భగవంతుడు సృష్టించిన ఈ భూ ప్రపంచంలో ఎవరి జీవితాన్ని వారు బ్రతకడం సహజం. ఈ సమాజంలో ఒక్కోసారి ఎవరి జీవితాన్ని వారు కొనసాగించడం, సాధారణ స్థాయిలో బ్రతకడమే గగనమవుతుంది. అటువంటి సందర్భాల్లోనే ఆపన్నులకు ‘ఆసరా’ అందించాలి. మన నిత్య జీవితంలో ఎందరో అభాగ్యులను చూస్తూ వుంటాం. కొందరు చూసిన వెంటనే స్పందించి వారికి తోచిన రీతిలో సహాయమందిస్తారు. మరికొందరు అటువంటి దీనులపట్ల దీర్ఘంగా ఆలోచించి తాత్కాలిక ప్రయోజనాలను అందివ్వకుండా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అందుకు అనుగుణంగా సహాయ సహకారాలందిస్తూ వుంటారు.
విన్నర్ ఫౌండేషన్ ఈ స్థాయిలో సేవలందించడానికి ఆ సంస్థలో ఉద్యోగి అయిన ఎం. వెంకట్రామిరెడ్డికి వచ్చిన ఒక చిన్న ఆలోచన ప్రేరణగా నిలిచింది. తమ సంస్థలో దాదాపు 1150మంది ఉద్యోగస్తులు వివిధ డిపార్ట్‌మెంట్‌ల వారీగా పనిచేస్తున్నా, వారందరికీ ఓ లైబ్రరీ లేకపోయింది. కనీసం తమ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనైనా అందరి భాగస్వామ్యంతో దిన, వార, మాస పత్రికలను తెప్పించుకోవాలని చిన్నపాటి లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నారు. అందరి డబ్బుల భాగస్వామ్యంతో లైబ్రరీ నడుస్తోంది.
ఇంతలో మెదడువాపు వ్యాధి కలకలం మొదలయ్యింది. అప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘బెలెడోనా’ అనే హోమియోపతి మందును చాలా చోట్ల పంచుతున్నారు. అప్పుడు ఈ బి.డి.ఎల్. ఉద్యోగస్తుల లైబ్రరీ సభ్యులు మనం కూడా కొన్ని చోట్ల ఈ హోమియోపతి మందును ఉచితంగా పంపిణీ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఎంపిక చేసుకున్న ఒక పాఠశాలలో నిర్దిష్ట కాలపరిమితిలో ఆ మందును పంపిణీ చేసి రావాలని అనుకుని దాన్ని విజయవంతం చేశారు.
ఆ సత్సంకల్పం వాళ్ళను మరో మంచి పనిని చేయడానికి ఉసిగొలిపింది. తమ డిపార్ట్‌మెంట్‌లో ఒక హుండీని పెట్టి 50 రూపాయలకు తక్కువ కాకుండ ఎవరికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఆ హుండీలో డబ్బులు వెయ్యాలి అనుకున్నారు. అయితే అక్కడ ఓ చిన్న షరతు పెట్టారు. ఎవరైనా హుండీలో డబ్బులు వేస్తున్నప్పుడు చూసినవాళ్ళు చప్పట్లు కొట్టాలి అని. అలా చేయడంవల్ల ఎవరైనా మరిచిపోతే వారికి గుర్తు వస్తుంది అని ఆ నియమం. ఆ హుండీకి వారు పెట్టుకున్న పేరు ‘సమర్పణ’. ఆ తర్వాత అలాంటి హుండీల సంఖ్య పెరిగింది.
తొలి ఏడాది హుండీలో జమయిన 6800 రూపాయలతో వారు ఎంపిక చేసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థలో బాలికలకు రోజువారీ అవసరమయిన సామగ్రిని అందజేశారు. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను నోటీసు బోర్డులో డిస్‌ప్లే చేశారు. విశ్వనాథశర్మ అనే ఉద్యోగస్తుడు తన బట్టలకొట్టుని మూసేద్దామని అనుకుంటున్న తరుణంలో ఈ ఫొటోలను చూసి, తన బట్టల కొట్టులో వున్న బట్టలతో పేద పిల్లలకు డ్రెస్‌లను కుట్టించి ఇవ్వమని తన దుకాణంలో వున్న వస్త్రాలను ఉచితంగా అందజేశారు.
అప్పటినుంచి తమ సంస్థలో మొదలైన విన్నర్స్ క్లబ్ 2002 ఉగాది రోజునుండి ఒక ఫౌండేషన్ రూపాన్ని సంతరించుకుంది. అంతే అప్పటినుండి ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ దినదిన ప్రవర్థమానమవుతున్నది. ఏడాదిలో వచ్చే ఆయా ప్రత్యేక దినోత్సవాలని పురస్కరించుకుని అందుకు తగినట్టుగా సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. అది కాకుండా విధిగా ప్రతి యేటా ఎంపిక చేసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలను పంచడం ఎప్పుడూ కొనసాగుతున్న ప్రక్రియ. ఇది కాకుండా అన్నార్తులకు ఆహారం, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యసేవలు, వృద్ధాశ్రమాలకు అవసరమైన సామగ్రి సమకూర్చడం ఇలా విన్నర్స్ ఫౌండేషన్ సభ్యులంతా తొలుత పరిస్థితులను అధ్యయనం చేసి ఆపన్నులకు ఏమి చేస్తే బాగుంటుందో నిర్ణయించి దాన్ని అమలు చేయడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో 2012-2013 సంవత్సరంలో 74000 రూపాయలను, 2013-14లో 4,19,913 రూపాయలను, 2014-15లో 5,63,372 రూపాయలను సమాజ సేవలో వివిధ కార్యక్రమాలకు వెచ్చించడం జరిగింది. ఈ సంస్థ చేస్తున్న నిరంతర సేవకు ఎంతో గుర్తింపు లభించింది. వీరు చేసిన అనేక కార్యక్రమాలలో అగ్రగామిగా నిలిచింది ఒకేరోజు అత్యధికంగా రక్త దానం చేయడం, ఇందుకుగాను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) గవర్నర్ అవార్డ్ లభించింది. సమాజంలోని అభాగ్యులకు మావంతు అండ మేమందిస్తున్నామని బి.డి.ఎల్. ఎంప్లాయీస్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షులు రఘు అరికెపూడి తెలిపారు.