magaతెలంగాణ పల్లెలు ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది అన్న తీర్లలో లేవు. పల్లెలు ఇదివరకటి ఊళ్లోలే లేవు. పల్లెను ఆధునికత అలుముకుంది. పల్లెూ పట్నం లక్షణం అబ్బింది. ఆధునికత ఎంచుకుంటున్నాం అంటే యంత్ర సాంతిేక పరిజ్ఞానం అందుకున్నది. పల్లె అమాయకత్వం ఇంటర్నెట్‌ పరిజ్ఞానం, కళా సాంతిేక పరిజ్ఞానం అందుకున్నది. పల్లె అమాయకత్వం పసి మనసుతత్వం, ప్రేమ సున్నితత్వం ఈ ఐదు పదేండ్లలో పురాగ మాయం అయ్యింది. ఎద్దునాగలి మూలకు పడ్డయి. ట్రాక్టర్లు జోరు అందుకున్నాయి. ఎకరం మడి దున్నాలంటే గంట రెండుగంటలల్ల దున్నుతండ్రు. ట్రాక్టర్‌ వెనుక మంచి తెలంగాణ డి.జె. పాటలు వినుకుంట ఆనందంగా నడుస్తున్నాయి ఎవుసాలు. దున్నడమేకాదు వరికోత, వడ్లు రాల్చుడు అన్నీ యంత్రాలే కల్లంకాడివేచ్చి కొనుక్కపోయి ఆన్‌లైన్‌లో పైసలు ఏస్తున్నరు. ఎవుసం దారులకు సుత చాలామంచి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నయి. వాట్లలల్ల ఇంటర్నెట్‌ కూడా వుంటున్నయ్‌. ట్రాక్టర్లు, బ్లేడ్‌ మిషన్‌లు అంటే భూమి చదును చేసేటివి, కందుకం తీసేటివి, పొక్కలు తోడేటివి.. ఒకటేమిటి మానవ శ్రమలేకుండా తక్కువ ధరకు యంత్ర పరికరాలు వచ్చినయి. ఇన్నొద్దులు నాటు వేస్తుంటే కూలికైకిలోల్లు పాటలు పాడేది. ఇప్పుడు ఆ పాటలు వినకుంట అయ్యింది. ఒక మోతుబరి రైతు నెలరోజులు నాట్లేస్తే ఇప్పుడు రెండు రోజులల్ల నాట్లు ఏసుకుంటండు. వ్యవసాయంలో సాంకేతికతకుతోడు నైపుణ్యతూడా అబ్బింది. ఇది ఒకరినుంచి ఒకరికి అందిపుచ్చుకొని, చైతన్యంపెరిగింది. అట్లనే కూలి కైకిలి చేసుకునే వాల్లు కూడా చిన్నచిన్న బండ్లు మెయింటేన్‌ చేస్తున్నరు. ఇప్పుడు ఇండ్లడ్ల బడికి పోని పిల్లలే లేరు. సర్కారు బల్లకు పిల్లల కరువు ఏర్పడ్డది. పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం చదివించాలనే చైతన్యం వచ్చింది. ఇంగ్లీష్‌తోనే అభివృద్ధి అని ఆవూరి సార్లు, పటేండ్లు, దొరల పిల్లలు ఎన్కట ఇంగ్లీష్‌ మీడియం చదివిన చదువులవల్ల ఉన్నత ఉద్యోగాలు పొందిన అనుభవం కండ్ల కన్పిస్తంది. అందు తెలుగు తెలుగని ఎంత గులిగినా ఇంగ్లీష్‌ బాట పడుతున్నారు.

ఇదే గాకుండా ఊరిలో ఇంటింటికి టెలివిజన్‌ ఉన్నది అన్ని ఛానళ్ళు వస్తున్నయి. ఊరూరికి దినపత్రికలు వస్తున్నయి. ఇగ వాట్సప్‌, ఫేస్‌బుక్‌లు ఊర్లోల్లకు అందరికీ ఉన్నయి. 24 గంటలు సెల్లుల కాలక్షేపం చేస్తున్నరు. ఊరూరికి కులంకులంకు, సోపతిగాళ్లకు అందరికీ వాట్సప్‌ గ్రూప్‌లు ఉన్నయి. అట్లనే తాటి చెట్లల్ల కల్లు తాగేవాల్ల దగ్గర, గౌడన్న దగ్గరూడా సెల్‌ హల్‌చల్‌ చేస్తుంది. ఊర్లె ఏదన్న పండుగో, ఏ భోజనమో ఉంటే సాటింపు చేసేది. ఇప్పుడు చేస్తున్నరు కానీ, దానికన్న ముందే వాట్సప్‌లో పెడుతున్నారు. యూట్యూబ్‌లో చూసి కూరలు వండ నేర్చుకుంటున్నరు. వ్యవసాయ సంబంధ విషయాలు అందులోనే వెతుకుతున్నరు. బడులల్ల సార్లు సుత ఏదైనా పాఠం చెప్పాల్నంటే తమ చేతిల సెల్‌ ఓపెన్‌ చేసి యూట్యూబ్‌లో చూపిస్తున్నరు. టెక్నాలజీని అందుకోవడంలో వాడుకోవడంలో ఊరు పట్నం వలెనే ముందున్నది. ఇప్పుడు అన్ని ఊర్లకు రోడ్లు, నీళ్ళు, కరెంట్‌ ఉన్నయి. ఆఫీసుల పనులు కావాలంటే ఎవలకు వాళ్లే చేసుకుంటున్నరు. పథకాల గురించి ఆయా ప్రభుత్వ సైట్‌లల్ల సెర్చ్‌ చేస్తున్నరు. ఏదైనా సమస్య వస్తే ఆర్టీఏ ద్వారా సమాచారం కోరుతున్నారు. ఇవే గాకుండా కళాత్మక రంగాల్లోనూ పల్లెలు ముందున్నయి. జోక్‌లు, హాస్య రస సన్నివేశాలలో మైవిలేజ్‌ షో అని, మాపల్లె పాటలని యూట్యూబ్‌లో ఛానల్స్‌ను పెట్టుతున్నారు. డాక్యుమెంటరీలు తీస్తున్నరు. తమ దగ్గరున్న సెల్‌ ఫోన్‌లోనే 2, 3 నిమిషాల వ్యవధి చిత్రాలను షూట్‌చేసి వాల్లే ఎడిటింగ్‌ చేసుకుంటున్నరు. పాటలు రాస్తున్నరు. చాలామంది ఎన్కట బతుకమ్మ పాటలు పాడేవాళ్ళు, కొందరు కథలు చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రతిభ అందరినుంచి బయటకు వస్తున్నది. చిన్నచిన్న సినిమాలు/పాటలు ఎన్నో సీడీల రూపంలో బయటకు వస్తున్నయి. పదేండ్లకింద పేరున్నవాళ్లవే సీడీలుగ వచ్చేవి. ఇప్పుడు అట్లకాదు ఎందరివో పాటలు బయటకు వస్నున్నయి, లేకపోతే యూట్యూబ్‌లో పెడుతున్నరు. ఆడ్‌సెన్స్‌ ద్వారా వీక్షకులు ఎక్కువచూస్తే వాళ్ళకు రెమ్యునరేషన్‌ వస్తున్నది. అట్లనే కవిత్వం, కథలు రాసేవాళ్లసంఖ్య, చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. మద్యం దుకాణాలు ఊరూరికి ఉన్నయి. రాజకీయ పార్టీల నాయకులు ప్రతినిధులు అన్ని పార్టీల జెండా గద్దెలు ఉన్నయి. ఇదివరకటిలాగ ఒక్కలు చెప్పితే అందరు వినే స్థితినుంచి ఎవరికి వాల్లే స్వయం ఆలోచనారీతిగా మెదులుతున్నారు. అభివృద్ధి గురించి చర్చిస్తున్నరు. ఊరు అమాయకత్వంనుంచి లౌక్యం నేర్చుకుంది. ఊరు సున్నితత్వంనుంచి గడుసుదనం చెందుతున్న దశ ఇది.

అన్నవరం దేవేందర్‌

Other Updates