magaతెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ జిపిఎస్‌ బేస్డ్‌ మోబైల్‌ యాప్‌కు మరో అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మక క్వాలిటీ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా (QCI) ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు డిఎల్‌ షా నేషనల్‌ క్వాలిటీ గోల్డ్‌ అవార్డుని ఇచ్చింది. ఈ అవార్డుని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సిఇఓ డాక్టర్‌ కె.మనోహర్‌ క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఆదిల్‌ జైన్‌ ఉల్‌ భాయ్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌, కాన్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, అసోచాంలు కలిసి 1992లో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాని ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి సేవల్లో నాణ్యతని పెంచడానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డులు ఇస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డు మన తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి దక్కడం విశేషం. గతంలోనూ ఫిక్కీ హెల్త్‌ కేర్‌ ఎక్సలెన్సీ అవార్డు-2016 కూడా దక్కిన విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ యాప్‌ను అనుసరించేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యాప్‌ను నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీంలో పొందుపరచాలని సంకల్పించింది. ఇందు కోసం పలు మార్లు ట్రస్ట్‌ను సందర్శిస్తూ యాప్‌ వివరాలను పరిశీలిస్తున్నది.

ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు రావడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ యాప్‌ను తయారు చేయడంలో కృషి చేసిన టెక్నికల్‌ జిఎం చెన్నూరి సోమశేఖర్‌తో పాటు వారి సిబ్బందిని అభినందించారు.

Other Updates