ముఖ్యమంత్రి ప్రకటనతో కదిలిన ప్రగతి రథ చక్రాలు


రాష్ట్రంలో దాదాపు 55 రోజులపాటు జరిగిన ఆర్టీసీ సమ్మె చివరకు సుఖాంతమయింది. కార్మికులంతా బేషరతుగా విధుల్లో చేరవలసిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించడంతో ఆర్టీసిబస్సులు పూర్తిస్థాయిలో మళ్లీ రోడెక్కాయి.

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ఆర్టీసీ కార్మికులపై తమకు ఏవిధమైన కక్షసాధింపూ లేదనీ, వారుకూడా తమ బిడ్డలేనని ప్రకటించిన ముఖ్యమంత్రి, కార్మికులను బేషరతుగా విధుల్లోచేరవలసిందిగా పిలుపునిచ్చారు.

బాధ్యతగల ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని మా బిడ్డలుగా భావించి, మిమ్మల్ని రోడ్డున పడేయవద్దని చెప్తున్న. జాయిన్‌ కండి. ఎటువంటి కండీషన్లు పెట్టం. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


కార్మికులు అందరూ ఉద్యోగాల్లో చేరండి..ఎండీకి అనుమతిస్తూ ఐదు నిముషాలలో ఆదేశాలిస్తాం. మీ సంస్థ బతకాలని కోరుతున్నాం. మీరంతా మా బిడ్డలని చెప్పాం. సంస్థలో 13 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. జీతాలు చెల్లించేందుకు, ఇతర అవసరాలకోసం తక్షణ సాయంగా 100 కోట్ల రూపాయలు ఇస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే ఆర్టీసీ చార్జీలు పెంచింది. ఈసారి కొంత చార్జీలు పెంచుతాం. అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్టీసీ సంస్థ బతకాలన్నదే తమ ఆశయమని, సంస్థ బాగుంటేనే కార్మికులూ బాగుంటారని చెప్తూ, ప్రభుత్వం ఎంతో ఉదారంతో తీసుకున్న ఆ నిర్ణయాన్ని అలుసుగా తీసుకుంటే మీరే మునుగుతారంటూ కార్మికులను సి.ఎం సున్నితంగా హెచ్చరించారు.

ఆర్టీసీలో 49 వేల మంది కార్మికులున్నారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, బస్సులు, తదితర అంశాలపై వివరంగా తెలుగులో ఒక డాక్యుమెంటును రూపొందించి కార్మికులందరికీ అందచేస్తాం. ఆ డాక్యుమెంటు చదవండి. ఆతర్వాత ప్రతి డిపో నుంచి కొంతమంది కార్మికులను పిలిచి తానే స్వయంగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పారు. కార్మికులు ఉద్యోగ భద్రత కోరుకుంటే తప్పులేదని, కానీ క్రమశిక్షణా రాహిత్యంతో వ్యవహరిస్తే ఎవరూ కాపాడలేరని ముఖ్యమంత్రి అన్నారు.

మా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల పొట్టలు నింపినంగానీ ఎవరి పొట్టా కోట్టలేదు. ఆ ఉద్దేశ్యం కూడా మాకు లేదు. దేశంలోనే అత్యధిక జీతాలు అందుకుంటున్న అంగన్‌ వాడీలు, హోమ్‌ గార్డులూ మన రాష్ట్రంలోనే ఉన్నారు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయని సి.ఎం చెప్పారు.

కార్మికులు ప్రభుత్వంతో సహకరించి, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తే సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని, సింగరేణి కాలరీస్‌ ఉద్యోగులవలే బోనస్‌ పొందే అవకాశం కూడా లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.


మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

ఆర్టీసీ సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామనీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరణించిన కార్మికుల కుటుంబాలలోని ఒక వ్యక్తికి వారి అర్హతను బట్టి ఆర్టీసీలోకానీ, ప్రభుత్వంలోకానీ ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. అంతేగాక ఆయా కుటుంబాలకు తక్షణ సాయం కూడా అందిస్తామన్నారు.

బస్సుచార్జీలు పెంపు

నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించడానికి రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. కిలోమీటరుకు 20 పైసల వంతున పెంచుతున్నామని, దీనివల్ల ఆర్టీసీకి ఏటా 752 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

Other Updates