ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు చేసే విషయంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సీఎం చెప్పారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 6 గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
యాద్రాద్రి ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండి చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశించారు. ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్ ను పిలిపించి గండి చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు.
యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీ నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కళ్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్ అండ్ బీ ఈ.ఎన్.సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుండి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు.
సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అనీ, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని కోరారు. 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్ ను సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
హరిత గెస్ట్ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జి. జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీత, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి డాక్టర్ వేలు, టూరిజం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.