
1 రాజాపేట 0.70 50 50 0.35 0.35
2 రుదా 1.50 80 20 1.20 0.30
3 పింపరాడ్ 1.50 30 70 0.45 1.05
శ్రీధర్ రావు దేశ్ పాండే