ఆరోగ్యమే మహా భాగ్యం… ఇది తరచూ వినిపించే నానుడి. కానీ ఆ ఆరోగ్య మహాభాగ్యాన్ని ప్రజలకు అందించేందుకు తద్వారా ఆరోగ్య తెలంగాణ సాధనకు చకచకా అడుగులు వేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశకత్వంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళడమే కాదు. ఆ స్థాయి సదుపాయాలను వేగంగా కల్పిస్తున్నది. అందులో భాగంగా రూ. 518.29 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లైఫ్ సేవింగ్ మెడిసిన్లతో పాటు, నవజాత శిశువులకు బేబీ కిట్స్, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల, తర్వాత మందుల ఉచిత పంపిణీకి అన్నీ సిద్ధం చేసింది. అవసరమైన నిధులను మంజూరు చేసింది.
సీఎం కేసీఆర్ చెప్పడమే కాదు చెప్పింది చేసి చూపించే విధంగా వైద్య ఆరోగ్యశాఖకు నిధులు మంజూరు చేశారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, వైద్య ఆరోగ్యశాఖకు అధిక నిధులు మంజూరు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా వైద్య విధాన పరిషత్ విభాగంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సల సందర్భంగా వాడి పారేసే మందులు, శస్త్ర చికిత్సల తర్వాత కూడా వాడాల్సిన ఖరీదైన మందుల కోసం రూ.330 కోట్లు విడుదల చేశారు. డిఎంఇ ఆధ్వర్యంలోని బోధన దవాఖానాలకు కలిపి రూ.144 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా ఆస్పత్రులలో ఒకే చోట వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు ఆధునిక యంత్రాల కొనుగోలుకు ఈ నిధులను వెచ్చిస్తారు.
నవజాత శిశువులకు బేబీ కిట్స్ కోసం రూ.3కోట్లు
నవజాత శిశువులకు బేబీ కిట్స్ ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జననం నుంచి మరణం దాకా రాష్ట్ర ప్రతి పౌరుడి సంరక్షణ బాధ్యత తీసుకున్నది, సీఎం కే.సీ.ఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం. మరణాలు సంభవించిన సందర్భాల్లో సుదూర ప్రాంతాలకు మృత దేహాలను తీసుకెళ్ళడానికి, స్మశాన వాటికలకు తీసుకెళ్ళడానికి వీలుగా వైకుంఠ ధామ రథాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి మాతా శిశు సంరక్షణకు కట్టుబడి ఉంది. కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్ళికి ఆర్థిక సహాయం, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్బిణీలకు పోషకాహారం సరఫరా, పురిటినొప్పులతో బాధపడే నిండు గర్బిణీలకు 108 వాహనం ద్వారా సమీప ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలకు ఉచితంగా తరలింపు జరుగుతున్నది. అలాగే ప్రసూతి కేంద్రాలను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం ఆధునీకరిస్తున్నది తెలంగాణ సర్కార్. ఆ కేంద్రాల్లో సాధ్యమైనంత మేరకు ఈజీ డెలివరీస్ చేయడానికి డాక్టర్లను ఆదేశించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి. అందుకు అనుగుణంగా నిలోఫర్ లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి సాధారణ ప్రసూతిల కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక ప్రసూతి కేంద్రాల నుంచి తల్లీ బిడ్డలను ఇళ్ళకే క్షేమంగా ఉచితంగా చేర్చే బాధ్యతను కూడా తీసుకున్నది వైద్య ఆరోగ్యశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 102 నెంబర్ వాహనాల ద్వారా ఇళ్ళకు సురక్షితంగా చేరుస్తున్నది. అంతకు ముందే ఉచితంగా ప్రాణాంతక వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నది. ఇక ఇప్పుడు బేబీ కిట్స్ ద్వారా ఉచితంగా పిల్లలకు అవసరమయ్యే బేబీ సోప్, బేబీ ఆయల్, బేబీ పౌడర్, డైపర్స్ వంటి వాటిని కూడా సరఫరా చేయాలని నిర్ణయిం చింది. ఇందు కోసం రూ.3 కోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత కెజీ టు పీజీ ఉచిత విద్య, ఉపాధి, శిక్షణ, ఉద్యోగావకాశాల కోసం కూడా ప్రభుత్వం పాటు పడుతున్నది. ఇక ఈ బేటీ కిట్స్ ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో ప్రసూతి అయిన వాళ్ళే ఈ పథకానికి అర్హులు. నెల రోజుల్లో ఈ పథకం ప్రారంభం కానున్నది.
లైఫ్ సేవింగ్ మెడిసిన్ కి రూ.10 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ వైద్య రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం కే.సీ.ఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సేవింగ్ మెడిసిన్ని ప్రవేశ పెడుతున్నది. గుండె, కాలేయం, కిడ్నీ వంటి అవయవాల మార్పిడి, దీర్ఘ కాలిక రోగాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవాళ్ళకి వీటిని వినియోగిస్తారు. ఇలాంటి వ్యాధుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, శస్త్ర చికిత్సలు ఖరీదైనవి. అలాగే శస్త్ర చికిత్సల తర్వాత కూడా ఖరైదీన మందులు దీర్ఘ కాలికంగా వాడాల్సి వుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ వైద్యంలో రొటీన్ మందులే అందుతున్నాయి. మిగతా మందులను బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితే ఉంది. అందుకని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆలోచించి, లైఫ్ సేవింగ్ మెడిసిన్ని ఆచరణలోకి తెచ్చారు. దీని ద్వారా వ్యాధిగ్రస్థులకి పూర్తి ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం, చికిత్స, నెలవారి మందులు అందు తాయి. ఇది డిఎంఇ ఆధ్వర్యంలో జరిగే వినూత్న ప్రయోగం.
సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రూ. 144 కోట్లు
సమగ్ర వ్యాధి నిర్ధారణ ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో ఓ ప్రహసనంగా ఉంది. ఒక్కో పరీక్షకు ఒక్కో చోటకి వెళ్ళాల్సి వస్తున్నది. తీవ్ర సమస్యల్లో ఉన్న వ్యాధిగ్రస్థు లకు ఇది భరించలేని గుది బండగా మారింది. పైగా అన్ని పరీక్షలు కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో ఉండటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టకుని, ఆధునిక పరికరాలు, అవసరమైన కెమికల్స్, ఇతర మందులను కొనుగోలు చేయడానికి రూ.144 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే వివిధ చోట్ల ఉన్న పరీక్షలన్నింటినీ ఒకే చోటకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్ని వైద్యశాలల్లోనూ జరిగే విధంగా చూడాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే అనేక చోట్ల ఐసియులు, ఆధునిక పరికరాలు సమకూర్చారు. అల్ట్రా సౌండ్, కౌల్టర్ మిషన్, స్కానింగ్ పరికరాలు, రకరకాల రసాయనాలు వంటి మరిన్ని సదుపాయాల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈ నిధులు కూడా డిఎంఇ ఆధ్వర్యంలోని అన్ని వైద్యశాలలకు అవసరాల మేరకు అందిస్తారు.
మరో రూ.330 కోట్లు
ఇలాంటి పరీక్షల కోసమే వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే 102 ఏరియా ఆసుపత్రుల్లో, జిల్లా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల కోసం మరో రూ.330 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం. ఆయా వైద్యశాలల్లో అవసరమైన మేరకు సదుపాయాలు కల్పించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది.
రాష్ట్ర క్యాన్సర్ సెంటర్‌గా ఎంఎన్‌జె
కాన్సర్ విభాగంలో ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో హైదరా బాద్‌లోని ఎంఎన్‌జె వైద్యశాల ఒక్కటే ఉంది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో భారమంతా ప్రభుత్వ ఎంఎన్‌జె ఆసుపత్రి మీదే పడుతు న్నది. అందు కోసం ప్రత్యేకంగా మరో బ్లాక్ నిర్మాణానికి రూ.31.29 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మరింత మందికి ఈ బ్లాక్ ద్వారా వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుంది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఇప్పటికే ఖమ్మం క్యాన్సర్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంఎన్‌జెను స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌గా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఆరోగ్య తెలంగాణకు చకచకా అడుగులు నవజాత శిశువులకు ఉచితంగా బేబీ కిట్స్ వైద్య చరిత్రలో మొదటిసారి లైఫ్ సేవింగ్ మెడిసిన్ వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, తర్వాత మందులకు భారీగా నిధులు స్టేట్ క్యాన్సర్ యూనిట్‌గా ఎంఎన్జె హాస్పిటల్ రూ. 518.29 కోట్లు విడుదల