సురక్షిత మంచీనీరు ప్రతీ రోజు నిర్విఘ్నంగా ప్రతీ గడపకు అందించే మహోన్నత లక్ష్యంతో తలపెట్టిన పథకం మిషన్‌ భగీరథ పథకం


సురక్షిత మంచినీరు తాగకపోవడం వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, హెపటైటిస్‌ -ఎ, హెపటైటిస్‌-ఇ, టాక్సో ఫ్లాస్మాసిస్‌, గియార్డియాసిస్‌ లాంటి ఎన్నో రోగాలు వస్తాయని, 80 శాతం రోగాలకు, ప్రపంచంలో ప్రతీ ఏటా 3.1 శాతం మరణాలకు కలుషిత నీరే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. భూగర్భ జలాల వల్ల ఫ్లోరోసిస్‌ వస్తుందని చెప్పింది. భారతదేశంలో ప్రజలు తాగే నీరు 70 శాతం మేర కలుషితం అవుతున్నదని వరల్డ్‌ రిసోర్స్‌ ఇనిస్టిట్యూట్‌ స్పష్టం చేసింది. మంచినీటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న దేశాల జాబితాను ప్రకటించిన ఐక్యరాజ్యసమితి భారతదేశానికి 120వ స్థానం కేటాయించింది.

పైన పేర్కొన్న వాస్తవాలు సురక్షిత మంచినీటి ఆవశ్యకతను తేల్చి చెబుతున్నాయి. నేడు తెలంగాణ రాష్ట్రం మంచినీటి సరఫరా విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుని సగర్వంగా నిలిచింది. సురక్షిత మంచీనీరు ప్రతీ రోజు నిర్విఘ్నంగా ప్రతీ గడపకు అందించే మహోన్నత లక్ష్యంతో తలపెట్టిన మిషన్‌ భగీరథ పథకం తెలంగాణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చింది. రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. యావత్‌ దేశానికి నేడు ఈ పథకం ఆదర్శమయింది. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజలను నిత్యం వేధిస్తున్న సమస్యను ఆరేళ్ల చిరు ప్రాయంలోనే తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా పరిష్కరించింది. ప్రజారోగ్య రక్షణ పట్ల ప్రభుత్వం తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి గోస
తెలంగాణ ఆవిర్భవానికి ముందు గొంతు తడుపుకోవడానికి అష్ట కష్టాలు పడేవారు. నాటి గణాంకాలు పరిశీలిస్తే అప్పటి గోస కళ్లకు కడుతుంది. ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యాలున్న ఆవాస ప్రాంతాలు 5,767 మాత్రమే. పాక్షిక మంచినీటి వసతులున్నవి 17,753 ఆవాసాలు. మిగతా 1,619 ఆవాసాల్లోని ప్రజలు కలుషిత నీరు తాగేవారు. మంచినీటి పథకాలున్న ఆవాసాల్లో కూడా 365 రోజుల పాటు నీరు అందే పరిస్థితి ఉండేది కాదు. ఎండా కాలంలో భూగర్భ జలాలు ఎండిపోయి, నీరు అందకపోయేది. కరెంటు లేకపోవడం వల్ల నీటి పంపింగ్‌ సాధ్యపడకపోయేది. మోటార్లు, బోర్లు పాడవడం వల్ల నీటి సరఫరా నిలిచిపోయేది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నల్లాలు బంద్‌ అయ్యేవి. ఎప్పుడో ఓ సారి వచ్చిన కొద్దిపాటి నీళ్లు అందరికీ సరిపోకపోయేవి. కేవలం 32 శాతం గృహాలకు మాత్రమే నల్లా ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండేది. ఆ ఇండ్లకు కూడా ఒక్కొక్కరికి సగటున 22-55 లీటర్ల నీరు మాత్రమే వచ్చేది. దీంతో నల్లా దగ్గర బిందె యుద్ధం జరిగేది. మహిళలు మైళ్ల కొద్దీ దూరం నడిచి వ్యవసాయ బావుల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుని వాటినే రోజంతా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది.


చాలా గ్రామాల్లో ఫ్లోరైడ్‌, నైట్రేట్స్‌, ఇనుము, ఉప్పు సంబంధిత సమ్మేళనాలతో కూడిన నీటిని తాగుతూ ఫ్లోరైడ్‌ బారిన పడి జీవచ్ఛవాళ్లయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నాడు ఫ్లోరైడ్‌ సమస్యకు నల్లగొండ జిల్లా ఓ అధ్యయన వేదికగా మారిందంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల బతుకులు ఎంత హృదయవిదారకంగా
ఉండేవో అంచనా వేయవచ్చు. తెలంగాణ ఏర్పడే నాటికి 82 శాతం గ్రామాలు భూగర్భ జలాలపైనే ఆధారపడి మంచినీటి పథకాలు నడిపారు. 1043 గ్రామాలు ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలుగా, 163 గ్రామాలు నైట్రేట్‌ పీడిత గ్రామాలుగా, 187 టిడిఎస్‌ పీడిత ప్రభావిత గ్రామాలుగా ఉండేవి.

తెలంగాణ రాష్ట్రం తొలి ప్రాధాన్యతల్లో మంచినీటి పథకం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ప్రజల మంచినీటి కష్టాలను తీర్చడమనే అంశం ముందు వరుసలోకి వచ్చింది. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, పిడుగు పడినా, వరదు పారినా, ఏదేమైనా సరే ప్రతీ రోజు ప్రతీ ఇంటికి ఖచ్చితంగా మంచినీరు అందించే పథకం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రోజుల తరబడి మేధామథనం చేసి మిషన్‌ భగీరథ పథకం స్వయంగా రూపొందించారు.

మొత్తం ప్రాజెక్టు డిజైన్‌ కేసీఆర్‌ పర్యవేక్షణలోనే జరిగింది. ప్లానింగ్‌ అంతా పూర్తయ్యాక పనులను కూడా కేసీఆర్‌ ప్రతీ రోజు పర్యవేక్షించారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగేవారు. ఫలితంగా మిషన్‌ భగీరథ పథకం శరవేగంగా పూర్తయింది. ఫ్లోరైడ్‌ పీడిత నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ గ్రామంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జూన్‌ 8 నాడు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతుల మీదుగా 2016 ఆగస్టు 7న గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండలో పథకం ప్రారంభమయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 23,968 గ్రామీణ ఆవాసాలకు, 120 పట్టణ ఆవాసాలకు మిషన్‌ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీళ్లు అందుతున్నాయి. 45 వేల కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కృష్ణ, గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాల నుంచి 86.11 టిఎంసిల నీరు తీసుకోవడానికి 67ఇంటేక్‌ వెల్స్‌ నిర్మాణం జరిగింది. ఈ నీటిని పరిశుద్ధం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 153 వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. నదుల నుంచి ప్రతీ ఇంటికి మంచినీటిని చేర్చడానికి 1.40 లక్షల కిలోమీటర్ల పైపు లైన్లు వేశారు. మంచినీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన 180 మెగావాట్ల విద్యుత్‌ ను ఎక్కడా అంతరాయం లేకుండా అందిచేందుకు 44 డెడికేటెడ్‌ సబ్‌ స్టేషన్లు, 1209.8 కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్లు వేశారు. మొత్తం ఆవాస ప్రాంతాలకు నేడు మంచినీరు అందుతున్నది. 53.46 లక్షల నల్లా ద్వారా ఇంటింటికి మంచీనీరు అందుతున్నది. సాంకేతిక కారణాల వల్ల కేవలం 1.73 శాతం ఇండ్లకు మాత్రమే నీరు అందడం లేదు. వాటికి కూడా నీళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.


తెలంగాణ నంబర్‌ వన్‌ అని తేల్చిన జల్‌ శక్తి
ప్రజలకు ప్రతీ రోజు నల్లా ద్వారా మంచినీరు అందించే విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జల్‌ జీవన్‌ మిషన్‌, 2020 ఆగస్టులో నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఆవాసాలుండగా, అందులో 53.46 లక్షల ఆవాసాలకు (98.27 శాతం) మిషన్‌ భగీరథ పథకం ద్వారా సురక్షిత త్రాగునీరు అందుతున్నదని జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,879.93 లక్షల ఆవాసాలుండగా 517.97 (27.28 శాతం) లక్షల ఆవాసాలకు మాత్రమే నల్లా ద్వారా త్రాగునీరు అందుతున్నదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఏ రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రానికి దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. తెలంగాణ వస్తే ఏమొస్తదో మిషన్‌ భగీరథ పథకం ద్వారా కేసీఆర్‌ మరోసారి నిరూపించారు. దేశానికి దశ, దిశా చూపిస్తూ నవ తెలంగాణ రాష్ట్రం సాధించిన మరో విజయమిది.


దేశమంతా అమలు చేస్తామన్న కేంద్రమంత్రి షెకావత్‌

తెలంగాణ చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రకటించారు. 2019 నవంబర్‌ 11న తెలంగాణ పర్యటనలో భాగంగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా మిషన్‌ భగీరథ పథకం స్వరూపాన్ని తెలుసుకున్న ఆయన తెలంగాణ పౌరులకు శుద్ధ జలాలని అందించేందుకు కేసీఆర్‌ పడుతున్న ప్రయాసను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కీర్తించారు. మినరల్‌ వాటర్‌ కంటే మిషన్‌ భగీరథ నీళ్ళే శ్రేష్ఠమైనవన్న ఐఎన్‌ఆర్‌ఈఎం ప్రజలకు తాగునీటిని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కనబర్చిన అంకితభావాన్ని ఇండియన్‌ నేచురల్‌ రిసోర్స్‌ ఎకనామిక్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ సంస్థ ప్రశంసించింది. ఆర్వో సిస్టం ద్వారా శుద్ధి చేసిన నీటి కంటే, మిషన్‌ భగీరథ నీళ్ళే అత్యంత స్వచ్ఛమైనవి, సురక్షితమైనవని, శ్రేష్టమైనవని ఐఎన్‌ఆర్‌ఈఎం ప్రకటించింది. మిషన్‌ భగీరథ పథకం ద్వారా అందుతున్న త్రాగునీటి వల్ల తర్వాత కాలంలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు కూడా నమోదు కాలేదని ఈ సంస్థ స్పష్టం చేసింది.

నీతి ఆయోగ్‌ ప్రశంస
తెలంగాణ చూపిన దారిలో ఈ పథకం అమలు చేయడానికి మరో 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేయడం మంచిదని సాక్షాత్తు నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. ఇది మిషన్‌ భగీరథకు దక్కిన గొప్ప ప్రశంస.

తెలంగాణ స్ఫూర్తితో బెంగాల్‌ ‘‘జల్‌ స్వప్న’’
తెలంగాణలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం స్ఫూర్తి దేశ వ్యాప్తంగా ప్రతిఫలించింది. మిషన్‌ భగీరథ పథకం బాటలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం జల్‌ స్వప్న ప్రాజెక్టు చేపట్టింది. దాదాపు రూ. 58 వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టును ఐదు సంవత్సరాలోపు పూర్తి చేయాలని సంకల్పించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా నిర్వహణలో అవలంభిస్తున్న విధానం దేశానికే ఆదర్శం అని జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ డైరక్టర్‌ మనోజ్‌ కుమార్‌ సాహు కీర్తించారు. 16 జూలై 2020న దేశంలోని అన్ని రాష్ట్రాలు మంచినీటి సరఫరా నిర్వహణ విధానాన్ని అనుసరించాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖలు రాశారు. తెలంగాణ ప్రభుత్వం మంచినీటి సరఫరాలో అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ సాంకేతికతను వినియోగిస్తూ నీటి వృధాను అరికడుతూ దేశానికి మార్గ నిర్ధేశనం చేసిందని అన్నారు. ఆయా రాష్ట్రాలు అధ్యయనానికి టెక్నికల్‌ టీములను తెలంగాణ రాష్ట్రానికి పంపి మంచినీటి సరఫరాలో తెలంగాణ మోడల్‌ ను అనుసరించాలని సూచించారు.

గటిక విజయ్‌ కుమార్‌

Other Updates