తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలలో అత్యంత కీలకమయిన, నిర్ణయాత్మకమయిన పధ్నాలుగు సంవత్సరాల మలిదశ ఉద్యమానికి సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా గాంధేయ మార్గంలో నేతత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన తెలంగాణ రాష్ట్రానికి, ప్రథమ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజామోదంతో(2014 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి), రాష్ట్ర జనావళికి ప్రమోదకరంగా, తొలి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతను చేపట్టి, సారధ్యం వహించడం తెలంగాణ ప్రజల అదష్టం. అందరు ‘ఇంకెక్కడి తెలంగాణ’ అని ఆశలు వదిలి హతాశులయిన సమయాన కె.సి.ఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రపంచానికి ఆశ్చర్యం కల్గించారు. అప్పటి పాలకుల పెత్తనంలో అణచివేతకు, దోపిడికి, అన్ని రంగాలలో అన్యాయాలకు, అక్రమాలకు గురి అవుతూ తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని (ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వార) నిలిపిన నవశకారంభకుడు, తెలంగాణ చరిత్రలో వినూత్న అధ్యాయ మహారచయిత, స్రష్ట, ద్రష్ట ముఖ్యమంత్రి కె.సి.ఆర్.-అంతవరకు ఆంధ్ర ప్రాంతీయుల, ఆంధ్రపాలకుల వెనుక చేతులు ముడుచుకుని, తలవంచి నిల్చున్న తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర సాధనతో అన్ని రంగాలలో తమ ప్రతిభను, ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి పురోగమించడానికి, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి అపూర్వ అవకాశం లభించింది.
తమ విశిష్ట, విలక్షణ, సంస్క తీ సంపన్న అస్తిత్వాన్ని, తమ ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకోవడానికి ఆసఫ్ జాహి పాలనలో, ఆంధ్ర పాలకుల ఆధిపత్యంలో నిరసన గళం విప్పిన, ప్రతిఘటనా పతాకం ఎత్తిన, పోరాట పటిమ ప్రదర్శించిన తెలంగాణ ప్రజలు నిజానికి ఎవరికీ తీసిపోని, సాటిలేని అకళంక, అకుంఠిత దేశభక్తులు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సమర నాయకులు నాటి తెలంగాణ నేతలతో రహస్య సంబంధాలు పెట్టుకున్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమర జ్వాలలు తెలంగాణ నేలలో గూడ రగుల్కొన్నాయి. తెలంగాణ అంతట, విద్యాసంస్థలలో, నాటి ఒకే ఒక తెలంగాణ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ నినాదాలు మారుమోగి అప్పటి పాలకుల గుండెలలో వణుకు పుట్టించాయి. స్వామి వివేకానందుడు, విశ్వకవి రవీంద్రుడు, గాంధీమహాత్ముడు, మహర్షి కార్వే, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, సరోజనీ నాయుడు తదితర మహనీయులకు తెలంగాణ కార్యక్షేత్రమయింది. స్వతంత్రభారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి (తరువాత రెండవ రాష్ట్రపతి) సర్వేపల్లి రాధాకష్ణ, మొదటి ఉపప్రధాని సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ తెలంగాణ నేలపై అడుగుపెట్టి,పర్యటించి తెలంగాణ ప్రజల చైతన్యానికి నీరాజనం పట్టారు. క్రీస్తుశకం 1724లో ప్రారంభమయిన, దాదాపు రెండువందల ఇరవయి అయిదు సంవత్సరాల ఆసఫ్ జాహి నిరంకుశ పాలనకు, రాచరిక పాలన ఛత్రం కింద ప్రజల రక్తం పీల్చుతున్న ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన అనేక ఉద్యమాలు, విశేషించి పడతులు సైతం వడిసెలలు పట్టి విజంభించిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ప్రసిద్ధి పొందినాయి.
”నా తెలంగాణ తల్లి కంజాతవల్లి…నా తెలంగాణ కోటి అందాల జాణ…నా తెలంగాణ లేమ సౌందర్యసీమ…నా తెలంగాణ కోటిరత్నాల వీణ” అని తెలంగాణ మహాకవి దాశరథి (కష్ణమాచార్యులు)అక్షర స్తుతి కావించిన తెలంగాణ ప్రాంతం దక్షిణ భారతదేశాన, దక్కన్ పీఠభూమికి రత్నకిరీటం. అపార ప్రకతి వనరుల సంపదలతో, గోదావరి, కష్ణా నదీజల ప్రవాహాలతో, వాటి పలు ఉపనదులతో, ఎత్తయిన కొండలతో, విశాల భూభాగాలతో, దట్టమయిన అరణ్యాలతో నిండుగా నిలచిన తెలంగాణ ప్రాంతం వేయి సంవత్సరాలకు మించిన కాలగమనంలో శాతవాహన, ఇక్ష్వాకు, వాకాటక, విష్ణుకుండిన, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కుతుబ్ షాహి తదితర రాజ్యాలకు ప్రధాన వేదికగా విరాజిల్లింది. తెలంగాణ ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా, రాజధాని స్థలంగా ఏలిన రాజ్యాలన్నిటిలో ముఖ్యమయినది కాకతీయ రాజవంశం(1140-1340). కాకతీయ సామ్రాజ్య వైభవం అద్వితీయమయినది-పాలనా కాలం స్వల్పమయినదయినప్పటికి కాకతీయ పాలకులు సర్వతోముఖ అభ్యున్నతికి దోహదపడ్డారు. గణపతి దేవచక్రవర్తి(మహా భారత రచన కవిత్రయంలో ఒకడయిన తిక్కన సోమయాజి తన మిత్రుడు మనుమసిద్ధి రాజుకు సైనిక సహాయాన్ని అభ్యర్థించడానికి కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు విచ్చేసి గణపతి దేవచక్రవర్తి సహాయం కోరినాడని చరిత్ర వివరిస్తున్నది), ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్య అధినేతలలో అత్యంత ప్రముఖులు. కాకతీయ సామ్రాజ్యంలో అద్భుతంగా కళాపోషణ, కళావిలసనం, కళాశోభితంగా దేవాలయం నిర్మాణం జరిగినాయి. కాకతీయ ప్రభువులు వ్యవసాయాభివద్ధికి, ప్రజల తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అనేక తటాకాలను నిర్మించారు. పలు యుద్ధ రంగాలలో కదన పాండిత్యం ప్రదర్శించి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన కాకతీయ పాలకులు సారస్వత, నత్య, నాటక, సంగీత రంగాలను కూడా ప్రోత్సహించి జనరంజకంగా పరిపాలించారు.
తెలంగాణ అంతట, విద్యాసంస్థలలో, నాటి ఒకే ఒక తెలంగాణ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ నినాదాలు మారుమోగి అప్పటి పాలకుల గుండెలలో వణుకు పుట్టించాయి. స్వామి వివేకానందుడు, విశ్వకవి రవీంద్రుడు, గాంధీమహాత్ముడు, మహర్షి కార్వే, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, సరోజనీ నాయుడు తదితర మహనీయులకు తెలంగాణ కార్యక్షేత్రమయింది.
కాకతీయ పాలన నాటివాడె పాల్కురికి సోమనాథుడు(1250-1300)అపూర్వ రీతిలో తెలుగులో శైవ సాహిత్యాన్ని సష్టించిన మహాకవి. అచ్చతెలుగు, ద్విపద, జానపదశైలి పాల్కురికి సోమన ప్రత్యేకతలు. ద్విపదలో బసవపురాణం, పండితారాధ్యచరిత్ర మహకావ్యాలను రచించిన మహాకవి పాల్కురికి సోమన. ఆయన స్వస్థలం ఓరుగల్లు సమీపంలోని జనగామ తాలుకా పాలకుర్తి గ్రామం కాదని ఆంధ్ర పండితులెవరూ ఆక్షేపించక పోవడం, ఆయన అచ్చమయిన తెలంగాణ బిడ్డని నిరభ్యంతరంగా అంగీకరించడం విశేషం. కాకతీయుల సామంతరాజు, రాయచూరు రాజ్యాధీశుడు గోనబుద్ధారెడ్డి ద్విపదలో రంగనాధ రామాయణం తనతండ్రి విఠలుని పేర రచించినాడు. కాకతీయ సారస్వత సేవలో విరిసిన మహాకావ్యం మల్లికార్జున పండితారాధ్యుని ‘శివతత్త్వసారము’. కాకతీయ యుగంలోనే తెలుగు వాజ్మయంలో శతక రచన ప్రక్రియ ప్రారంభం కావడం విశేషం. బద్దెన (భద్రభూపాలుడు)సుమతిశతకం, నీతిశాస్త్ర ముక్తావళి, పాల్కురికి సోమనాథుని ‘వషాధిప శతకం’, యధావాక్కుల అన్నమయ్య ‘సర్వేశ్వర శతకం’ కాకతీయ యుగానివే. సారస్వతం, కళలు, శిల్పం, సంస్క తి సహస్ర కిరణాలలో వికసించాయి కాకతీయుల యుగంలో. కాకతీయుల అనంతరం రెడ్డి రాజులకు సమకాలికులు రాచకొండ, దేవరకొండ వెలమప్రభువులు. ఈ ప్రభువులలో సుప్రసిద్ధుడు సర్వజ్ఞ సింగమ నాయకుడు. సర్వజ్ఞ సింగభూపాలుని సమకాలికులు తెలుగులో భాగవతం రచించిన మహాకవి బమ్మెర పోతన, వ్యాఖ్యాన మహాపండితుడు కోలాచల మల్లినాధసూరి. ”పోతన భగవద్భక్తుడు. అతను భక్తిరసాన్ని అద్వితీయముగా, అసామాన్యముగా భాగవతమందు చిప్పిలజేసెను. భక్తిరస ఘట్టములందు ఆయన కవిత్రయాన్నేగాక ఆంధ్ర కవులందరిని మించిన వాడయ్యెను…” అంటూ సురవరం ప్రతాపరెడ్డి శ్లాఘించారు.
కుతుబ్ షాహి రాజులు తెలుగు సారస్వతాన్ని ప్రోత్సహించారు. మాలిక్ ఇబ్రాహీమ్ కుతుబ్షాను నాటి తెలుగు కవులు ‘మల్కిభరాముడ’ ని ప్రశంసించారు. పొన్నగంటి తెలగనార్యుడు మొట్టమొదటి అచ్చతెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ రచించింది కుతుబ్ షాహి పాలనలోనె. గోలకొండ రాజధానిగ ఏలిన కుతుబ్ షాహి రాజుల పాలనలో పరిపాలనా దక్షతకు, రాజనీతి దురంధరత్వానికి ప్రతీకలుగా వెలిగిన, కుతుబ్ షాహి పాలనలో మతసామరస్యానికి ఆలంబనంగా నిలిచిన అక్కన్నమాదనలు తెలంగాణ ముద్దు బిడ్డలు. భద్రాచల భక్తకవి కంచర్ల గోపన్న(భక్త రామదాసు), వ్యాఖ్యాన శిరోమణి, మహా పండితుడు మల్లినాధసూరి తెలంగాణ బిడ్డలు.
ఇరువదవ శతాబ్ది ఆరంభంనుంచే, భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాల ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో జాతీయ భావనల స్ఫూర్తి అంకురించి చైతన్యజ్వాలలు అపూర్వరీతిలో రగుల్కొన్నాయి. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, కవులు, రచయితలు ఆత్మాభిమాన ధనులని, సమరశీలురని చాటే సంఘటనలు సంభవించాయి. మహా పండితుడు, పరిశోధకుడు, రచయిత, విజ్ఞానఖని సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో, రాజాబహద్దుర్ వెంకట్రామ్ రెడ్డి నేతత్వంలో, 1926లో, ‘గోలకొండ’ పత్రిక ప్రచురణ ప్రారంభం కావడం ఒక చరిత్రాత్మక సంఘటన. తెలంగాణ ప్రజలలో సామాజిక, రాజకీయ, సారస్వత, వైజ్ఞానిక చైతన్యానికి, జాగతికి ‘గోలకొండ’ పత్రిక అమితంగా దోహదపడింది. అంతకుముందే హైదరాబాద్ నగరంలో, ఒక సభలో (1921 నవంబర్‌లో) తెలుగు మాట్లాడిన ఒక తెలంగాణ బిడ్డకు అవమానం జరిగింది. ఈ అవమాన భారం తెలంగాణ ప్రాంతంలో మహత్తర పరిణామాలకు దారితీయడం విశేషం. ఇది దాదాపుగా రెండువందల సంవత్సరాల కిందటి సంఘటన. ఈ సంఘటన కలిగించిన అవమానంతో నిరుత్సాహపడి కుంగిపోకుండా కొందరు తెలంగాణ తెలుగు భాషాభిమానులు అదేరోజు సాయంత్రం హైదరాబాద్ నగరం తురుప్ బజారులో ఒక ఇంటిలో సమావేశమై తెలుగు భాషాపరిరక్షణకు, తెలంగాణ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకం ఎత్తడానికి కంకణధారణ చేశారు. ఆంధ్ర జనసంఘ స్థాపనకు అంకురార్పణ జరిపారు. తెలంగాణ తెలుగు ప్రజలు నైజామ్ ఆంధ్రులుగా పరిగణన పొందుతున్న రోజులవి. ‘ఆంధ్ర’ శబ్దం అప్పటికి ఇంకా మలినం కాలేదు, అపఖ్యాతి పొందలేదు. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ సంఘటన హైదరాబాద్ నగరంలో ఆంధ్రజనసంఘ స్థాపన. తరువాత ఘటనలు, పరిణామాలు వేగవంతంగా సంభవించాయి. 1923 మార్చిలో హనుమకొండలో నిజామ్ రాష్ట్ర ఆంధ్ర జనసంఘం స్థాపన విస్తతస్థాయిలో (తెలంగాణ స్థాయిలో)జరిగింది. అంతకుముందే, ఇరువదవ శతాబ్ది ఆరంభంలో, కొందరు తెలంగాణ భాషాప్రియుల కషి ఫలితంగా 1901 సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ నగరంలో శ్రీకష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, తరువాత 1904లో హనుమకొండలో రాజరాజనరేంద్ర భాషానిలయం, వరంగల్లులో శ్రీ శబ్దాను శాసనఆంధ్ర భాషానిలయం, హైదరాబాద్ నగరంలో మరికొన్ని గ్రంథాలయాలు స్థాపితమయి తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమం విస్తరించింది. 1930 గణనీయ సంవత్సరం. అదే సంవత్సరం గాంధీమహాత్ముడు దండి ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. అదే సంవత్సరం తెలంగాణలో-జోగిపేటలో-సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మొదటి ఆంధ్ర మహాసభ (నిజానికి ఇది తెలంగాణ మహాసభ)జరిగింది. తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, సారస్వత, భాషాపర, రాజకీయ, పరిపాలనా సంబంధ సమస్యలపై, వాటి పరిష్కారంపై పాలకుల, పాలితుల దష్టిని కేంద్రీకరించడానికి 1930నుంచి 1946 వరకు పదమూడు మహాసభలు జరిగాయి. ఇవి చరిత్రాత్మక మహాసభలు. 1937లో, నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభ బాధ్యతాయుత ప్రభుత్వం కోసం డిమాండ్ చేస్తూ తీర్మానించింది. తెలంగాణ ప్రజలకు తెలుగు రాదని, తెలంగాణలో తెలుగు సారస్వతం లేదని బ్రిటిష్ ఇండియా ఆంధ్రులు కొందరు (కోస్తాంధ్రులు)చేస్తున్న దుష్ప్రచారానికి దీటయిన సమాధానంగా 1934లో
సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’ కవితా సంకలనం ప్రచురించి తెలంగాణ గ్రామగ్రామాన తెలుగు కవితా స్రవంతులు సజీవంగా ఉన్నాయని నిరూపించారు. అంతేకాదు-1935లో, సిరిసిల్లలో ఆంధ్రమహాసభ(నాలుగవ సభ)మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగే నాటికి ‘ఆంధ్ర’ శబ్దం పట్ల ఏవగింపు మొదలయింది. తెలంగాణ తెలుగు భాషకు అన్ని స్థాయిలలో (ముఖ్యంగా ఆంధ్రమహాసభ నిర్వహణలో) ప్రాధాన్యత లభించాలన్న భావన బలంగా వ్యక్తమయింది. పాఠశాలల్లో బాలికలకు తెలుగు భాషలో విద్యాబోధన జరుగాలని, నిజామ్ ప్రభుత్వం తెలుగు కళాశాలను స్థాపించాలని సిరిసిల్ల ఆంధ్రమహాసభ చేసిన తీర్మానం నాటి పరిస్థితుల్లో విప్లవకరమయినది.
తెలంగాణ ఇంటింట తెలుగు అక్షరజ్యోతి వెలిగించడానికి 1943 మే నెలలో, హైదరాబాద్ నగరంలోని రెడ్డి హాస్టల్ లో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపితమయింది. నాటి నిజామ్ నిరంకుశ ప్రభుత్వం గస్తీనిషాన్‌తో ఎన్నో ఆంక్షలు విధించినప్పటికి ఈ సభలను నిర్వహించి తెలంగాణ ప్రజలలో అపూర్వ చైతన్యం కల్గించడం నిరుపమాన సాహసం. అప్పటికే ఆంధ్ర మహాసభలలో వామపక్షీయుల ప్రాబల్యం పెరుగడం నూతన పరిణామం. ఇదొక వినూత్న రాజకీయ పరిణామం. విప్లవకర భావాలకు, ఆలోచనలకు, ప్రతిఘటనా స్వభావానికి, ప్రగతి మార్గదర్శకత్వానికి పుట్టిల్లు తెలంగాణ. ఆర్యసమాజ్ స్థాపన, విస్తరణతో మితవాద సంస్కరణ భావాలు విస్తరించినట్లే, నిజానికి అంతకన్న శక్తివంతంగా తెలంగాణ గడ్డపై అతివాద భావాలు గూడ వ్యాపించాయి. మత
సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి, జాతీయ సమైక్యతా భావాలకు, సహనశీలతకు పట్టుగొమ్మగా ఆనాటి నుంచే తెలంగాణ ప్రాంతం భాసించింది. అనేక సామాజిక, సారస్వత, సాంస్క తిక ఉద్యమాలు మొలకెత్తించిన చైతన్యంతో కొనసాగిన ప్రజాపోరాటాల పర్యవసానంగా పూర్వపు హైదరాబాద్ సంస్థానం(అందులో సగానికి మించిన-అరవయిలక్షల-జనాభా తెలంగాణ ప్రాంతానిది), భారతసైనిక దళాల రాకతో (ఆపరేషన్ పోలోతో) 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఆసఫ్ జాహి రాచరిక పాలన నుంచి విముక్తమయింది. కేవలం సైనిక దళాల రాకతోనే రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి లభించిందనుకోవడం తెలంగాణ ప్రజాపోరాటాల ప్రభావాన్ని, మహత్తర పాత్రను విస్మరించడమే. రాచరిక వ్యవస్థ కుప్పకూలిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో (తెలంగాణ ప్రాంతం అందులో జనాభా, వైశాల్యం, వనరుల దష్ట్యా ప్రధాన భాగం) ఏర్పాటయిన జనరల్ జయంత్ నాధ్ చౌదరి సైనిక ప్రభుత్వంలో, తరువాత ఎమ్.కె.వెల్లోడి సివిల్ ప్రభుత్వంలో, 1952 ఎన్నికల అనంతరం బూర్గుల రామకష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు తగిన గుర్తింపు, సముచిత ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజలలీ కమిషన్ స్పష్టంగా చేసిన సిఫారసును ఖాతరు చేయకుండా 1956 నవంబర్ 1వ తేదీన జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం విపరీతమయిన ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడం వల్ల దాదాపు అరవయి సంవత్సరాలు ఆంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు, తెలంగాణలో నడచిన పెత్తనం, జరిగిన దోపిడి ఇటీవలి చరిత్ర.
ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, మెహర్బానీ వల్లనో గాకుండా కె.సి.ఆర్. నాయకత్వంలో పధ్నాలుగు సంవత్సరాలు అకుంఠిత దీక్షతో, భీషణభీష్మ ప్రతిజ్ఞతో, వజ్రసంకల్పంతో, ప్రజాపోరాటాలతో, అప్రతిమాన త్యాగాలతో, కె.సి.ఆర్. కఠోర తపస్సుతో తెలంగాణ రాష్ట్రం అవతరణ స్వతంత్రభారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మహత్తర ఘటన-చారిత్రక సత్యం. వేల సంవత్సరాల చరిత్రలో ప్రథమపర్యాయం తెలంగాణ ప్రాంతం-హైదరాబాద్ రాజధానిగ-తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రాధాన్యతను చాటుతూ, ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ప్రతిభావంత, విజ్ఞతాపూర్వక నేతత్వాన ప్రపంచంముందు ఒక ఆదర్శప్రాయ రాష్ట్రంగా తలఎత్తి నిలిచింది. తెలంగాణ రాష్ట్రం మొదటి అయిదు సంవత్సరాల స్వల్పకాలంలో ప్రకతి వనరులను, విశేషించి గోదావరి-కష్ణా జలాలను, అటవీ సంపదను గరిష్ట స్థాయిలో వినియోగిస్తూ వార్షిక అభివద్ధిని, రాష్ట్ర ప్రజల సగటు తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను పెంచుతున్న తీరు, రైతు బంధువంటి పథకాల ద్వారా వ్యవసాయిక, గ్రామీణ అభివద్ధి కోసం కొనసాగిస్తున్న అద్వితీయ కషి, పేదవర్గాల అభ్యున్నతి కోసం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలు ప్రపంచానికి సంభ్రమాశ్చర్యాలు కల్గిస్తున్నాయి. అయిదు సంవత్సరాలు నిండిన తెలంగాణ రాష్ట్రం కె.సి.ఆర్. నాయకత్వంలో జాతీయస్థాయిలో కీలకపాత్ర నిర్వహణకు కంకణధారణ చేయడం శుభసూచకం, నిశ్చయంగా శుభపరిణామం.