ముఖ్యమంత్రి-కె.-చంద్రశేఖరరావు-4హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న భారతీయ ఆరోగ్య ఫౌండేషన్‌ దక్షిణాది ప్రాంతీయ ప్రాంగణానికి జనవరి మూడో తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భూమి పూజ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 60 కోట్ల పెట్టుబడితో భారతీయ ఆరోగ్య ఫౌండేషన్‌ వారు ప్రారంభించబోయే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపిహెచ్‌)కి భూమి పూజ చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. ఆలోచనాత్మక విషయాలెన్నింటినో వివరించారు.
మన సమాజంలో 98శాతం మంచి మనుషులే వున్నారని పేర్కొన్నారు. మన సమాజాన్ని పోలీసులో, ప్రభుత్వమో రక్షించడం లేదని చెబుతూ, ఒక సంఘంగా, సమాజంగా హైదరాబాద్‌ తనకు తాను నెగ్గుకొస్తున్నదని అన్నారు. మనమంతా సరికొత్తగా ఆలోచించి కొత్త తొవ్వతొక్కాలని అన్నారు కె.సి.ఆర్‌. మనందరం మనకు చాలా విషయాలు తెలుసునని అనుకుంటాం. అయితే మనకు ఎంత తెలిసినా అంతకంటే ఎక్కువగా తెలుసుకోవాలని అన్నారు.

ఇప్పటిదాకా ఆరోగ్యసేవలు అందించడానికి వేలాది కోట్లను ఖర్చు చేశాం, చేస్తున్నాం. అయినాకూడా సంతృప్తికరమైన ఆరోగ్య సేవలను పొందలేకపోతున్నాం. ఈ విషయమై మనమందరం మళ్ళీమళ్ళీ ఆలోచించుకోవాలని అన్నారు. ఈ విషయంలో మేధావులు సమాజాన్ని మేల్కొలిపే విధంగా తమ ఆలోచనలకు పదును పెట్టాలని చెప్పారు. సమకాలీన సమాజ చరిత్రను ఎప్పుడు చూసినా, ఆ కాలానికి అందుబాటులోవున్న మేధావులు అప్పటి సమాజానికి కరదీపికగా నిలిచారని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేర్కొన్నారు .

హైదరాబాద్‌లో పిహెచ్‌ఎఫ్‌ఐ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో ఈ సంస్థ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సంస్థ విషయంలో, సంస్థకు యూనివర్సిటీ హోదా కల్పించాలని, క్యాంపస్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నిధులు ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని కొన్ని విజ్ఞప్తులు అందాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చిన విజ్ఞప్తులపై స్పందిస్తూ… ఈ విషయంలో వీలైనంత తొందర్లోనే పిహెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె. శ్రీనాథ్‌రెడ్డి, మరికొందరు మేధావులతో సమావేశమై చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటాం అని ప్రకటించారు కెసీఆర్‌.

ఆర్థిక, పరిపాలనాపరంగా వందశాతం సాయం అందిస్తామని, ఏదేమయినా ముందుగా 10 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సర్కారు దవాఖాన అంటేనే భయమేసేటట్లుగా సినిమా పాటలు వచ్చాయంటే పాలనాపరంగా ఎక్కడో ఏదో లోపం జరుగుతున్నదని దాన్ని సరిదిద్దుకోవాలనే సందేశం ఆ సినిమా పాటలో వుందని అన్నారు. అవసరమయిన సంస్కరణలు చేపట్టే దిశగా పిహెచ్‌ఎఫ్‌ఐ తొలి అడుగువేసిందని అన్నారు కేె.సీఆర్‌.
సమాజంలో మార్పు వచ్చే విధంగా మంచి మార్గంలో ప్రయాణం చేస్తుంటే, సంప్రదాయ పద్ధతులల్లోనే ఆలోచించేవారందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మార్పును అంగీకరించరు అని అన్నారు. ఎప్పుడో చాలా రోజుల కింద ‘ఆల్విన్‌ టాపర్‌’ రాసిన పుస్తకాన్ని చదివానని చెప్తూ మార్పుతోపాటు పయనిస్తాం, సాధారణంగా మనం అందులోకి పోతాం దాని ఒళ్ళో కూర్చున్నా… అప్పటికీ వ్యతిరేకిస్తాం.. మానవనైజం అటువంటిది అని పేర్కొన్నారు.
మన ప్రభుత్వ వైద్యులున్నారు, వాళ్ళకి పిహెచ్‌ఎఫ్‌ఐ సంస్థ గురించి చెప్తే, ఈ సంస్థ వచ్చి మాకు కొత్తగా నేర్పించాలా? మాకు తెల్వదా? మేం సన్నాసులమా అంటరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అంతే… నోట్స్‌ రాసుకోమంటే మేమేమైనా చిన్నపిల్లలమా? అంటరు. అక్కడినుంచి మొదలవుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో సినాప్సిస్‌ చూడకుండా మాట్లాడరు. మనదేశంలో కాగితాలు చూసి మాట్లాడితే వీడు సన్నాసి… వీడికిరాదు అని అంటారు. నిజానికి ప్రసంగాన్ని రాసుకుని చదవటం గొప్పతనం. మన బేసిక్‌ థింకింగ్‌లో కొంత మార్పు రావాలి. ఎక్కడో ఒకచోట మార్పు ప్రారంభం కావాలి. వస్తది… తప్పకుండా వస్తది. ఏదీ శాశ్వతం కాదు, ఇది కాల చక్రం లాంటిదని ఈ విషయంలో తాను ఆశావాదినని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కెసీఆర్‌.
బంగారు తెలంగాణకోసం మావంతు
ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఢల్లీిలో వైద్యుడిగా సేవలందించిన శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… అనంతమైన రాజకీయ చైతన్యంతో ఉద్యమంచేసి, రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కెసీఆర్‌ వైద్యవ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తారనే నమ్మకమున్నదని అన్నారు. 2016 జూన్‌ 2 నాటికి కెసిఆర్‌ భూమి పూజచేసిన ఈ భవనం మొదటి ఫేజ్‌ పూర్తిచేసి నా తెలంగాణ తల్లికి పూజా పుష్పంగా సమర్పిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మంచి ఆదాయంతో బాగుంటుందని అన్నారు. ఈ సంస్థ తెలంగాణ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడంలో ఎంతో ఉపయోగకరంగా వుంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత కేశవరావు, మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఐఐపీహెచ్‌ అధికారులు ప్రొఫెసర్‌ పల్లె రామారావు, జీవీఎస్‌మూర్తి పాల్గొన్నారు.

Other Updates