తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 6 లక్షల మంది విద్యార్థినిలకు ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్స్’ అందించే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘బాలికా ఆరోగ్య రక్ష’ పథకాన్ని మంత్రి కడియం శ్రీహరి నేడు వరంగల్‌లోని హసన్‌పర్తి గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన విద్య అందించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తోందన్నారు.
నేడు మన రాష్ట్రంలో విద్య దేశం మొత్తానికి ఆదర్శంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు. భారతదేశంలో తెలంగాణ గురుకులాలే పటిష్టంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 296 గురుకులాలుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 517 గురుకుల పాఠశాలలు, 53 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న జిల్లాలు, మండలాల వల్ల రాష్ట్రంలో కొత్తగా 84 కేజీబీవీలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలుంటే వీటిల్లో ఈ ఏడాది 85 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. అదేవిధంగా విద్యాశాఖలోని 35 గురుకుల పాఠశాలలను గురుకుల కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. గురుకుల విద్యాలయాల కోసం 150 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యాశాఖలో మౌలిక వసతులు కల్పిస్తూనే టీచర్లను కూడా టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత విద్యాశాఖ ద్వారా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నామని శ్రీహరి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి భోజనం ఇస్తున్నామన్నారు. సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నామని, నెలకు ఆరుసార్లు మాంసాహారం, ఇందులో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్ , వారానికి 4సార్లు గుడ్లు, ఉదయం బూస్ట్ మిల్క్, రాగిమాల్ట్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనంలో 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి మంచి భోజనం అందిస్తున్నామన్నారు. వీటితో పాటు ఇప్పుడు బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం బాలికా ఆరోగ్య రక్ష పథకం కింద ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్స్’ అందిస్తున్నామన్నారు. ఈ కిట్లో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అవసరమైన 14 రకాల 50 వస్తువులున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏయే వస్తువులు కొంటారో, ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం అన్ని వస్తువులు అందిస్తోందన్నారు.
ఈ పథకం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారని, ఒక్కో విద్యార్థికి ఈ కిట్ కోసం 1600 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏడాదికి 12 నెలలు సరిపోయే విధంగా మూడు నెలలకొకసారి కిట్ ఇస్తామన్నారు. ఇలాంటి పథకంగానీ, భోజనంగానీ విద్యాలయాల్లో దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల కు విద్యార్థులు వచ్చే విధంగా ప్రభుత్వ విద్య పటిష్టం అయిందన్నారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ తెలంగాణ వచ్చిన తర్వాత దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. కేజీ టు పీజీలో భాగంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వసతులు వినియోగించుకోవాలని, మంచి ఫలితాలు సాధించి వారి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.