కార్మికుల హక్కుల కోసం సంఘటిత ఉద్యమాలను రూపొందించి, ముందుకు తీసుకువెళ్లిన నేత, దశాబ్దాల కాలం నగరంలో బలీయంగా ఎదిగిన ట్రేడ్ యూనియన్‌కు ప్రాణదాత, ఉన్నతమైన జీవితానికి నైతిక కట్టుబాట్లు అవసరమని భావించిన నీతి వర్తనుడు, పదవులకు అతీతంగా అర్థశతాబ్దంపైగా ప్రజా జీవితంలో కొనసాగిన ఆదర్శమూర్తి.. ఆయనే డాక్టర్ రాజ్ బహదూర్ గౌడ్.
డా. రాజ్ బహదుర్ తండ్రి రాయ్ మహబూబ్ రాయ్. నిజాం ప్రభుత్వంలో పని చేయటానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సైజా బాల్‌నుంచి ఇక్కడికి వచ్చారు. గౌర్’ అనేది వారి ఇంటిపేరు. ఇక్కడ రెడ్డి, రావుల మాదిరిగా గౌర్’ ప్రచారంలో లేదు కనుక దానికి సమీప పదమైన ‘గౌడ్’ అనే పేరు వాడుకలో వచ్చింది. అలా ఆయన ‘గౌర్’ గా ఉండవలసింది ‘గౌడ్’ అయ్యారు. ‘రాజ్ బహదుర్ 1918 జూలై 21వ తేదీన హైదరాబాద్ లోని గౌలీపురలో జన్మించారు. 23 సంవత్సరాల వయసులో ఎం.బి.బి.ఎస్. పాసై డాక్టరైన రాజ్ బహదుర్‌కు ఆ రోజుల్లో సులభంగానే ఉద్యోగం లభించేది. కానీ ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చెయ్యాలనుకున్నారు. విద్యార్థి దశలో వచ్చిన ఉపకార వేతనాల డబ్బుతో పుస్తకాలు, పత్రికలు కొని తన ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. రాచరికంపై తిరుగుబాటు చేయాలనే ఒక యువశక్తి బయల్దేరుతున్న రోజులవి. అందులో రాజ్ బహదుర్ చేరిపోయారు. అబిడ్స్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో తరచుగా సమావేశమయ్యే మగ్దూం మొహియుద్దీన్, అక్తర్ హుసేన్, సయ్యద్ ఆలంఖుంద్ మీరీ, రాజ్ బహదుర్‌గౌడ్ లతో కూడిన యువక బృందం కమ్యూనిస్టు పార్టీ స్థాపనకోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆంధ్రమహాసభ కలిగించిన చైతన్యం యువతలో స్వాతంత్య్రం కాంక్ష రగులు గొలిపింది. మరిన్ని తెలుగు పుస్తకాలు, గ్రంథాలయాల కోసం ప్రారంభమైన ఆందోళన ప్రజాస్వామ్య రాజకీయాలను కోరే పెను ఉద్యమంగా రూపాంతరం చెందింది. 1935 లో స్వామీ రామానంద తీర్థ, రావి నారాయణ రెడ్డిల కృషితో స్టేటు కాంగ్రెసు ఆవిర్భావానికి కృషి జరుగుతున్నది. ఇంతలో పై నుంచి అనుమతి లభించనందున, కాంగ్రెస్ ఉద్యమం బహిరంగంగా పని చేయలేకపోయింది. అప్పటికి ఆంధ్రలో కమ్యూనిస్టులపై నిషేధం ఉంది. ఆ ప్రాంతంలోని కొందరు ప్రముఖులు తెలంగాణలో రహస్య జీవితం గడుపుతూ పార్టీకి ఊతమిచ్చారు.
ఆ సమయంలో ఆంధ్రమహాసభలోని అతివాదులైన యువకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటివారు. ట్రేడ్ యూనియన్‌లో పని చేస్తున్న మగ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదుర్గౌడ్ వందీమాతరం ఉద్యమం నుంచి వచ్చిన దేవులపల్లి వెంకటేశ్వర రావు, సర్వదేవరభట్ల రామనాధం లాంటి యువకులు, మరాఠ్వాడా యువనేతలు వి.డి. దేశ పాండ్యే, చంద్రగుప్త చౌదరీ మొదలైన వారితో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజా ఉద్యమానికి నడుంబిగించిన కమ్యూనిస్టు పార్టీకి మధ్య తరగతి యువకుల సహకారం లభించింది. స్టూడెంట్స్ ఫెడరేషన్ అభ్యుదయ రచయితల సంఘం, దక్కన్ బటన్ ఫ్యాక్టరీ, ఆల్విన్ మెటల్స్, సింగరేణి బొగ్గుగనుల కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. ఉద్యమంలో ఉన్న రోజుల్లోనే డా.రాజ్ బహదుర్‌గౌడ్ వివాహం బ్రిజ్ రాణితో జరిగింది. ఆమె కూడా ఉద్యమంలో పని చేసింది.
1947 మే 7న జై ప్రకాశ్ నారాయణ్ హైదరాబాద్ వచునప్పుడు సికిందరాబాద్ లోని కర్బలా మైదానంలో ఉపన్యాసం ఏర్పాటైంది. ఆ సమయంలో రాజ్ బహదుర్ నిర్బంధంలో ఉన్నారు. పోలీసుల కళ్ళు కప్పి ఆయన ఉడాయించారు. నాలుగు సంవత్సరాల కాలం ఆయన రహస్య జీవితం గడిపారు. దేవరకొండ సమీపంలో ఒక చోట మంచి నీళ్లు తాగుతుండగా 1951 ఫిబ్రవరి 24న ఆయన పోలీసులకు దొరికిపోయారు. 13 నెలలు జైల్లో ఉన్నారు.
పోలీసుల చర్య తరువాత కూడా సాయుధ పోరాటం కొనసాగించాలనే వర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఆయన రెండు సార్లు రాజ్యసభ సభ్యులైనారు. మూడవ సారి పార్టీ, టికెట్టు ఇవ్వజూపితే ఆయన అందుకు నిరాకరించారు. రాజ్యసభలో తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ఆయన లెక్కలతో వెల్లడించి ప్రభుత్వాన్ని హెచ్చరించేవారు.
రాజ్ బహదుర్‌కు సొంత ఇల్లు లేదు. చిక్కడపల్లి ప్రాంతంలో కార్మికులు కలిసి కట్టించిన పూరి గుడిసెలో చాలా కాలం నివసించేవారు. వీరి కుమార్తె రష్యాలో డాక్టరు చదువుకొని వచ్చి, తన సంపాదనతో ఒక చిన్న ఇల్లు కట్టించి ఇచ్చింది. ఆ ఇంటికి వారు ‘చెంబేలీకి మండ్వా’ (మల్లెల పందిరి) అని పేరు పెట్టుకొని చివరికాలం వరకు అందులోనే నివసించారు.
ఉర్దూ భాషలో రాజ్ బహదుర్ పండితుడు. ఆ భాషలో ఆయన మూడు విమర్శన గ్రంథాలు రచించారు. ఆ భాషకు ఆయన చేసిన సేవకు ఫలితంగా బహదుర్‌షా జాఫర్ అవార్డు కింద ఇరవై అయిదు వేల బహుమతి లభించింది. అందులో 15 వేలు అప్పులు తీర్చుకొని మిగిలిన పదివేలు మగ్దూం ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. ఆయన మగ్దూం మొహియొద్దీన్‌ను తన గురువుగా భావించుకునేవారు. ఆయన కన్న వయస్సులో రాజ్ బహదుర్ పదేళ్ళు చిన్న. డా|| రాజ్ బహదుర్‌గౌడ్ తన వద్ద ఏమీ మిగుల్చుకోలేదు. బ్యాంకులో తన పేర కొద్దో గొప్పో మిగిలిన డబ్బును పార్టీ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. సుందర వదనుడైన రాజ్ బహదుర్ మరణానంతరం తన అవయవాలను తను చదువుకున్న ఉస్మానియా మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇచ్చారు . హైదరాబాద్ మద్రాసు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన డా. రాజ్ బహదుర్ గౌడ్ తన 94వ ఏట 2011వ సంవత్సరం అకోబ్టర్ 7న మరణించారు. రెండు చేతులా ఆర్జించవలసిన ఈ వైద్యుడు తన జీవితాన్ని సాహిత్య సేవలోనూ, ప్రజాసేవలోనూ గడిపారు.