రాధికారెడ్డి టీవీ యాంకర్ మరణించే ముందు, తన గురించి తను రాసుకున్న వాక్యాలు ”నా మెదడే నా శత్రువు’ అని. అంటే తన భావనలు, తన ఆలోచనలు, వాటిని నియంత్రించలేని తన అశక్తత వల్ల తన ప్రాణాలను తీసుకుంది.
పదవ తరగతి చదివే విద్యార్థులు చాలా మంది నన్ను అడిగే ప్రశ్న: ‘చదివింది గుర్తుకు వుండడం లేదు. ఏం చెయ్యాలి’.
ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు.. నాతో నా ఫ్రెండ్ ‘బ్రేకప్’ చెప్పింది.. నిరంతరం అవే ఆలోచనలు… దేనిమీద ధ్యాస వుండడం లేదు.. ఏం చెయ్యాలి.. ఏకాగ్రత పోయింది.
నాకు నా సహచరునితో గొడవ అయ్యింది. తను చాలా దూరంలో వుంటాడు.. నాకు నా ఆలోచనలు అధీనంలో లేవు.. ఏం చేస్తున్నానో తెలియడం లేదు. ఈ మధ్య ‘సడన్’గా విషయాలు గుర్తుకు రావటం లేదు. చాలాసార్లు ఉపయోగించే పదాలే.. బ్రెయిన్‌లో దాని తాలూకు బొమ్మ, విషయం, సమాచారం గుర్తుకు వస్తుందికానీ పేరు/పదం గుర్తుకు రావటానికి చాలా సమయం పడుతుంది.
పైవన్నీ తప్పకుండా ఇబ్బంది పెడుతుంటాయి. కొంత ఆందోళన కూడా కలుగుతుంది. అయితే పైవన్నీ సంఘటనలు. ఇది ఒక్కరి పరిస్థితికాదు. కొన్నివేలమందికి అనుభవంలోకి వస్తున్న సంఘటనలు… వాటి గురించి ప్రొఫెసర్ వెండీ సుజుకి అనే మానసిక శాస్త్ర నిపుణురాలు తను రాసిన ‘హ్యాపీ బ్రెయిన్.. హ్యాపీ లైఫ్’ పుస్తకంలో బ్రెయిన్ ఎలా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంచుకోవాలో వ్రాసింది. ఆమె వ్రాసిన దాని ప్రకారం ప్రతిరోజూ కనుక వ్యాయామం చేయడంవలన, శరీరాన్ని కదిలించడం వలన అది బ్రెయిన్‌ను చాలా ఉత్సాహంగా వుంచుతుంది. ఎందుకంటే ప్రతి శరీరభాగం బ్రెయిన్‌కు అనుసంధానించి వుంటుంది కాబట్టి ఈ కదలికవల్ల ‘బ్రెయిన్’ను కాపాడే లక్షణాలను వృద్ధి పరుస్తుంది. అది జీవితకాలం పనిచేస్తుందని చెపుతుంది. అంతేకాకుండా బ్రెయిన్‌లో వున్న ‘ప్రిఫ్రంటల్ కార్టెక్స్’ భాగం మనలో నిర్ణయాత్మకశక్తి, ఏకాగ్రతను దీర్ఘకాలం కొనసాగించేందుకు కారణం అవుతుంది. అంతేకాకుండా ‘దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి’కి సంఘటనలు, వివరణలు, నిజాలు దాచిపెట్టే ‘హిప్పోక్యాంపస్’ చాలా బాగా పని చేయడంవలన జ్ఞాపకశక్తి బాగా వుంటుందని చెప్తుంది. ఈ వ్యాయామం మెదడులో కొత్త ‘బ్రెయిన్ సెల్స్’ జనించేట్టు చేయడంవలన ‘హిప్పోక్యాంపస్’ పరిమాణం పెరగడంవలన అది ‘జ్ఞాపకశక్తి’ని పెంచుతుంది. చాలా రోజుల వరకు జ్ఞాపకం వుండడం జరుగుతుంది. కాబట్టి మన జ్ఞాపకశక్తి తరగడానికి కారణం బ్రెయిన్ ఆరోగ్యంగా వుంచకపోవడం. బ్రెయిన్‌కూడా ఒక ‘కండరం’లాంటిదే. దానికి నిరంతరం వ్యాయామం అందించడం వలన అది దృఢంగా మారుతుంది. దాని వలననే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మన మెదడు మరింత ప్రభావవంతంగా పని చెయ్యాలంటే చెయ్యాల్సిన పనులు:
1. మన మెదడును పరిరక్షించుకోవాలి (2) మెదడుకు ఆహారాన్ని ఇవ్వాలి (3) నెగెటివ్ ఆలోచనలను వదిలిపెట్టాలి (4) మెదడుతో పని చెయ్యనివ్వండి (5) మీ మెదడును ప్రేమించండి (6) మెదడుకు ‘కన్‌సర్ట్ స్థితి’ అభివృద్ధి చేయండి (7) మెదడు సమస్యలను వెంటనే తీర్చండి
(1) మెదడును పరిరక్షించుకోవడం: మనిషి ఉత్తమ పంథాలు, ఉన్నత స్థితి అంతా మెదడు పనిచేసే తీరును మెరుగుపరుచుకోవడం ద్వారానే సాధ్యమైనదని పరిశోధనలు చెపుతున్నాయి. కాబట్టి మెదడును క్రింది పద్ధతులద్వారా రక్షించుకోవాలి.
1. భౌతికంగా ఎలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి. పోట్లాటలకు వెళ్ళకుండా, వాహనాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, ఎక్కువ ‘స్పీడు’తో ప్రయాణం చేయకుండా వుండడం. ఆటలు ఆడేటప్పుడు సరియైన రక్షణలో ఆడటం.
2. ఆహారం అలవాట్లు: మద్యం తాగకుండా ఉండడం, డ్రగ్స్, సిగరెట్స్, కోక్, జంక్‌ఫుడ్‌ను వాడకుండా వుండాలి. వీటివల్ల బ్రెయిన్‌కు కావలిసినంత రక్త ప్రసరణ కాకపోవడంవలన ‘బ్రెయిన్’ స్థాయికి తగ్గ పొటెన్షియల్‌తో పని చేయదు. పైవన్నీ వాడడంవలన 23%-85% రక్త ప్రసరణ బ్రెయిన్‌కు తగ్గిందట. రక్త ప్రసరణ ఆగిపోతే, తగ్గితే.. బ్రెయిన్‌కు అందాల్సిన ఆక్సిజన్ తగ్గుతుంది. దాంతో బ్రెయిన్‌లో జరగాల్సిన ప్రతి చర్య ఆగిపోతుంది. దాంతో మన ఆలోచనలో, భావనలో, ప్రవర్తనలో వేగంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. జ్ఞాపకశక్తిలో కూడా మార్పులు సంభవిస్తాయి. కొందరు విపరీతంగా టీ, కాఫీలుత్రాగుతారు. ఇవి కూడా బ్రెయిన్‌ను ప్రభావితం చేస్తాయి.
3. నిద్ర: బ్రెయిన్‌కు కనీసం 7, 8 గంటల నిద్ర అవసరం. అది తగ్గితే, మెమొరీ, ఏకాగ్రత, నేర్చుకోవడం మీద భయకరంగా ప్రభావం పడుతుంది. అందుకే చాలామంది విద్యార్థులు పరీక్షలు వస్తుంటే.. చదివింది సరిగ్గా గుర్తుండడం లేదు అని దాదాపుగా 85% విద్యార్థులు వాపోతుంటారు. మంచి నిద్ర అవసరం.
4. వత్తిడి: వత్తిడి ఒక మోస్తరు వరకు బ్రెయిన్ పనులను వేగంగా చేస్తుందిగాని, మోతాదు దాటితే, బ్రెయిన్ అన్ని ‘టాక్సిక్’ కెమికల్స్‌ను రిలీజ్ చేస్తుంది. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ రోజులు వత్తిడి వలన బ్రెయిన్ కణాలు దెబ్బతింటాయి, దాంతో మెమొరీ, కన్‌ఫ్యూజన్, మతిమరుపు ఇవన్నీ సంభవిస్తాయి. కాబట్టి బ్రెయిన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి, వత్తిడి నుండి బయటకు వచ్చే పనులు చేయాలి, స్నేహితులతో మాట్లాడాలి, పాటలు వినాలి, ఆటలు ఆడాలి, ఆహ్లాదంగా వుండడానికి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. వత్తిడిని ఎదుర్కోవడం వలననె సానుకూలంగా, తన విధులను నిర్వర్తించగలుగుతుంది.
2. మంచి ఆహారాన్ని ఇవ్వండి: పరిశోధనల వలన మన బ్రెయిన్‌కు కావలసిన ఆరోగ్యకరమైన ఆహారం: ‘ఒమెగా ఫ్యాటీ’ ఆసిడ్‌వున్న ఆహారం, ప్రోటీన్, డెయిరీ ప్రొడక్ట్స్, అల్పాహారం, లంచ్, డిన్నర్ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు బ్రెయిన్ ఆరోగ్యంగా వుండి మన ప్రవర్తన ఆరోగ్యంగా వుంటుంది. మెమొరీ స్ట్రాంగ్‌గా వుంటుంది.
3. నెగెటివ్ ఆలోచనలను పెట్టాలి: క్షణం క్షణం చేసే ఆలోచనలు మన ప్రవర్తనపైన, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. పాజిటివ్‌గా వుంటే, పాజిటివ్ ప్రవర్తన, సంతోషంగా వుండడం, చలాకీగా వుండడం జరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలుంటే చాలా నెగెటివ్‌గా, మానసికంగా కృంగుబాటుతో వుంటాము. వత్తిడిలో వున్నప్పుడు వచ్చే నెగెటివ్ ఆలోచనలు ప్రపంచవాప్తంగా మనుషులు చేసే తప్పుడు ఆలోచనలుగా గుర్తించారు వాటిని ’10 రకాల కాగ్నిటివ్ డిస్‌హర్షన్స్’ అంటారు. వాటిని మార్చుకోవాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా వుండగలుగుతారు. ఉదా: ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే.. నువ్వేమీ మాట్లాడబోతున్నావో తెలుసు నాకు.. ఇహ నాకేమీ చెప్పొద్దు.. అంటారు. దీన్ని ‘మైండ్ రీడింగ్’ అంటారు. ఇది తప్పుడు పద్ధతి.. భవిష్యత్తును నిర్ణయించి చెప్పడం, నువ్వెప్పుడు ఇలానే చెపుతావు, నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది..లాంటివి. ఇలాంటి నెగెటివ్ పద్ధతులను గుర్తించి వాటి నుండి బయటకు రావాలి.
4. బ్రెయిన్‌తో పనిచేయండి: బ్రెయిన్ కూడా ఒక కండరం లాంటిది. ఎక్కువగా ఉపయోగిస్తే.. గట్టిగా, బలంగా మారుతుంది. కొత్తగా నేర్చుకున్న ప్రతిసారి బ్రెయిన్‌లో కొత్త ‘కనెక్షన్’ న్యూరాన్‌ల మధ్య ఏర్పడుతుంది. నేర్చుకోవడం వలన రక్త ప్రసరణ, అందులో ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది, బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. కొత్తగా ఏది నేర్చుకోకపోతే.. రొటీన్‌గా ఉండడంవలన కొత్త కనెక్షన్స్ ఏర్పడక.. పాత కనెక్షన్స్‌ను కోల్పోయి మెమొరీ కోల్పోతాయి. ప్రపంచ మహా శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చెప్పిన సిద్ధాంతం, ప్రతిరోజు కనీసం 15 ని|| కొత్తది చదవండి. 5 సంవత్సరముల జాతీయస్థాయి నైపుణ్యంగల వ్యక్తిగా మారిపోతారు అని.. చదవడం వలన బ్రెయిన్‌కు, కొత్తది ఏదైనా నేర్చుకోవడంవలన బ్రెయిన్‌కు కొత్త ఉత్సాహం వస్తుంది.
5. మీ మెదడును ప్రేమించండి: కుటుంబంలో, స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకోండి. ఇష్టమైన పనులను రెగ్యులర్‌గా వుండేటట్టు చూసుకోండి. పెళ్ళైన వాళ్ళు రెగ్యులర్ దాంపత్య అనుభవం రెగ్యులర్‌గా వుండేటట్టు చూసుకోవడంవలన బ్రెయిన్ చురుకుగా వుంటుంది.
6. ‘కన్‌సర్ట్ స్థితి’ని బ్రెయిన్ పొందేట్టు చేయండి. మనిషితనం చేసే పనిలో పూర్తి సామర్థ్యాన్ని స్థాయిని ‘కన్‌సర్ట్ స్థితి’లోనే చేరగలుగుతాడు. ‘కన్‌సర్ట్ స్థితి’ అంటే రిలాక్స్‌డ్ స్థితిలో వున్న పూర్తి ఏకాగ్రతను కలిగివుండే స్థితి. ఈ స్థితిలో ఆలోచనలు చేసే పనిపైనే పూర్తి దృష్టిని నిలపగలుగుతాము. ఇలాంటి స్థితికి రావాలంటే, చేసే పనిపట్ల క్లారిటీ, చేసే పని చాలా ముఖ్యమైనదని నమ్మటం, దానికి తగిన నైపుణ్యాలను కలిగి వుండడం.
7. మెదడుకున్న సమస్యలను వెంటనే తీర్చండి: మన సమాజంలో శరీరానికి అనారోగ్యం వస్తే వెంటనే డాక్టరకు చూపించుకుని మందులు వాడడం, సర్వసాధారణంగా మారింది. కాని మెదడుకు, మనస్సుకు సమస్య వస్తే మాత్రం.. దానిని అంగీకరించం, డిప్రెషన్, అబ్సెసెన్, ఏకాగ్రత లేక పోవడం, ఏడీడీ, ఏడీహెచ్‌డీ, వీటన్నిటికీ పరిష్కార మార్గాలున్నాయి. ఆందోళన, భయం ఇవ్వన్నిటితో బాధపడుతున్న డాక్టరు దగ్గరికి వెళ్ళక, నాకు ఏ సమ్యలూ లేవు, వాటంతట అవే పోతాయి, ఇవి జబ్బులు కావు.. అయినా ఇలాంటి వాటికి సైకాలజిస్ట్ దగ్గరికి పోకూడదు. పిచ్చోళ్ళు మాత్రమే వెళ్ళాలి అని అనుకుంటారు. ప్రపంచ దేశాల్లో చాలామంది పై సమస్యలకు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి పరిష్కారంతో మంచి జీవితాన్ని పొందుతున్నారు కాబట్టి పై సమస్యలుంటే వెంటనే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్ళి సమస్యను నయం చేసుకుంటే మంచిది. ఆరోగ్యంగా వుండి మన మెమొరీని, ఏకాగ్రతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఆల్ ది బెస్ట్…
డా|| వీరేందర్