సీఎం కేసీఆర్
మన టీఎస్ ఆర్టీసీ దేశంలోనే మేటిగా నిలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను ప్రగతిభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ లాభలబాటలో పయనించాలన్నారు. అందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహాకారాలు అందిస్తుందన్నారు. ఇప్పటికే రూ. 750 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆర్టీసీకి చేయూతనందించిందన్నారు. తెలంగాణ ఆన్ ఆర్టీసీ వీల్స్ అనే గొప్పదనం టీఎస్ ఆర్టీసీకే దక్కుతుందన్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల కాలంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారనే భయం వెంటాడేదని, ఇప్పుడు అది లేకుండా పోయిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆదుకుని ఆ దుస్థితి నుంచి బయటపడేసిందన్నారు. రాష్ట్రంలో మూడో వంతు ప్రజలు ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ఏ విధంగా ఇతర రాష్ట్రాలు, దేశాలు స్పూర్తిగా తీసుకుంటున్నాయో అదే విధంగా ఆర్టీసీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. వజ్ర మినీ బస్సులు దేశంలోనే ఒక విప్లవాత్మక పద్ధతిలో కొత్త మోడల్‌గా పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు.
గతంలో తాను రవాణామంత్రిగా పనిచేసినపుడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రూ. 14కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చానన్నారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ ఛైైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎండీ రమణారా వులు రాత్రింబవళ్ళు కష్టపడి కొంత నష్టాన్ని తగ్గించగలిగారన్నారు. ఇంకా ఎన్నో మార్పులు తీసుకురావాలి, వజ్ర బస్సులను దేశంలోనే ఒక విప్లవాత్మకమైన పద్దతిలో అందుబాటులోకి రావాలి, ప్రయాణీకుల ముంగిటకు ఇవి చేరుకో వాలని అన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పయనింపచేయడానికి ప్రభుత్వం వైపున పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ నుంచి కూడా ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మీటింగ్‌కు వచ్చే ముందే జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని ఆర్టీసీ బకాయిలు ప్రతినెలా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయనను ఆదేశించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టీసీ తీరుతెన్నులు మనం చూస్తున్నపుడు పట్టణ రవాణా ఎప్పుడూ నష్టాల్లోనే కూరుకుని ఉంటుందన్నారు. నగరంలో ఎన్ని స్వంత వాహనాలు ఉన్నా ఆర్టీసీలో ప్రయాణించేవారు కూడా ఎక్కువగానే ఉంటారని, అందువల్ల ప్రజలు మనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకాకుండా కాపాడుకోవడం మన కర్తవ్యమని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరించిందన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ 55వేల మంది కార్మికులకు మంచి ఫిట్‌మెంట్, మంచి వేతనం ఇవ్వడం జరిగిందన్నారు. యూనియన్ నాయకులు, అధికారులు కోరిన ప్రకారం నాలుగు వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగిందన్నారు. ఇలా ఎన్నో విధాలుగా ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సిబ్బంది కూడా ఆ విధంగానే శ్రమపడాల్సి ఉంటుందన్నారు. అప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తూ ప్రజలకు
ఉపయోగకారిగా తయారవుతుందని అన్నారు. ఆ దిశగా ఆర్టీసీ అధికారులు, కార్మికులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, టిఎస్‌ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.