డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ


తెలంగాణ రాష్ట్రంలో ఒకటింట పదవవంతుల జనాభా గిరిజనులది. వీరి జీవన సంస్కృతులు గ్రామీణులు, పట్టణవాసులకంటే ప్రత్యేకమైనవి. వారి జీవన సంస్కృతులకు మూలమైనవి కాబట్టి ఆయా జీవన సాంస్కృతిక విశేషాలు చూసి తెలుసుకోవడానికి వీలుగా ప్రభుత్వం గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసింది. గిరిజన మ్యూజియంలో ప్రదర్శించవలసిన గిరిజన వస్తు సముదాయాన్ని అధికారులు 1962-63 నుంచి సేకరిస్తూ వచ్చారు. ఆ గిరిజన వస్తువులు, కళా ఖండాలను తాత్కాలిక మ్యూజియంలలో ప్రదర్శిస్తూ వచ్చారు. అనంతరం 1989 నాటికి ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శత జయంతిని పురస్కరించుకుని పూర్తి స్థాయి రాష్ట్ర గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని తలపెట్టి 2003నాటికి పూర్తి చేశారు. అందులో ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తున్న గిరిజన సముదాయాలు ఆవాసాలు, వస్తు సంస్కృతిని ప్రదర్శించడం జరిగింది.

2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఈ గిరిజన మ్యూజియంను సందర్శిస్తున్న పర్యాటకలు, పరిశోధకలు, అధికారులు ఈ మ్యూజియంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన గిరిజన తెగల వస్తువులు సంస్కృతులు ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని భావించడంతో, మూడేళ్ళకిందటి నుంచి ఆ దిశగా చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు ఖరారైననాటి నుంచి హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో వున్న ఈ నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన తెగల ముఖ్యమైన వస్తువుల, సంస్కృతుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడం పూర్తి అయింది. ఇలా ఆధునీకరించిన ఈ గిరిజన మ్యూజియంను ‘కోవిడ్‌`2019’ నిబంధనల దృష్ట్యా హంగు ఆర్భాటాలు లేకుండా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2020 ఆగస్ట్‌ 9న రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సందర్శించి ఆవిష్కరించారు.

20,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మ్యూజియంలో మూడు అంతస్థులున్నాయి. భూ ఉపరితల అంతస్థులో (గ్రౌండ్‌ ఫ్లోర్‌) అత్యంత వెనుకబడిన ఆదిమ గిరిజన సముదాయాల ఆవాస-వృత్తి సంస్కృతులను, మొదటి అంతస్థులో ఇతర ప్రధాన గిరిజన తెగల ఇళ్ళు-వృత్తి విశేషాలను, రెండు అంతస్థులో అన్ని ప్రధాన తెగల వస్తువులు సంస్కృతులను ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ఆ వివరాలు:





గ్రౌండ్‌ ఫ్లోర్‌లో
మ్యూజియం ప్రాంగణాన్ని సందర్శకులను సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లుగా తీర్చిదిద్దడం జరిగింది. నాయకపు గిరిజనులను పూజించే సాంబశివుడు, భీముడి శిరస్సు చిత్రలేఖనాలను ఒక్కొక్కటిని 30 చ॥అడుగుల విస్తీర్ణంలో (7 అడుగుల ఎత్తుతో) ప్రాంగణంపై చిత్రించడం జరిగింది. ప్రాంగణానికి కుడివైపు ఆవరణలో గోండు గిరిజనుల అత్యంత వైభవంగా జరుపుకునే గుస్సాడి నృత్య శిల్పాలను నిలువెత్తు వాటిని నిలుపడం జరిగింది. ప్రాంగణానికి ఎడమవైపు ఆవరణలో కోయ పురుషు, స్త్రీలు చేసే కొమ్ము (పెరం కోక) నృత్య శిల్పాలను సమకూర్చడం జరిగింది. మ్యూజియం ప్రాంగణంలోకి ప్రవేశించగానే చెంచు గిరిజన గుడిసె పై కప్పు మాదిరి కంక బద్ద నిర్మాణంతో టికెట్‌ కౌంటర్‌ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి ఎదురుగా నెహ్రూ విగ్రహం (ఇత్తడిది) కనిపిస్తుంది. ఆయన గిరిజన సంక్షేమానికై పంచశీల సూత్రాలను రూపొందించినందుకు గౌరవంగా ఈ మ్యూజియానికి నెహ్రు పేరు పెట్టారు.

మ్యూజియం ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎడమవైపు గోడలకు 13 నాయకపు గిరిజన ఆరాధ్య దేవతా శిరస్సు శోభాయమానంగా కనిపిస్తాయి. నాయకపోళ్ళు లక్ష్మీదేవరను, ఆమె భర్త క్రిష్ణమూర్తిని, తమ్ముడు పోతురాజును, తమ్ముళ్ళు పంచపాండవులను, 14వ శతాబ్దంనాటి రాజు ప్రోయ, సింగబోయడును, నల్లగొండ, ఎర్రగొండ రాక్షసులను గురాపోతు, పందిరాజు, లేడి మొదలైన జంతు శిరస్సులను (మాస్కులను) తమ దేవాలయాలైన ఇల్లాయి, నగరులో పూజిస్తారు. రెండడుగుల ఎత్తైన ఆ రంగు రంగు శిరస్సులు అన్నీ ఒకే చోట కన్పించడం సందర్శకులకు అరుదైన అనుభూతినిస్తుంది.

నాయకపు మాస్కుల పక్క దర్వాజా శబ్దదృశ్యాల (ఆడియో విజువల్‌ హాల్‌)లోకి ఆహ్వానిస్తుంది. విద్యార్థులు, పర్యాటకులు, పరిశోధకులు, అధికారులకు ఈ హాలులో 5 నుంచి 25 నిమిషాల నిడివిలో నడిచే డాక్యుమెంటరీను ప్రదర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన గిరిజన తెగల ప్రత్యేక వృత్తుల, ఆచార సాంప్రదాయాలు, నృత్యాలు, పండుగలు-జాతరలు తదితర సాంస్కృతిక విశేషాలతో ఈ డాక్యుమెంటరీను రూపొందించారు. వీటి ద్వారా వీక్షకులకు క్షేత్ర స్థాయి గిరిజన జీవన సంస్కృతులను చూసిన అనుభూతి వస్తుంది. ఒకసారి 80 మంది కూర్చోగలిగిన ఈ హాలులో చిన్నచిన్న కార్యక్రమాలు కూడా జరుపుకునేందుకు వీలుగా వేదిక ఏర్పాట్లున్నాయి.

ఈ హాలుకు ఎదురుగా ఆదిమ గిరిజన ఆవాస-వృత్తుల గ్యాలరీ సముదాయం ఉంది. కోం, తోటి, కొండరెడ్డి, చెంచు-వీరు నిర్మించుకునే ప్రత్యేక పద్ధతుల్లోనే వారి గుడిసెను నిర్మించి, వాటి వెనుక వారి వారి ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను ఉబ్బెత్తు చిత్రలేఖనాలో (మ్యురల్స్‌) చిత్రించి, ఆయా గుడిసెల ముందు ఆయా గిరిజన తెగల స్త్రీ, పురుషుల శిల్పాలను సంప్రదాయ వృత్తి పనులు చేస్తున్న భంగిమలో నిలుపడం జరిగింది. చెంచులు నల్లమల కొండల్లో నేర్పుగా తేనె సేకరించే విధానాన్ని ఒక ప్రత్యేక ఉబ్బెత్తు చిత్రలేఖనంలో (మ్యురల్‌) చూపడం జరిగింది. ఈ తెగల, వారి వృత్తి, అక్షరాస్యత, భౌగోళిక పరిస్థితులు, ఆచారాలు, నమ్మకాలు, దేవతలు తదితర ముఖ్యమైన వివరాలు ప్రతి గిరిజన ఆవాసం ముందు ఒక డిజిటల్‌ కియోస్క్‌లో ఇంగ్లీషులో, తెలుగులో, ఫోటోలలో, వీడియోలలో అందుబాటులో ఉంచడం జరిగింది.

ఆదివాసుల గ్యాలరీ నుంచి మొదటి అంతస్థులోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇరు పక్కున్న మెట్ల వరుసల మధ్య ‘గోండు ఎడ్ల బండి మీద వెళ్తున్న మనిషి’ సెట్‌ కనిపిస్తుంది. పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో నివసిస్తున్న గిరిజనులందరూ పోర (పొలా అమావాస్య) అనే పండుగ సందర్భంలో ఎడ్లను చిత్రిత వస్త్రాలు, చిక్కాలు తదితర అలంకారిక సామాగ్రితో అలంకరిస్తారు. ఆ అలంకరణను ఇక్కడి సెట్‌లోనూ చేయడం జరిగింది. కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర, పెండ్లిళ్లు, పెండ్లి అనంతరం నవ దంపతులు చేసే విహారయాత్రలు, సవారీలతో ఇలాంటి చిన్న ఎడ్ల బండ్లు కనువిందు చేస్తాయి.


మొదటి అంతస్థులో
మొదటి అంతస్థులో సందర్శకులకు మొదట కన్పించేది పంచాయితీ సెట్‌. ఇందులో గిరిజనలుకు పెద్ద, అతని సహాయకుడు హవల్దార్‌ (వార్తాహరుడు), పంచాయితీ సభ్యులు, పంచాయితీ సహాయాన్ని అర్థించిన ప్రత్యర్థుల శిల్పాల, వారి వారి సాంప్రదాయ దుస్తుల్లో కన్పిస్తాయి. ప్రతి గిరిజన తెగకు ఒక సాంప్రదాయ పంచాయితీ వ్యవస్థ ఉంటుందని, అందులోనే తీర్పు వెలువడి శిక్షలు ఖరారౌతాయనే అంశం ఈ సెటప్‌ ద్వారా వెల్లడవుతుంది.

పంచాయితీ సెటప్‌ నుంచి సందర్శకుడు ఎడమవైపు తిరిగితే వరుసగా గోండు, కోయ ఆవాసాలు, మేడారం జాతర సెటప్‌ కనిపిస్తాయి. గోండు గుడిసె ముందు పురుషుడు ఇప్పపూవును కట్టెతో కొట్టుతూ శుద్ధి చేస్తున్నట్లు, స్త్రీ చల్లకామతో పెరుగును చిలికి మజ్జిగ చేస్తున్నట్లు నిలువెత్తు శిల్పాలను నిలబెట్టారు. కోయ గుడిసె వెనుక పొలంలో స్త్రీ, పురుషులు కలిసి నేలను చదును చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. మేడారం జాతర సెటప్‌లో ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క సారలమ్మ గద్దె, భక్తులు తమ ఎత్తు/బరువు బంగారం (బెల్లం) తూకం వేసి అమ్మవార్లకు చెల్లించి మొక్కులు తీర్చుకుంటున్నట్లున్న శిల్పాలతోపాటు జాతర విశేషాలు అనేకం బ్యాక్‌ గ్రౌండ్‌లో మ్యురల్స్‌ రూపంలో ఉన్నాయి.

మేడారం జాత సెటప్‌ నుండి సందర్శకుడు తన ఎడమవైపుకి తిరిగితే మొదట ఎరుకల సాంప్రదాయపు గుడిసెలు, పక్కన ఎరుకసాని మరో స్త్రీకి ఎరుక/సోది చెప్తున్నట్లు, పురుషుడు ఈత బరిగెను బుట్టల తయారీ కోసం శుద్ధి / చెక్కుకుంటున్నట్లు, పందుల దొడ్డి నుంచి ఒక పంది బయటికి వస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. తరువాత లంబాడీ గుడిసె, దాని చుట్టూ వస్తువులు, అనంతరం తీజ్‌ పందిరి, దానిపై తీజ్‌/గోధుమ మొలకల బుట్టలు, ఆ సందర్భంగా ఆడపిల్లలు ఆ బుట్టను ఎత్తుకొస్తున్నట్లు చిత్రాలు, పందిరికి మరోవైపు తీజ్‌ డప్పులు వాయిస్తున్న పురుషులు, అందుకు అనుగుణంగా లంబాడీ నృత్యం చేస్తున్న స్త్రీ నిలువెత్తు శిల్పాలు వారి సంప్రదాయ దుస్తులు, నగలతో అందంగా అరారుతున్నాయి.

తీజ్‌ సెటప్‌ నుంచి ఎడమవైపుకు తిరిగితే ఆంధ్‌ గిరిజన ఆవాసం కనిపిస్తుంది. ఆ గుడిసె ముందు ఆంధ్‌ సాంప్రదాయ వైద్యుడు మంచంమీద కూర్చున్న స్త్రీకి కషాయం తాగిస్తున్నట్లున్న శిల్పాలు, వాటి వెనుక వైద్యుని భార్య మందు నూరుతున్నట్లున్న దృశ్యం కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఆ తరువాత ఒక గడంచెపై గిరిజనుల ధాన్యం, విత్తనాలు నిలువ చేసుకునే విధానం, ఇళ్ళ పక్కన మేకల దొడ్డి కట్టుకునే సెటప్ లు ఆసక్తికరంగా కనిపిస్తాయి.

మొదటి అంతస్థులోని అన్ని గ్యాలరీల ముందు కూడా వాటి విశేషాలను ప్రింట్‌, వీడియో మాధ్యమాల్లో తెలిపే డిజిటల్‌ కియోస్కులున్నాయి.

రెండవ అంతస్థులో
రెండవ అంతస్థులో ఎడమ వైపు నుంచి ఎల్‌ ఆకారంలో 12 గ్లాస్‌ షోకేసులు, 4 భూ ఉపరితల షోకేసుల్లో గిరిజన వస్తువులు, కళా ఖండాలను ప్రదర్శనకు పెట్టారు. వీటిల్లో వరుసగా వేట పరికరాలు, ఆయుధాలు, చేప వేట పనిముట్లు, ఆటవీ ఫల సాయసేకరణ పనిముట్లు, పోడు/వ్యవసాయం, పశుపోషణ పనిముట్లు, గృహ/వేషధారణ పరికరాలు, మత సంబంధ పాత్రలు, పవిత్ర వస్తువులు, సంగీత వాయిద్యాలు, వేషధారణలు, ఓజ/డోక్రా లోహకళా వస్తువులు, పిల్లల ఆట వస్తువులు ఆసక్తి గొలిపేలా ప్రదర్శనలో ఉన్నాయి. అనంతరం గోండు, కోయ, నాయకపు గిరిజన చిత్రలేఖనాలు, నాయకపు మాస్కులు ఔత్సాహిక విద్యార్థులు అప్పటికప్పుడు నేర్చుకునేలా ఏర్పాట్లున్నాయి. తరువాత గ్యాలరీలో గిరిజన కథలు విద్యార్థులకు చెప్పే ఏర్పాట్లున్నాయి. ఈ విధంగా ఈ మ్యూజియంలో రాష్ట్ర గిరిజన సాంస్కృతిక విశేషాల సారాంశం సమగ్రంగా ఆవిష్కృతమైంది.

Other Updates