tsmagazine

ఆధునిక యుగంలో
కూడా ఘనమైన తెలంగాణ సాహితీ వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది. ఇరవయ్యవ శతాబ్ది ఆదిలో ఆవిర్భవించిన నవ్య కవితా ధోరణులు మొదలుకొని నేటి కవిత్వోద్యమాలన్నింటిలోనూ తెలంగాణ కవులు ముఖ్య పాత్ర వహించి ముందంజ వేశారు. రాయప్రోలు, కృష్ణశాస్త్రిలతో ప్రారంభమైన భావకవిత్వం ఈ ప్రాంతంలో వెలువడలేదన్నది కేవలం అపోహ మాత్రమే. సురవరం, బూర్గుల, ఆయన కుమారుడు రంగనాథరావు, ‘సాహితీమేఖల’ స్థాపకుడు అంబటిపూడి వెంకటరత్నం మున్నగువారు రమ్యమైన భావకవితా రచనలు వెలువరించారు. పల్లాదుర్గయ్య గంగిరెద్దు, పాలవెల్లి సంపుటులు గ్రామీణ ప్రకృతి శోభను, పల్లీయ జీవితాన్ని నిసర్గ సుందరంగా వర్ణించాయి. గంగుల శాయిరెడ్డి కాపుబిడ్డ కర్షక కవిత్వ శాఖలో కలికితురాయిగా ఎన్నదగినవి.

అభ్యుదయ కవిత్వ భాగమైన తెలంగాణా విముక్తి పోరాట కవిత్వం సాహిత్య చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా గుర్తింపు పొందింది. నిజాంరాజు నిరంకుశ పాలనను ఎదిరించి స్వాతంత్య్ర సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మేటికవి దాశరథి ‘రుద్రవీణ’ను మోగించి ‘అగ్నిధార’ను వర్షించాడు. ఆయన ‘తిమిరంతో సమరం’ కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి నందుకొన్నది. యాదగిరి, తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు పాటల ద్వారా విముక్తి పోరాటానికి అండగా నిలిచారు. ప్రజల బాధనే తన ‘గొడవ’గా చేసుకున్న కాళోజీ వాడియైన తన కవితా పంక్తులతో ప్రజా పోరాటానికి ప్రతినిధిగా నిలిచాడు.

సమకాలీన ఉద్యమాల చైతన్యాన్ని జీర్ణించుకొని మానవతావాద మంత్రాన్ని వినిపించిన మహాకవి సి.నారాయణ రెడ్డి నిరంతర కవితా ప్రస్థానంలో నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, రామప్ప మొదలగు అసంఖ్యాక మైలురాళ్ళు గోచరిస్తాయి. తెలంగాణకు జ్ఞానపీఠ బహుమతిని ఆర్జించిన ఘనకీర్తి ఆయనది. సంప్రదాయ జాతీయవాద దృక్పథంతో వెలసిన నవ్యసంప్రదాయ మార్గంలో వెలువడిన మహాకావ్యాలు వానమామలై వరదాచార్యుల ‘పోతన చరిత్రము’, జగన్నాథాచార్యుల ‘రైతు రామాయణం’, ఉత్పల సత్యనారాయణచార్య, వేముగంటి నరసింహాచార్యులు ప్రభృతులు ఈ మార్గంలో పద్యకావ్యాలు వెలువరించారు. పద్యసుకవిగా పేరొందిన ఉత్పల ఆధిక్షేప, వ్యంగ్య కావ్యాలతోపాటు చక్కని ఆధ్యాత్మిక కావ్యాలు వెలువరించి సాహిత్య అకాడమి బహుమతి (శ్రీకృష్ణ చంద్రోదయము) పొందాడు. ఆధునిక విజ్ఞానం మానవ ప్రగతికి దోహదం చేయాలన్న సందేశంతో చేతనావర్త కవులు (సంపత్కుమార, పేర్వారం, వేనరెడ్డి, సుప్రసన్న) అనుభూతిపరమైన కవితా సంపుటులు ప్రచురించారు.
tsmagazine
కవితారంగంలోని స్థబ్ధతను తొలగించి చైతన్యం రేకెత్తించాలన్న ఉద్దేశ్యంతో రంగ ప్రవేశం చేసిన ఆరుగురు దిగంబర కవుల్లో ముగ్గురు తెలంగాణా వారే- చెరబండ రాజు (బద్దం భాస్కరరెడ్డి), జ్వాలాముఖి (ఏవీ రాఘవాచార్యులు), నిఖిలేశ్వర్‌ (యాదవరెడ్డి). వారు ఆశించిన వ్యవస్థా నిర్మూలనం, బలప్రయోగం ద్వారానే సాధ్యమౌతుందన్న విశ్వాసంతో 1970లో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. చెరబండరాజు, జ్వాలాముఖి విరసంలో చేరి దాన్ని ముందుకు నడిపించారు. ఉర్దూ సాహిత్యంలోని గజళ్లు, రుబాయీల కవితా మాధు ర్యాన్ని తెలుగు పాఠకులకు చవిజూపారు దాశరధి, సి.నారాయణరెడ్డి. దాశరధి ‘గాలిబ్‌ గీతాలు’ (1965) రాష్ట్ర ప్రభుత్వ బహుమతికి పాత్రమైంది. ప్రణయానికి బదులుగా మానవీయ కోణంతో సున్నితమైన అధిక్షేపాలు రంగరించి ‘తెలుగు గజళ్లను మలచిన సి.నా.రె. రుబాయీ సంప్రదాయంలో ప్రయోగాలు (ప్రపంచపదులు) చేశారు. పార్శీ భాషా కోవిదులైన బూర్గుల రామకృష్ణారావు ‘ఉమర్‌ ఖయ్యూం’ రుబాయీలను, ‘సర్మద్‌ గీతాల’ను తెనుగించారు. సంగీత సాహిత్య సమ్మేళనమైన సదాశివ బహుభాషా కోవిదులు.

నాలుగుపదులు నిండకముందే దివంగతుడైన కవితాయోధుడు అలిశెట్టి ప్రభాకర్‌ కార్టూన్‌ కవితారూపంలో ప్రతిభను కనబరచాడు. వివిధ శీర్షికల్లో వెలువడిన అతని కవితలు ‘సమగ్ర కవిత’ పేరుతో (2013) సంకలితమైనాయి.

కవితా సంకలనాల ప్రకాశంలో కూడా తెలంగాణాది అగ్రస్థానం. ప్రాచీన తెలంగాణ సంకలనాలైన బృహత్కథ (ప్రాకృతం), సకలనీతి సమ్మతం (తెలుగు)ల స్ఫూర్తినందుకొని, తెలంగాణలో కవులేలేరన్న దురభిప్రాయాలను ఖండిస్తూ ప్రసిద్ధ పత్రికా సంపాదకులు, సురవరం ప్రతాపరెడ్డి 1934లో ప్రచురించిన ‘గోలకొండ కవుల సంచిక’ (354మంది సంస్కృతాంధ్ర కవితలు) ఆధునికయుగంలో వెలువడిన ప్రప్రథమ కవితా సంకలనం అన్నది చారిత్రక సత్యం. దీనికి సంవత్సరం తర్వాత ఆంధ్రప్రాంతంనుంచి ‘వైతాళికులు’ (1935) వెలువడింది. తెలంగాణాలో నెలకొన్న సాహితీసంస్థలు-సాధనసమితి, తెలంగాణ రచయితల సంఘం మొదలైనవి, అంజలి (1940), తొలిసంజ (1946), ప్రత్యూష (1950), ఉదయఘంటలు (1953) సంకలనాలు వెలువ రించాయి. వీటిననుసరించి ఉమ్మడి పాలమూరు జిల్లా వనపర్తిలో స్థాపితమైన జ్యోతిర్మయి 33మంది జిల్లా కవుల కవితలను సంకలించి ‘జ్యోతిర్మయి’ పేరుతో (1966) ప్రకటించింది. 20వ శతాబ్దిలో వెలువడిన తొలి కవితా సంకలనంగా గోలకొండ కవుల సంచిక, ఆధునిక జిల్లా కవుల సంకలనంగా జ్యోతిర్మయి సంకలన చరిత్రలో మైలురాళ్లుగా నిలుస్తాయి.

కథా సంకలనాలకు కూడా తెలంగాణ మార్గదర్శకత్వం వహించింది. 1956 (ఆంధ్రప్రదేశ్‌ అవతరణ)కు ముందే అణాకథలు (1940), కమ్మ తెమ్మెరలు (1940), కథావాటిక (1945), పాలవెల్లి (944), రంగవల్లి (1946), సాధన (1953), కథానికాగుచ్చము (1953), పరిసరాలు (1956) మొదలగు విశిష్ట కథాసంకలనాలు ఈ ప్రాంతంనుంచి వెలువడినా కథా విశ్లేషకులు, సంకలన కర్తలు వీటిని ప్రస్తావించక పోవడం అన్యాయం. కథానికా ప్రక్రియకు తెలంగాణలోనే పునాదులు పడ్డాయన్న సత్యాన్ని వీరు విస్మరించారు. గురజాడ ‘దిద్దుబాటు’కు (1910) పది సంవత్సరాలముందే (1900) బండారు అచ్చమాంబ కథలు జనానా, హిందూ సుందరి పత్రికల్లో అచ్చయినాయి. కొమర్రాజు లక్ష్మణరావు సోదరి అచ్చమాంబ మెట్టినిల్లు దేవరకొండ (నల్లగొండ జిల్లా) కాగా, భర్త ఉద్యోగరీత్యా ఆమె భోనగిరి, నాగపూరు ప్రాంతాల్లో నివసించింది. తెలంగాణ ఆంధ్రోద్యమ పితామహులు మాడపాటి హనుమంతరావు కథలు 1911-12 మధ్య ఆంధ్రభారతి పత్రికలో ముద్రితమైనాయి. పాలమూరు తొలిపత్రిక ‘హితబోధిని’లో (1913-14) దాని సంపాదకులు బండారు శ్రీనివాసరావు కథలు వెలువడ్డాయి. సురవరం, వట్టికోట, భాస్కరభట్ల, నెల్లూరి కేశవస్వామి, బూర్గుల రంగనాథరావు, నందగిరి ఇందిరాదేవి, పి.యశోదారెడ్డి, ఇల్లిందల సరస్వతి మొదలుకొని సురమౌళి, గూడూరి సీతారాం, వల్లపురెడ్డి వరకు ఎందరో కథానికా రచనలో విశిష్టతను గడించారు.

శ్రీరంగరాజ చరిత్ర (1972), రాజశేఖర చరిత్రము (1976)లకు ముందే నల్లగొండ జిల్లాకు చెందిన తడకమళ్ల వెంకట కృష్ణారావు 1866 ప్రాంతంలో నవలా రచనకు నాంది పలికారన్నది సత్యం (కంబకంధర చరిత్ర, కామరూపకథ) ఇటీవల వెలుగులోకి వచ్చింది. చారిత్రక, సాంఘిక నవలను (నౌకా భంగము) ఆంధ్రీకరించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ తెలంగాణా ప్రజల సాయుధ పోరాటాన్ని చైతన్య స్ఫూర్తితో ప్రదర్శించింది. తెలంగాణా విముక్తికిముందు-తర్వాత నెలకొన్న జనజీవితానికి దర్పణం పడతాయి. దాశరథి రంగాచార్య నవలలు. భాస్కరభట్ల కృష్ణారావు అస్తిత్వవాద నవలా రచయితగా (యుగసంధి, వెల్లువలో పూచికపుల్లలు) పేరు గడించారు. ఎమర్జెన్సీ నిర్బంధ బాధలకు బలి అయిన వి. తిరుపతయ్య నవలల్లో బడుగుజీవుల జీవన పోరాటం చిత్రితమైంది. వ్యాపార దృష్టితో ధారావాహిక నవలలు (సీరియల్స్‌) వెలువడుతున్న కాలంలో (1950 తర్వాత) వాటికి భిన్నంగా సామాజిక దృక్పథంతో నవలలు వెలువరించిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన.
20వ శతాబ్ది ప్రారంభంలోనే కనకతార మొదలు ప్రజాదరణ పొందిన పద్య నాటకాలు రచించిన చందాల కేశవదాసు (1876-1956) తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1934) ద్వారా తొలి సినీ గేయ రచయితగా పరిచయమైనాడు. శ్రీకృష్ణ తులాభారం, సతీ అనసూయ మున్నగు చలనచిత్రాలకు స్క్రిప్టు, పాటలు సమకూర్చి కేశవదాసు పాటలు (భలేమంచి చౌక బేరమూ, మీరజాలగలడా నాయానతి) నేటికీ ప్రజల నాలుకలపై నిలిచి ఉన్నాయి. ప్రసిద్ధ కవులైన దాశరధి, సినారెలు సినిమా రంగంలో ఖ్యాతి గడించిన ప్రస్తావన స్మరించటం ఇక్కడ అప్రస్తుతం కాదనుకొంటాను. జాతీయోద్యమ ప్రభావంతో సోమరాజు రామానుజరావు (1896-1934) రచించిన ‘స్వరాజ్య రథము’ నాటకం 1922లో బ్రిటిష్‌ ప్రభుత్వ నిషేధానికి గురియైందంటే దాని ప్రభావం తేటతెల్లమవుతుంది. సురవరం ప్రతాపరెడ్డి ఉచ్చల విషాదము, భక్తతుకారాం నాటకాలు నాడు ప్రశస్తి వహించాయి. నిషేధాజ్ఞలను ధిక్కరించి గుంటూరుకు నడుచుకొంటూ వెళ్లి గాంధీని దర్శించిన స్ఫూర్తితో మఠం రాచయ్య రచించిన ‘మహాత్మాగాంధీ’ నాటకం పలుమార్లు ప్రదర్శింప బడింది. అనంతర కాలంలో ఏ. ఆర్‌. కృష్ణ, కె.ఎల్‌. నరసింహారావు, వెల్దుర్తి మాణిక్యరావు, పొట్లపల్లి రామారావు, ఆర్‌. విద్యాసాగర్‌రావు మొదలగువారు నాటక-నాటికల రచయితలుగా కీర్తి గడించారు.

సృజనాత్మక రంగంలోనేకాక పరిశోధన-విప్లవరంగంలోకూడా విశిష్ట స్థానం గడించిన తెలంగాణ విద్వాంసులు ఎందరో ఉన్నారు. ఇతర ప్రాంతాలలో జన్మించినప్పటికీ కొమర్రాజు లక్ష్మణరావు, శేషాద్రి రమణ కవులు (దూపాటి శేషాచార్యులు, వెంకటరమణాచార్యులు) తెలంగాణ చరిత్ర సాహిత్య, శాసనాల పరిశోధనకు మార్గదర్శకులైనారు. మద్రాసునుంచి వచ్చిన మానవల్లి రామకృష్ణకవి వనపర్తి సంస్థానంలో కార్యదర్శిగా (1904-13) ‘విస్మృత కవులు’ శీర్షికలో అనేక ప్రాచీన కావ్యాలను వెలుగులోకి తెచ్చారు. ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, బి. రామరాజు, గడియారం రామకృష్ణశర్మ ప్రభృతులు సంస్కృతి, సాహిత్యాల పరిశోధనలో వాసికెక్కారు. కేంద్ర సాహిత్య అకాడమీ తొలి బహుమతిని అందుకొన్న ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు, వ్యాసాలు ప్రతాపరెడ్డి పరిశోధనకు నిదర్శనాలు. విష్ణుకుండినులపై విశేష పరిశోధన సలిపి శాసనాల శాస్త్రిగా పేరొందిన భిన్నూరి నరసింహం (బి.ఎన్‌.) శాస్త్రి భారతదేశ-ఆంధ్రదేశ చరిత్ర సంపుటులనేకాక జిల్లా విజ్ఞాన సర్వస్వాలను ఒక్క చేతిమీదుగా వెలువరించారు. జానపద వాజ్ఞ్మయంపై బి. రామరాజు, ప్రబంధ వాజ్ఞ్మయ వికాసంపై పల్లా దుర్గయ్య, శతక సాహిత్యంపై కె. గోపాలకృష్ణారావు హరివంశములపై పి. యశోదారెడ్డి, ఆరె జానపద సాహిత్యంపై పేర్వారం జగన్నాథం అత్యుత్తమమైన సిద్ధాంత గ్రంథాలు విరచించి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేట్‌ పట్టం పొందారు. ఛందస్సు-అలంకార శాస్త్రాలలో నిష్ణాతులైన కోవెల సంపత్కుమారాచార్య సాహిత్య విమర్శలో అలంకార శాస్త్ర సంప్రదాయ ప్రసారాన్ని విశిష్టంగా వివేచించారు. తెలంగాణ సాహిత్యరంగాన్ని అమేయమైన ప్రతిభతో సుసంపన్నం చేసిన కీర్తి విశేషులను గురించి మాత్రమే ఈ వ్యాసంలో ప్రస్తావితమైంది. సమకాలీన సాహితీ వైభవ పరామర్శ మరొక విస్తృత గ్రంథం కాగలదు.

సూగూరు స్వయంప్రభ

Other Updates