తెలంగాణ రాష్ట్రాన్ని ఎ- కేటగిరి ఆర్ధిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఇక్రా) గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇదే సంస్థ గతంలో ఎ – మైనస్ కేటగిరిలో చేర్చగా, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రేటింగ్ మైనస్ నుంచి ప్లస్ లోకి రావడం గమనార్హం.
మన రాష్ట్రానికి ‘ఇక్రా’ ఎ కేటగిరి క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం వల్ల దేశ, విదేశాలలో తెలంగాణ రాష్ట్ర పరపతి పెరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందే సందర్భంలో, రుణాలను తిరిగి చెల్లించగల స్తోమత విషయంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ ఏజెన్సీ లెక్కగడుతుంది.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మెరుగ్గా వున్నదని ‘ఇక్రా’ తన నివేదికలో వెల్లడించింది. తన అధ్యయనంలో ఆరు సానుకూల అంశాలను కూడా ‘ఇక్రా’ పేర్కొంది.
- పన్నుల ద్వారా సమకూరే ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో మెరుగ్గా వుంది.
- దేశ తలసరి ఆదాయం 74,380 రూపాయలు కాగా, తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం 95,361 రూపాయలుగా వుంది.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన టి.ఎస్.ఐపాస్ తో పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించి, రాష్ట్రాన్ని అభివద్ధి దిశగా తీసుకుపోతోంది.
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పెట్టుబడి వ్యయంలో రుణం వాటా చాలా తక్కువగా వుంది.
- వివిధ కార్యక్రమాలకోసం పెడుతున్న పెట్టుబడులు సార్థకంగా వున్నాయి. ఆస్తుల స ష్టికి అవి దోహదం చేస్తాయి.
- నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఖర్చుచేయడం వల్ల ముఖ్యమైన వ్యవసాయ రంగ పరిస్థితి మెరుగు అవుతున్నది.
పై ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఇక్రా’ తెలంగాణ రాష్ట్రాన్ని ఎ- క్యాటగిరి రాష్ట్రంగా ప్రకటించింది. ఈ రేటింగ్ వల్ల రాష్ట్రానికి దేశ, విదేశాలలో పరపతి పెరుగుతుంది. ఫలితంగా రుణాల లభ్యత సులభతర మవుతుంది. రేటింగ్ తక్కువగా వుంటే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా వుంటుంది. మెరుగైన రేటింగ్ వుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటు కూడా తక్కువగా వుంటుంది.
పారిశ్రామిక వేత్తలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ‘ఇక్రా’ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్రా ప్రకటించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఎ-క్యాటగిరీలో ఉన్నందున రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు మరింతగా పెరిగాయి.