తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిపై చర్చించడానికి, గైడ్‌లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్‌లో మంత్రులతో పరిశ్రమ శాఖా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి, దానివల్ల మనకు ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి కృషి వల్ల తెలంగాణలో జల విప్లవం వస్తున్నది, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదులు నీటితో సస్యశ్యామలం అవుతున్నాయి అని అన్నారు. ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంసం ఉత్పత్తి పరిశ్రమ) శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయి. రాష్ట్రంలో గొర్రెల పంపకం, చేపపిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది.
ముఖ్యమంత్రి సూచన మేరకు తెలంగాణలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏం పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదు, దీనితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయి. అందువల్ల వెంటనే మనం ఈ ఆహార శుద్ధి రంగ పరిశ్రమను ప్రోత్సహించాలి. తద్వారా మన తెలంగాణ రైతుకు ఆర్థిక స్వావలంబన, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ సమావేశంలో మంత్రు హరీశ్ రావు, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శు పాల్గొన్నారు.