ఆయుష్మాన్-భవ4

యాదికున్నకాడికి – తెలిదేవర భానుమూర్తి 

అసల్‌ మా వూరి పేరు భువనగిరి. భువనైక మల్లుడనేటి రాజు హుకూమత్‌ జెయ్యబట్కె మా వూరికి గా పేరొచ్చింది. బొంబాయి పేరు ముంబై అయ్యింది. మద్రాస్‌ను గిప్పుడు చెన్నై అని పిలుస్తున్నరు గా తీర్గనే జమానలనే భువనగిరి బోన్గిరయ్యింది. బోన్గిర్ల గదే మావూర్ల ఒక్క నల్లరౌతుతోనే పెద్ద గుట్టున్నది. గా దాని మీద ఖిల్లున్నది. కింద హన్మంతుని గుడి ఉన్నది.

శనివారమొస్తె సాలు మావూర్లె శానమంది హన్మంతుని గుడికి బోయెటోల్లు. మా సోపతిగాల్లతోని గల్సి నేను గూడ గుడికి బోయెటోన్ని. అప్పలాచారి గా గుల్లె అయ్యగారు. గాయిన శఠగోపం బెట్టెటోడు. ‘పాదోదకం పావనం’’ అన్కుంట తీర్తంబోసెటోడు. పులిగోర పసాదం బెట్టెటోడు. గాయన కొడ్కే గోపాలచారి. గాడు మా బల్లెనే మాతోటి గల్సి పన్నెండో తర్గతి దాంక సద్వుకుండు. అటెంకల గాల్ల నాయిన కిందనే ఉండి గుల్లె పూజలు జెయ్యబట్టిండు. గాన్ని అందరు చిన్నయ్యగారు అని పిల్చెటోల్లు.
మా కాలేజిల బియ్యే సదివేటి కేశవచారి మావూరి గంజ్‌ల ఉండెటోడు. గంజ్‌ రేల్‌ టేషన్‌ కాడ్కి శాన దగ్గర. ఇగ దాంతోని దినాం గాడు బోన్గిరికేల్లి వొచ్చెటోడు. మేము ఊర్లె ఉండేది. ఊరు అంటె పాతబోన్గిరి. గంజ్‌ అంటే కొత్త బోన్గిరి. గంజ్‌ల హోటల్లుÑ దుక్నాలుÑ బీటేగాకుంట బస్‌డిపో గూడ ఉండేది. మావూర్లె కొంతమంది దినాం పొద్దుమీకుతుండంగా గంజ్‌కి తప్రి బోయెటోల్లు. గాడ ఏదన్న హోటల్ల ముచ్చట బెట్టుకుంట గూసునేటోల్లు.
గా దినం కాలేజిల కేశవచారి కల్సిండు. ఇద్దరం గల్సి ఇరానీ హోటల్కు బోయినం. బిస్కిట్లు దినుకుంట ఛాయ్‌ దాగ బట్టినం.
‘‘మొన్న గోపాలచారి కల్సిండ్రా’’ అని గాడన్నడు.
‘‘ఆడు బాగున్నడ్రా?’’ అని అడిగిన.
‘‘బాగున్నడ్రా. పట్నంల ఏందో పని బడిరదట. నీతాన్కి వొస్తనన్నడు.’’
‘‘నీతోని వొస్తడా?’’
‘‘లే. నాగ్‌పూర్‌ ప్యాసెంజర్‌కు వొస్తనన్నడు.’’
‘‘గాడు ఇదువరకెన్నడు పట్నం రాలేదు. ఒక్కడెట్లొస్తడు’’
‘‘గాడెక్కి గీడ దిగెతంద్కు గాని యెంబడి ఇంకొకడు ఉండాల్నా? రేల్‌టేషన్కు నువ్వెట్లన్న బోతవాయె’’అని కేశవచారి అన్నడు.
‘‘ఒగాల్ల నేను టేషన్కు వొచ్చుడు లేటైతే గాన్ని ఆల్ఫా హోటల్ల గూసోమని జెప్పురా. ఇంతకు గాడు ఎన్నడొస్తడు?’’ అని కేశవచారిని అడిగిన.
‘‘ఎల్లుండి అంటే బేస్తారం వొస్తనన్నడు’’ అని గాడు జెప్పిండు. బేస్తారం రానేవొచ్చింది. నాగ్‌పూర్‌ పాసింజర్ల గోపాలచారి లష్కరొచ్చిండు. రేల్‌గాడిలకెల్లి దిగిండు. రేల్‌ టేషన్ల కెేల్లి ఇవుతలకొచ్చిండు. పావుగంటసేపే నాకోసం ఎదురుసూసిండు. నేను గిన సైయానికి రాకుంటె అల్ఫా హోటల్ల గూసోమని కేశవచారితోని ఆన్కి చెప్పంపిన. గది గాన్కి యాదికొచ్చింది. ఆల్ఫా హోటల్‌ యాడుందా అని జెరసేపు గాడు అటిటు జూసిండు. ఎదురుంగ ఉన్న ఆల్ఫా హోటల్‌ గాన్కి గండ్లబడ్డది.
గోపాలచారి బోయి ఆల్ఫా హోటల్ల గూసుండు. పట్నమొచ్చినా గాడు పంగనామాలతోనే వొచ్చిండు. అయ్యగారు యాడున్నా అయ్యగారే గదా! హోటల్ల గూసోనే నా గురించి గాడు అటిటు సూడబట్టిండు. జెరసేపైనంక సర్వర్‌ ఆని తాన్కి వొచ్చిండు.
‘‘క్యాహోనా?’’ అని అడిగిండు.
‘‘సమూసా లావ్‌’’ అని వాడీన్నడు.
సర్వర్‌ పిలేటు నిండ సమూసలు దెచ్చి ఆని ముంగట బెట్టిండు. గీ పట్నం హోటలోల్లు అయ్యగార్లకు మర్యాద ఇస్తున్నట్లు గొడ్తున్నది. మర్యాదియ్యకుంటె సర్వర్‌ గిన్ని సమూసలు ఎందుకు దెస్తడని గాడు మనసుల అనుకుండు. మెల్లగ ఒకొక్క సమూస దినబట్టిండు. సమూసలన్ని దినకుంటె యాడ హోటలోడు నారాజైతడోననుకోని బల్మీకి గాడు అన్ని సమూసలు దిన్నడు.
ఏదో పనిబడి చెప్పిన సైమానికి నేను టేషన్‌కాడ్కి బోలేదు. హోటల్ల నాకోసం ఒక్కతీర్గ ఎదురుజూసిన గోపాలచారికి యాస్టకొచ్చింది. గాడు జెరసేపు హోటల్‌ బయట నిలబడ్దామనుకున్నడు. కుర్సిలకెల్లి లేసిండు. కౌంటర్‌కాడ్కిబోయిండు. కౌంటర్‌మీద గూసున్నోడికి ‘ఆయుష్మాన్‌భవ’’ అని దీవెనార్తి ఇచ్చిండు. హోటల్లకెల్లి ఇవుతల్కి రాబోయిండు. కౌంటర్‌మీద గూసున్నోడు ‘‘పైసే పైసే’’ అన్కుంట గోపాలచారిని బట్కుండు.
‘‘దీనార్తి ఇచ్చిన గద ఇంక పైసలేంది?’’ అని గోపాలచారి అడిగిండు.
మావూర్లె అయ్యగార్ల తాన ఏ హోటలోడు పైసలడ్గడు. పట్నంల గూడ గట్లే ఉంటదని గాడనుకున్నడు. సరింగ గప్పుడే నేను ఆల్ఫా హోటల్‌ కాడ్కి బోయిన. బిల్లు ఇచ్చి గోపాలచారిని హోటల్లకెల్లి దోల్కొచ్చిన.

Other Updates