మార్గం లక్ష్మీనారాయణ
నాడు తెలంగాణ ఉద్యమంలో తొడ గొట్టి బస్తీమే సవాల్! అన్న కెసిఆర్, నేడు అవే బస్తీల్లో ‘స్వాస్త్య’ (ఆరోగ్య) ‘వాల్’ (గోడ) కడుతున్నారు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చి బస్తీల్లో కడు దయనీయ బతుకులు వెల్లదీస్తున్న, మురికి నరక కూపాల్లో మహా యాతన పడుతున్న నిరుపేదలందరికీ నేనున్నానంటున్నారు. గతంలో కనీ వినీ ఎరగని రీతిలో మహానగర గల్లీ ప్రజలకు వెయ్యి బస్తీ దవాఖానాల ద్వారా ఢిల్లీ మొహల్లాలను మించిన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
ఇప్పటికే సిఎం కెసిఆర్ విజన్‌తో వైద్య ఆరోగ్యశాఖ మిషన్ మోడ్‌లో పని చేస్తున్నది. అందుకే ఆ శాఖ పని తీరు మెరుగు పడింది. పెంచిన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల నేపథ్యంలో సామర్థ్యానికి మించి ఓపీ, ఐపీ పెరగడం, అవార్డులు కూడా తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇదే తరహాలో మరో ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కెసిఆర్ విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న గ్రేటర్ హైదరాబాద్ ని ఇక హెల్తీ హైదరాబాద్ గా మార్చేందుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ ఇగ ‘ఆరోగ్య’ బాద్‌గా మారనుంది.
ఆరోగ్యశాఖ-గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లు సమన్వయంతో… జిహెచ్‌ఎంసి పరిధిలో మూడంచెల ఆరోగ్య సేవలు అందించనున్నాయి. మురికి వాడల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించడమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలకు రూపకల్పన జరిగింది. అవసరాలను బట్టి భవిష్యత్తులో నగరంలో వెయ్యి బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రతి 5వేల నుండి 10వేల జనాభాకు ఒకటి చొప్పున పైలట్ ప్రాజెక్టుగా 50 దవాఖానాలను ముందుగా ప్రారంభించాలని భావించినప్పటికీ, అందులో 40 దవాఖానాలు ప్రస్తుతం సిద్ధమయ్యాయి. వీటిలో 18 బస్తీ దవాఖానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే మరికొద్ది రోజుల్లో మిగతా బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో అవసరాలను బట్టి వెయ్యి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న 145 సీహెచ్‌సిలకు తోడుగా సర్కిల్‌కు ఒకటి చొప్పున మొత్తం 30 సీహెచ్‌సిలు ఏర్పాటు కానున్నాయి. గ్రేటర్‌లో జోన్ కు ఒకటి చొప్పున 100 పడకల ఏరియా హాస్పిటల్స్ ని ఏర్పాటు చేస్తారు. అలాగే నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ-గ్రేటర్ హైదరాబాద్ అధికారులతో కలిపి ఏర్పాటు చేస్తారు. మొత్తం నగర ఆరోగ్య పరిరక్షణకు త్వరలో సిటీ హెల్త్ సొసైటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 13,2017ననే గ్రేటర్ హైదరాబాద్‌లోని కాన్ఫరెన్స్ హాలులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి- ఐటీ, పురపాలక, పట్టణాభివ ద్ధి శాఖ మంత్రి కెటిఆర్-మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్‌లు గ్రేటర్ హైదరాబాద్ ఆరోగ్య సమీక్ష చేశారు.
జిహెచ్‌ఎంసిలో మూడంచెల ఆరోగ్య సేవలు
గతంలో ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడి, వేర్వేరుగా సానిటేషన్-ఆరోగ్య విధులు నిర్వర్తిస్తున్న ఈ రెండు శాఖలను ఇక నుంచి సమన్వయంగా పని చేయించాలని నిర్ణయించాయి. ఇందు కోసం మూడంచెల పద్ధతిని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సబ్ సెంటర్లు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా, జిల్లా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పద్ధతి కొనసాగు తున్నది. అయితే మహానగరంలో మాత్రం ఈ పద్ధతి కూడా లేకుండా వేర్వేరుగా ఈ రెండు శాఖల పని తీరు కొంత గందరగోళంగా మారింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఈ రెండు శాఖలను ఒకే గొడుగు కిందకు తేవడమేగాక, నగర ప్రజలు, భౌగోళిక పరిస్థితులకనుగుణంగా మూడంచెల పద్ధతిని ప్రవేశ పెట్టనున్నాది ప్రభుత్వం. నగరంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఉన్నాయి గనక, సబ్ సెంటర్ల తరహాలో బస్తీ దవాఖానాలు, సిహెచ్‌సిలు, ఏరియా హాస్పిటల్స్ ఉండాలని నిర్ణయించారు. సిహెచ్‌సిలు రెఫరల్ దవాఖానాలుగా పని చేస్తాయి.
బస్తీ దవాఖానాలకు రూపకల్పన
హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 1400 మురికి వాడ (బస్తీలు-స్లమ్ ఏరియాలు)లను గుర్తించారు. అయితే వీరికి మిగతా ప్రాంతాల ప్రజల మాదిరిగా వైద్య సేవలు అందుబాటులో లేవు. 5 కి.మీ. లోపు వైద్యశాలలు అందుబాటులో లేని 50 బస్తీలను గుర్తించారు. ఈ 50 బస్తీల్లో పైలట్ ప్రాజెక్టుగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక నర్స్‌లతోపాటు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ప్రాథమికంగా చికిత్సలు అందిస్తారు.
10 రకాల వైద్య సేవలు
ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్బిణీలు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్, రక్త హీనత, షుగర్, బీపీ, క్యాన్సర్ పరీక్షలు, ఇతర ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య పరిరక్షణ-అవగాహన-చైతన్యం వంటి 10 రకాల వైద్య సేవలు బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంటాయి. అంతకు మించిన ఆరోగ్య, అత్యవసర సమస్యలకు రెఫరల్ హాస్పిటల్స్‌గా ఉండే సిహెచ్‌సిలు, ఇతర ప్రభుత్వ దవాఖానాలకు రెఫర్ చేస్తారు.
భవిష్యత్తులో వెయ్యి బస్తీ దవాఖానాలు
1400 మురికి వాడలను గుర్తించినందున ఈ పైలట్ ప్రాజెక్ట్‌ని సఫలం చేసి, దాదాపు వెయ్యి మురికి వాడల్లో ఈ బస్తీ దవాఖానాలను పెట్టాలని ఆలోచిస్తున్నది జిహెచ్‌ఎంసి-వైద్య ఆరోగ్యశాఖ. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రజలందరికీ ప్రాథమిక చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది.
నగరంలో వైద్య సేవల విస్తరణ
జిహెచ్‌ఎంసిలో ప్రస్తుతం 145 సీహెచ్‌సిలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిని మరింతగా విస్తరిస్తారు. ఇక ఇప్పుడు గ్రేటర్‌లో ఉన్న 30 సర్కిళ్ళల్లో సర్కిల్‌కు ఒకటి చొప్పున సీహెచ్‌సిలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఐదు జోన్లలో జోన్ కు ఒకటి చొప్పున ఐదు 100 పడకల ఏరియా హాస్పిటల్స్ ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పటికే మూడు ఏరియా హాస్పిటల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయి. సౌత్, వెస్ట్ జోన్లలో లేవు. అందుకే ఆ రెండు జోన్లలోనూ ఏరియా హాస్పిటల్స్ నిర్మాణం జరిగే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
సిటీ హెల్త్ సొసైటీ
ఇక క్రమ క్రమంగా నగరం విస్తారమై, రాష్ట్ర జనాభాలో మూడో వంతు జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ అంత సులువు కాదు. అయితే, గ్రేటర్‌లో మిగతా పాత జిల్లాల మాదిరిగానే పాత హైదరా బాద్-రంగారెడ్డి జిల్లాల తరహా వైద్య సేవల పద్ధతి కొనసాగుతున్నది. దీంతో గ్రేటర్ నగర జనాభాకు తగ్గ వైద్య సేవలు-జిల్లా పద్ధతిన ఇచ్చే వైద్య సేవలకు మధ్య సమన్వయం కొరవడింది. అందుకే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ-గ్రేటర్ హైదరాబాద్ సమన్వయంతో పని చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా నగర ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఆ రెండు శాఖల అధికారులతో కలిపి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనినే సిటీ హెల్త్ సొసైటీగా పిలుస్తారు.
నిధుల సమన్వయం
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్-రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ-జిహెచ్‌ఎంసి-సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల సమన్వయంతో గ్రేటర్ ఆరోగ్య సేవలను విస్తరించనున్నారు. నిధుల కొరత తీరడమేగాక, ఎక్కడికక్కడ వైద్య సేవలు అందుబాటులోకి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద భారం తగ్గుతంది. అలాగే అత్యవసర సేవలకు ఆటంకాలు తొలగుతాయి. మహా నగరంలో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువలోకి వస్తాయి.