ఆర్ట్‌-ఏ-తెలంగాణపీడనకు గురైన నేలలో ఆలస్యంగానైనాసరే, ఉద్యమాలు ఆవిర్భ వించి తీరుతాయి. ఉద్యమాలు చైతన్యానికి ప్రతీకలు. ఈ మట్టిలో పుట్టిన వారిలోని చైతన్యం వారివారి వృత్తికి, ప్రవృత్తికి సంబంధించిన రంగంలోను తప్పనిసరిగా ప్రతిఫలిస్తుంది.

ఈ క్రమంలో తెలంగాణలో పుట్టిన కవులు, రచయితలు, శిల్పు లు, చిత్రకారులు`ఏ కళారంగానికి చెందినవారైనా, ఆయా ఉద్యమా లతో తాదాప్యం చెందడంవల్ల వారి సృజనలో నిజాయితీ, జీవత్వం, కళాత్మకత, చైతన్య శీలం తొణికిసలాడుతుంది. ఈ కోవలో తెలంగాణ చిత్రకారులు, శిల్పుల అసాధారణమైన వ్యుత్పత్తిని, ప్రతిభను చెప్పుకోవాలి.

యూరప్‌లోని కొసొవొలాంటి చిన్న ప్రదేశంలో యుద్ధానంతరం వెయ్యిమంది సృజనాత్మక చిత్రకారులు, శిల్పులు పుట్టుకొచ్చారు. వారి కళాఖండాలను కొసొవొ ఆర్ట్‌ గ్యాలరీ పుస్తకంగా ప్రచురించింది. నిజానికి ఆ గ్రంథం ఒక కళాఖండంగా రూపొందింది. అక్కడికి వచ్చే కళా హృదయులైన పర్యాటకులకు అదొక కన్నులపండగÑ మెదడుకు మేత, దాని ప్రేరణతో అంతర్జాతీయస్థాయి గుర్తింపును, గౌరవాన్ని పొందిన తెలంగాణ చిత్రకారులు, శిల్పులపై అలాంటి గ్రంథం వెలువరించాలనే ఆలోచనవచ్చి`‘‘ఆర్ట్‌ ఏ తెలంగాణ’’ ట్రస్టు ఏర్పాటు చేసి ఈ ‘‘ఆర్ట్‌ ఏతెలంగాణ’’ గ్రంథానికి శ్రీకారం చుట్టారు.

‘కాఫీ టేబుల్‌ బుక్‌’గా నూరేండ్ల తెలంగాణ చిత్ర శిల్పకళపై నూటాయాభైమంది కళాకారులతో 376 పేజీల ఈ బృహత్‌ సచిత్రగ్రంథాన్ని ప్రచురించారు. ఇందులో 121మందిని చిత్రకారులు శీర్షికన పరిచయం చేశారు. 29మందిని విస్తృత కళాకారుల శీర్షికన కేవలం వారి చిత్రాలు, శిల్పాలతో సరిపెట్టారు. ఈ తరహాగ్రంథం ఎక్కువ వ్యాసాలతో, వ్యాఖ్యలతో కాకుండా చూడచక్కని బొమ్మలతో అలంకరిం చడం రివాజు. అయితే ఈగ్రంథం ప్రచురణ ఉద్దేశ్యాన్ని వివరించే ప్రధాన వ్యాసం ఆ రంగంలో నిపుణుడితో వ్రాయించడం పరిపాటి. ప్రస్తుత గ్రంథం తెలంగాణ చిత్ర, శిల్పకళ, కళాకారులగురించి కాబట్టి ఆ రంగం గురించి రాష్ట్రేతరులెవరు చూసినా అవగహన కలిగించే ఆ కీలకవ్యాసం ప్రధానమైంది. ఇది ప్రముఖ దర్శకులు, చిత్రకారుడు బి. నరసింగరావు వ్రాశారు. అయితే తెలంగాణ నేలలో చిత్రకళ నేపథ్యాన్ని ఈ వ్యాసం వివరించింది. కాని వందేండ్ల తెలంగాణ చిత్రకళలో ఎవరు వైతాళికులు ఎవరెవరు ఏఏ ధోరణి చిత్రాలు వేశారో, శిల్పాలు చెక్కారో చెప్పలేదే.

అట్లాగే ఈ గ్రంథంలో ఇక్కడి చిత్ర, శిల్ప కళారంగంలో వైతాళికులైనవారి గురించి తొలుత తెలుపుతూ ఒక శీర్షిక పెడితే పాఠకుడికి స్పష్టత ఉండేది. 1914 నుంంచి 2014 దాకా తెలంగాణ చిత్రలేఖనరంగంపై వేస్తున్న ఈ గ్రంథం 1914లో యూరప్‌ చిత్రకళారంగాన్ని అధ్యయనం చేసివచ్చి, ఇక్కడి చిత్రకళారంగంలో అగణితకృషి చేసినవాడు, మూడో సాలార్‌జంగ్‌కు తొలి క్యూరేటరైన రామకృష్ణ వామన్‌ దేవస్కర్‌ నుంచి ప్రారంభించి ఈనాటి 2014 వర్ధమానచిత్రకారుల ధోరణులకు అద్దం పడుతుందని నరసింగరావు తన పరిచయవ్యాసంలో పేర్కొన్నారు.

రామకృష్ణవామన్‌ దేవ్‌స్కర్‌, సుకుమార్‌ దేవ్‌స్కర్‌, పి.టి.రెడ్డి, కె. రాజయ్య, కొండపల్లి శేషగిరిరావులాంటి పాతతరం వైతాళికులను, కె.లక్ష్మాగౌడ్‌, టి. వైకుంఠం, సూర్యప్రకాశ్‌, జగదీష్‌లాంటి కొత్తతరం వైతాళికులను తొలి పేజీలలోనే ఒక శీర్షిక క్రింద అలంకరించిఉంటే చాలా బాగుండేది. ముందుగా వైతాళికులను పరి చయంచేసిన తర్వాత వర్ధమాన చిత్రకా రులను, కొత్తగా బొమ్మలు వేస్తున్నవారిని పరిచయం చేస్తే అర్థవంతంగా ఉండేది.
ఇంకా ఈ గ్రంథంలో ఒకప్పుడు పుంఖానుపుంఖంగా చిత్రాలువేసిన మరిపడగ బలరామాచార్యబొమ్మలు, అలనాడే చిత్రకళలో డిప్లొమా పూర్తిచేసి వసందైన చిత్రాలు గీసిన సంఘం లక్ష్మీబాయి చిత్రాలు లేకపోవడానికి వారి చిత్రాలు, వారి వివరాలు లభించకపోవడం కారణం కావచ్చు. అయితే వర్ధమాన చిత్రకా రులైన లిడియా విక్టర్‌, ఆషారాధిక, భరత్‌భూషణ్‌ లాంటి చాలామంది పరిచయాలు, చిత్రాలు ఎందుచేతనోమరి ఇందులో చోటు చేసుకోలేదు.

విస్మృత చిత్రకారులు శీర్షికన 29 మంది చిత్రాలు, శిల్పాలు చివరన వేశారు. 1950, 60, 70 సంవ త్సరాలకు చెందిన జి. బాలు, డి.జి. డోంగ్రే, జి. రాజేశం, కె. బాలరత్నం, షాఅలీ లాంటి పలు వురు కళాకారుల జీవిత, కళాసం బంధమైన వివరాలు లభిస్తాయి. కానీ మరెందుకు వాటిని సేకరించలేకపోయారో అర్థంకాదు. చంద్ర లాంటి ప్రముఖ చిత్రకారుడి చిరునామా దొరకలేదని ఈ గ్రంథంలో పేర్కొనడం విచిత్రం.ఇలాంటి కొన్ని అంశాలను మినహాయిస్తే, తెలంగాణ చిత్రశిల్పకళా దృక్కోణంలో ఇంతటి బృహత్‌గ్రంథం ప్రచు రించడం ముందెన్నడూ జరుగలేదు. అందుచేత ఈ ప్రయత్నం ఆహ్వానించదగింది. అభినందించ దగింది. చిత్రకళాభిమా నులందరూ తప్పకుండా చూడదగిన, సేకరించదగిన అపురూపగ్రంథమిది.

– టి.ఉడయవర్లు

Other Updates