healthప్రజలకు చేరువగా ఆరోగ్యం, అదీ ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలయితే, ప్రజలు అనారోగ్యానికి ఆమడదూరంలో వుంటారు. ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో వుంచాలనే ప్రభుత్వ ఆలోచన అంచెలంచెలుగా పెరుగుతున్నది. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలనే మన ముఖ్యమంత్రి ఆలోచనకు తగినట్టు అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా పడుతున్న అడుగులలో వేగం పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

50 శాతం ప్రసవాలు ప్రభుత్వ వైద్య శాలల్లోనే…

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రసవాలలో 50 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలలొనే జరగాలలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ప్రసూతి కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వైద్యశాలల డాక్టర్లు, సిబ్బంది నిజామాబాదు జిల్లా ఆర్మూర్‌, వరంగల్‌ వైద్య శాలలను ఆదర్శంగా తీసుకోవాలి. పరిమిత, ప్రస్తుత వనరులతోనే స్వీయ క్రమశిక్షణతో ఆర్మూర్‌ వైద్యశాల సిబ్బంది అద్భుత ఫలితాలు సాధించారు. సిజేరియన్‌ ఆపరేషన్స్‌ 50శాతం జరుగుతున్నాయి. వాటిని అంతగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సహజ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. రానున్న కాలంలో 30 శాతం సిజేరియన్‌ ఆపరేషన్స్‌ని తగ్గించాలి. మొత్తంగా 50 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరిగే విధంగా చూడాలని మంత్రి ఆదేశించారు.

హైదరాబాద్‌ వెంగళరావునగర్‌ లోని IIనఖీఔలో జరిగిన జిల్లా వైద్య ఆధికారులు, జిల్లా వైద్యశాలల సూపరింటెండెంట్‌లతో వైద్య శాఖ మంత్రి డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి నవంబర్‌ 21న సమావేశమయ్యారు. జిల్లాల విభజన నేపథ్యంలో వైద్య సేవల పనితీరు, వైద్య శాలల విభజన, విస్తరణ, ఖాళీలు, అవసరాలు, హాస్పిటల్‌ అభివృద్ధి కమిటీలు, లక్ష్యాలు వంటి పలు అంశాల మీద సమీక్ష చేసిన మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ వైద్యం అభివృద్ధి మీద అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణను త్వరలోనే పూర్తి చేస్తామని, కాంట్రాక్టు స్పెషలిస్టు డాక్టర్ల నియామక బాధ్యత ఇకనుండి హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ దేనని, తల్లి బిడ్డల ఆరోగ్య నమోదు కోసం త్వరలో ప్రతి ఉప ఆరోగ్య కేంద్రానికో ట్యాబ్‌ ఇస్తామని చెప్పారు. ఇక నెల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని, ఫలితాల లక్ష్య సాధనతో అందరూ పని చేయాలని ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు మొత్తం వైద్య యంత్రాంగం పని చేయాలని జిల్లాల వైద్య అధికారులు, హాస్పిటల్స్‌ సూపరింటెండెంట్లకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు బలోపేతం చేయడానికి లక్ష్యాలను నిర్దేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ వైద్యం ప్రజలకు మరింత చేరువ అయింది. దానికి తగ్గట్లుగా వైద్య సేవలు ప్రజలకు అందించాలి. మాతా, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేయాలి. ఈ రకమైన మరణాలను పూర్తిగా అదుపు చేయాలి. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వల్ల జరిగే మరణాలను తగ్గించాలి. తద్వారా మన నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమంటూ మంత్రి సూచించారు.

50 శాతం ఆరోగ్యశ్రీ సేవలు ప్రభుత్వ దవాఖానాల్లోనే…

ఆరోగ్యశ్రీ సేవలు ప్రస్తుతం ప్రభుత్వ వైద్య శాలల్లో 30 శాతం మాత్రమే జరుగుతున్నాయి. వీటిని 50 శాతానికి పెంచాలని మంత్రి సూచించారు. ప్రజలకు మరిన్ని సేవలు ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వ హాస్పిటల్స్‌ లోనే జరిగే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరు కూడా మెరుగు పడాలి.

ఒకే చోట అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు…

అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ వైద్య శాలల్లోనే జరగాలి. అందుకు తగ్గ వైద్య పరికరాలను అందిస్తున్నాం. వాటిని సమర్ధంగా వినియోగించికోవాలని మంత్రి చెప్పారు. అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకే చోట జరిగే విధంగా హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు.

అన్ని రకాల మందులు కూడా…

అన్ని రకాల మందులు కూడా ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రజలకు అందే విధంగా చూడాలి. ఆయా చోట్ల వచ్చే వ్యాధులు, ప్రబలే వ్యాధులు, వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులనే అందుబాటులో ఉంచాలి. అవసరమైన వాటికోసం తగిన ఇండెంట్లు పంపించుకోవాలని మంత్రి చెప్పారు.

70 ఏళ్ళ లోపు వారి మరణాల తగ్గింపు…

2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 70 ఏళ్ళ లోపు జరిగే మరణాలు 40 శాతానికి తగ్గించాలి. మరణాల రేటు తగ్గే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి. వైద్య సేవలను మెరుగు పరచాలని మంత్రి చెప్పారు.

తల్లీ బిడ్డల ఆరోగ్య నమోదు కోసం

త్వరలో ప్రతి ఉప – ఆరోగ్య కేంద్రానికో ట్యాబ్‌…

తల్లి బిడ్డల ఆరోగ్య వివరాల నమోదు కోసం త్వరలో ప్రతి ఉప ఆరోగ్య కేంద్రానికో ట్యాబ్‌ ను అందచేయనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి అన్నారు. ఆ ట్యాబ్‌ లో వివరాలు పొందుపరచి, ఆయా వివరాల ప్రకారం వైద్య సేవలు అందించాలని మంత్రి చెప్పారు.

ఇక నెల వారీగా సమీక్షలు

ఇకనుండి నెల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఫలితాల లక్ష్య సాధనతో పని చేయాలని, ప్రతి నెలలో చేసిన ప్రగతిని వివరించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. వచ్చే నెలలో ప్రస్తుతం ఉన్న ప్రసూతిలను 5 శాతం మేర పెంచాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. సిబ్బంది రేషనలైజేషన్‌ స్థానికంగా కలెక్టర్లతో చర్చించి, సమన్వయంతో చేసుకోవాలని మంత్రి సూచించారు.

Other Updates