ఆర్టీసీకి-సీఎం-వరాలు1మనదేశంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అతి పెద్ద రవాణా వ్యవస్థ. యాభైవేలకుపైగా కార్మికులు, పదివేల మూడువందల బస్సులను కలిగివున్నది టీఎస్‌ఆర్టీసీ. అయినా కూడా ఆర్టీసి నష్టాలను ఎదుర్కోవలసి వస్తున్నది. ఇందుకు కారణాలు ఎన్నివున్నా రోడ్లపై ఎదురయ్యే ట్రాఫిక్‌జాం సమస్య ఓ ప్రధాన కారణం. ఇలాంటి రద్దీ సమస్యను ఎదుర్కొన్న థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నగరాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చాలమంది మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థే పరిష్కారమని సూచించారు.
ఈ దిశగా హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేపట్టిన చర్యలలో భాగంగా 80 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను నవంబరు 29న పీపుల్స్‌ ప్లాజా దగ్గర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి టీఎస్‌ ఆర్టీసీపై వరాలజల్లు కురిపించారు.
తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు అద్వితీయమైన పాత్రను పోషించారన్నారు కేసీఆర్‌. సకలజనుల సమ్మె సందర్భంలో ఎందరెందరో వీళ్ళను భయపెట్టినా వెనుకకు తగ్గకుండా, దృఢ నిశ్చయంతో ముందుకు సాగారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా ఆర్టీసీ కార్మికులకూ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అందిస్తామని ప్రకటించారు. దీనివల్ల పడే అదనపుభారం 18.20 కోట్ల రూపాయలను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు.
సకలజనుల సర్వే జరిపిన రోజు అన్నివర్గాలవారు సెలవు తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు పనిచేశారు కాబట్టి ఆ రోజును సెలవు రోజుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి. నష్టాలపాలవుతున్నప్పటికీ ఆర్టీసీని కొనసాగించడం ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది అన్నారు. అయితే ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తే నష్టాలనుండి బయటపడటం గగనమేమీ కాదని అన్నారు. గతంలో తాను రవాణా శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు ఆర్టీసీ సంస్థ 11వేల కోట్ల నష్టాలలో మాత్రమే వుంటే, అప్పుడు సమష్టిగా పనిచేసి 12.50 కోట్ల లాభాలను అందుకునేటట్లు చేయడం జరిగిందని గుర్తు కేసీఆర్‌ చేశారు. ఇపుడు కూడా అలాగే చేసి సంస్థను అభివృద్ధిలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని డిపోల్లో మహిళా కండక్టర్లు, ఉద్యోగులకు భోజన, విశ్రాంతి గదులను నిర్మింపజేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రైవేటుకు ధీటుగా టీఎస్‌ ఆర్టీసీని రూపొందించడం ఓ పరిణామం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంకింద 530 బస్సులు మంజూరయ్యాయన్నారు. ఇందులో 80 ప్రస్తుతం ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటిని కూడా తొందర్లో తెప్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. బంగారు తెలంగాణను రూపొందించడంలో ఈ బండారువంతు కూడా తప్పక ఉంటుందని ఉద్ఘాటించారు. త్వరలోనే హైదరాబాద్‌`కల్వకుర్తి`శ్రీశైలం రూట్లో నాలుగులేన్ల రోడ్డు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో మన ఆర్టీసీ 94 డిపోలతో మూడోస్థానంలో ఉందని, దీన్ని ప్రథమ స్థానంలోకి తీసుకువస్తానన్నారు. హైదరాబాద్‌ నుండి ప్రతి జిల్లాకు ఏసీ బస్సులు నడిపేలా చర్యలు చేపడతామని అన్నారు. ఆర్టీసీ ఎండి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీపై పూర్తి అవగాహన వుందని, రాబోయే రోజుల్లో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడుపుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Other Updates