జి. వెంకటరామారావు
గాంధీజీ సాధుపుంగవుడు, ప్రేమమూర్తి. అమృత హృదయుడు. ఆయన అనుంగు శిష్యుడు ఆచార్య కృపలానీ చిరాకు, చికాకు, కనుబొమ్మలు చిందుతొక్కడానికి తీక్షణమైన చూపులు. వీరిద్దరికీ పొత్తు ఎలా కుదిరిందనుకునేవారు ఆ రోజుల్లో.
ప్రచార ఆడంబరాలు లేకుండా నిర్మాణ కార్యకలాపాలను కృపలానీవలె నిర్వహించిన వారు లేరు. దేశవ్యాప్త విమోచన కృషిలో ఆనాటి మేటి నాయకులలో ఎందునా తీసిపోలేదు. అయితే, దేశంలో దేశ ప్రభుత్వంలో ఆయనకంటే పిన్నలు ఆయనను మించి రాణించగలడానికి కారణం… ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పలుకు ‘దారుణాఖండల శస్త్రతుల్యము’. సన్నిహితులు ఆయన్ను ఆప్యాయంగా దుర్వాసుల మహర్షి’ అని సంబోధన చేసేవారు.
ఆ దుర్వాసుడు ఏ కుంతీ దేవికి ఏమి వరాలు ఏమి దీవెనలు ప్రసాదించాడో, అవి ఎంతవరకు యదార్థములైనవో మనకు తెలియదు కానీ, వృద్ధుడైన కృపలానీ పలికిన శాపవాక్యాలు మాత్రం మనకు తెలిసినంతలో ఒకసారి తు.చ. తప్పకుండా నిజాలయ్యాయి.
ముంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వ్యవహార విషయమై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంలో ఆర్ధిక మంత్రి టి. కృష్ణమాచారిమీద కృపలానీ నిర్ధాక్షిణ్యంగా, దారుణంగా విరుచుకుపడ్డారు. కృపలానీని వారి ధోరణిలో అదే తీవ్రతతో ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని స్థానం అడ్డు వస్తుంది. ఆయనకున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రంనాకు లేవు’ అని టీటీకే సమాధానం. ‘పరమేశ్వరుని అనుగ్రహం వుంటే అతి త్వరలోనే మీకు ఆ స్వేచ్ఛ లభిస్తుంది’ అని కృపలానీ వ్యాఖ్యానించారు. దుర్వాసశాపం నెల తిరక్కుండానే యదార్థంగా పరిణమించింది. ఆర్థికమంత్రి తన పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వంనుండి బయటికి నడిచారు. ఆయన వాక్‌శుద్ధి అంతటిది.
తను విశ్వసించిన విషయాన్ని పరమ గురువైన గాంధీజీకి ప్రతికూలంగా చెప్పడానికైనా, ఆచరించడానికైనా వెనుదీయలేదు. నేఖాలీ దారుణాలు జరిగిన రోజులలో తప్పంతా కేవలం హిందువుల మీదనే మోపడం దారుణమని దృష్టాంతాలుచూపి ఎత్తి పొడిచారు. కాంగ్రెస్‌వారు బుగ్గలు నొక్కుకున్నారు. గాంధీజీ మాత్రం తరచి ‘కృపలానీ అంటే నాకు తగని భయం’ అంటూనే ఉండేవారు.
క్యాబినెట్‌లో నా స్థానమెంత?
ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి పుంగవుడు 1962 ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. పూర్వంలో అతనికి క్యాబినెట్‌లో మూడవస్థానం ఉండేది. కానీ ఈసారి ఆ స్థానం మరొకరు ఆక్రమించడంతో అతనిది నాల్గవ స్థానమైంది. దానికి అతడు తన ప్రతిష్ఠకు సంబంధించిన సమస్యగా భావించుకుని రాజీనామా చేయడానికి సంసిద్ధుడై, దేనికైనా మంచిదని కేంద్ర హోంమంత్రి శాస్త్రీజీని సంప్రదించడానికి ఢిల్లీ వెళ్ళాడు.
ఆయన హృదయభారాన్ని గమనించిన శాస్త్రీజీ పనిచేయడానికి ఉపయుక్తమైన వాతావరణం, తగిన అవకాశాలు కావాలి, కానీ ప్రతిష్ఠకంతటి ప్రాముఖ్యమివ్వవలసిన అవసరంలేదని మంత్రిగారికి సలహా ఇచ్చారు. వ్యక్తిగత సమస్యలు రాజీనామాకు కారణం కాకూడదని, అవి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని కూడా చెప్పారు. దీనిలో మంత్రిగారి సంతాపం కొంచెం కొంచెం కరుగుతూ వచ్చింది.
మంత్రివర్గంలో నా స్థానమెంతో మీకు తెలుసునా? అని ప్రశ్నించారు శాస్త్రీజీ. మురార్జీ, జగ్‌జీవన్‌రాం, నందాజీల తరువాత కేంద్రమంత్రివర్గంలో హోంమంత్రి స్థానం. ‘తెలుసునండి. మీరు చాలా గొప్పవారు’. అతడు నీరుగారిపోయాడు. ‘లేదు, నేను గొప్పవాణ్ణికాను. ఈసారి కృష్ణమాచారిని క్యాబినెటులో తీసుకుంటే నాకన్నా పై స్థానమివ్వమని ప్రధానమంత్రిని కోరతాను. ఆయన యోగ్యుడు. నాకంటే బాగా యోగ్యుడు. నేను ఆయనని గౌరవిస్తాను’. ఇది వినగానే మంత్రిగారు పూర్తి సంతృప్తితో తమ యింటికి వెళ్లి పోయాడు. సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించడంలో శాస్త్రీజీకున్న చాకచక్యం చూపడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఆనాడు కొలంబస్-ఈనాడు నెహ్రూ
భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూలని వాషింగ్టన్, జెఫర్‌సన్‌లతో పోల్చుతారు. రూజ్‌వెల్ట్‌ను నెహ్రూ కలుసుకోలేదు. 1941లో నెహ్రూ తన స్వీయ చరిత్ర అనే గ్రంథాన్ని రూజ్‌వెల్ట్‌కు పంపించారు. చాలాకాలం తరువాత 1949లో నెహ్రూ హైడ్‌పార్క్‌లోని రూజ్‌వెల్ట్ మెమోరియల్ మ్యూజియంకు వెళ్లినప్పుడు అక్కడి అధికారి ఈ పుస్తకం తీసి చూపించారు. మొదటి పుటలో ఆ పుస్తకం తనకు అందిన తేదీ వేసుకొని సంతకం చేశాడు రూజ్‌వెల్ట్.
ఆనాడు నెహ్రూ అమెరికా పర్యటించినప్పుడు నెహ్రూకు లభించిన స్వాగతం గురించి ప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయయాఫిషర్
‘బ్రిటన్ రాజు, రాణిలు మినహా మరే విదేశీయునికి ఇంతటి ఘనస్వాగతం లభించలేదని రాశాడు.
ట్రూమన్ ఆహ్వానంపై నెహ్రూ వాషింగ్టన్‌లో దిగగానే ఆయనకు స్వాగతం చెబుతూ ప్రెసిడెంట్ ట్రూమన్ చెప్పిన మాటలు చిరస్మరణీయమైనవి.
‘భారతదేశానికి కొత్త మార్గం వెతుకుతూ ఉండగా కొలంబస్ ఈ అమెరికా కనుగొనడం అనేది విధి నిర్దేశించిన మహత్తర ఘటన. ఈనాడు మీరాక కూడా ఒక విధంగా అమెరికాను ఆవిష్కరించడమే కాగలదని ఆశిస్తున్నాను’.