రాష్ట్రంలో 55 రోజులపాటు జరిగిన ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి వారిని బేషరతుగా విధుల్లో చేరమని ఆహ్వానించడం ద్వారా మనసున్నమారాజుగా మరోసారి నిరూపించుకున్నారు. ఆర్టీసీ కార్మికులలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన కొద్ది గంటలలోనే ”ప్రగతిరథం – ప్రజల నేస్తం”గా ప్రకటించుకున్న ఎర్ర బస్సులు రోడ్డుపై సందడిచేయడం ఆరంభించాయి.
సుమారు 49 వేలమంది కార్మికులు పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంత సుదీర్ఘకాలం సమ్మె జరగటం ఇదే మొదటిసారి. సమ్మె కారణంగా అసలే నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీ మరింత ఊబిలో కూరుకుపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా జీతాలు చెల్లించేందుకు కూడా సంస్థవద్ద డబ్బులేని పరిస్థితి నెలకొంది.
కార్మికులు నిర్హేతుకంగా సమ్మెకు దిగారని, బతుకమ్మ, దసరా వంటి పండుగ రోజుల్లో, సంస్థకు మంచి ఆదాయం వచ్చే రోజుల్లో సమ్మెచేయడం సమంజసం కాదనీ ప్రభుత్వం పదేపదే హెచ్చరించినా కార్మికులు సమ్మెబాట వీడలేదు. ముఖ్యమంత్రి మరింత చొరవతీసుకొని కార్మికులు విధుల్లో చేరాలని రెండు పర్యాయాలు గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది. కార్మిక సంఘాలు పట్టినపట్టు విడువలేదు. కానీ, కాలంగడిచిన కొద్దీ కార్మికులలో అలజడి ప్రారంభమై, పంతాలను వదిలి విధులకు హాజరవుతామని తమంతట తాముగా ముందుకు వచ్చారు. అయితే, ఆర్టీసీ సమ్మెకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని, చీటికీ మాటికీ అనవసర సమ్మెల వల్ల సంస్థ నష్టపోతోందని ప్రభుత్వం భావించింది. ఈ లోగానే, తమను ప్రభుత్వం అసలు విధులకు రానిస్తుందో లేదోనని కార్మికులు ఆందోళనచెందారు. కార్మికులను విధుల్లోకి తీసుకున్నప్పటికీ ప్రభుత్వం షరతులు విధిస్తుందని, ఆ షరతులు ఎలా ఉంటాయోనని కార్మికులు కలవరపడ్డారు.
కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మనసున్నమనిషిగా ఆలోచించి బేషరతుగా విధులకు హాజరు కావచ్చునని ప్రకటించడం ఆర్టీసీ కార్మికులకు ఎంతో ఊరటనిచ్చింది. వారంతా సంతోషంతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీకి తక్షణ సాయంగా 100 కోట్ల రూపాయలు ప్రకటించడం, ఆర్టీసీ చార్జీలు కిలోమీటరుకు 20 పైసల వంతున పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడం సంస్థకు మరింత వెసులుబాటును కల్పించింది. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని, ఆ కుటుంబాలకు తక్షణసాయం అందించడంతోపాటు, ఆ కుటుంబాలలో ఒక్కరిచొప్పున ఉద్యోగావకాశం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆయన మానవతా హృదయానికి నిదర్శనం. ఆర్టీసీ పరిరక్షణ సంకల్పానికి నిదర్శనం.