tsmagazine
హైదరాబాద్‌, హైటెక్‌ సిటీ వాసులకు సరికొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడ రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో ఇప్పటికే ఉన్న బొటానికల్‌ గార్డెన్‌ ను ప్రకృతి సహజత్వం మధ్య, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు అందేలా తీర్చిదిద్దారు. నిత్యం రద్దీగా ఉండే హైటెక్‌ సిటీ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ సేద తీరేలా బొటానికల్‌ గార్డెన్‌ ఆధునీక రించబడింది. 274 ఎకరాల అటవీ భూమిలో 12 ఎకరాలను సందర్శకుల పార్కుగా ఆధునీకరించారు.

tsmagazine
ఈ బొటానికల్‌ గార్డెన్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పచ్చదనాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే పరిష్కారం అని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల భాగస్వామ్యం ఉన్న ప్పుడే కాలుష్య నివారణ జరుగుతుందని అన్నారు. బ్యాటరీ కారులో బొటానికల్‌ గార్డెన్‌ను సందర్శించారు. అత్యాధునికంగా ఏర్పాటు చేసిన జిమ్‌, విద్యార్థుల్లో పర్యావరణంపై సామాజిక స్పృహను పెంపొందించే దృశ్య శ్రవణ వికాస కేంద్రాన్ని పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొన్ని సర్వేల ప్రకారం గడిచిన 5 వేల సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి, పట్టణీకరణ జరిగిందో, రాబోయే 50 సంవత్స రాల్లో అంతే స్థాయి పట్టణీకరణ జరుగనున్నదని పేర్కొంటున్నాయన్నారు. పట్టణీకరణ శరవేగంగా జరుగుతూ నగరాలు కాంక్రీట్‌ వనాలుగా మారుతున్నా యన్నారు. పట్టణీకరణతో ముందు గా దెబ్బతినేది పచ్చదనమని, పచ్చదనాన్ని పెంచుతూ, అటవీ సంరక్షణ చేపడుతూ, భావి తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మెర్సిన్‌ అనే ప్రముఖ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నివాస యోగ్య పట్టణాల జాబితాలో దేశంలోనే హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో గత నాలుగు సంవత్సరాలుగా నిలుస్తూవస్తున్నదన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ చుట్టూ మున్సిపల్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా 100 పైచిలుకు అర్బన్‌ ఫారెస్టు బ్లాకులను పచ్చదనం తో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాయన్నారు. వాటిలో ఇప్పటికే దాదాపు 10 పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలైన కండ్లకోయ, శంషాబాద్‌, నారపల్లి లాంటి పరిసరాల్లో లక్షా యాభై వేల ఎకరాల అటవీ భూములు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు పెంచడం ఒకటే కాదని, అనేక ఇతర రకాల కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
tsmagazine

నగరంలోని 185కు పైగా చెరువులు, కుంటలను శుద్ధి చేసే పనులు సాగుతున్నాయ న్నారు. మొదటి దశలో ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 20 చెరువులు, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మరో 20 చెరువులను శుద్ధిచేసి, సుందరీకరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్‌ మిషన్‌ కాకతీయతో చెరువుల పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల శుద్ధి కొనసాగుతుందన్నారు. దుర్గం చెరువుతో త్వరలో ఈ కార్యక్రమం నగరంలో ప్రారంభమవుతుందన్నారు. నగరంలో 2000 ఎంఎల్‌డీల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నా యని, వాటిలో 700 ఎంఎల్‌డీలు ఎస్టీపీ ప్లాంట్‌ల ద్వారా శుద్ధి చేస్తున్నారని తెలిపారు. మిగతావి శుద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చారని త్వరలో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. 4 లక్షల పైగావున్న నగరంలోని వీధి దీపాలు మార్చి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు జీహెచ్‌ఎంసీకి ఆదా అవుతున్నాయని వివరించారు. జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని ప్రాంతాల్లో ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయడంతో 55 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తున్నారని అన్నారు. బొటానికల్‌ గార్డెన్‌ను అహ్లాదకరంగా అందంగా తీర్చిదిద్దిన తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ అధికారులను అభినందించారు.
tsmagazine

ఈ బొటానికల్‌ గార్డెన్‌లో 30 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో 1700 ఎకరాల్లో ఉన్న ఎప్లూవెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు, అందులోంచి వచ్చే ద్రవ, ఘన వ్యర్థాల శుద్ధి కోసం 104 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉండే 1122 పరిశ్రమలను కాలుష్య కారక పరిశ్రమలుగా గుర్తించి, దశల వారీగా రింగ్‌ రోడ్డు బయటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొక్కలు పెంచడాన్ని ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.మొక్కలు పెంచడం కేవలం ప్రభుత్వ కార్యక్రమమన్నట్లు ప్రజల్లో, ప్రధానంగా సోషల్‌ మీడియాలో కొంతమంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.. నాలుగో విడత హరితహారంలో 25 వేల మొక్కలు నాటే చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ సూచించారు. బొటానికల్‌ గార్డెన్‌లో ఎస్టీపీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, వెంటనే మంజూరు చేస్తానని అన్నారు.

కాలుష్య పరిశ్రమల తరలింపు
తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రకాశ్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌, టీఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ చందన్‌మిశ్రా, రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌ రాగం సుజాతాయాదవ్‌, వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ హరిచందన, కార్పొరేటర్లు జగదీశ్వర్‌ గౌడ్‌, పూజిత, హమీద్‌పటేల్‌ పాల్గొన్నారు.
tsmagazine

నగర వాసులకు స్వచ్చమైన గాలిని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బొటానికల్‌ పార్క్‌, వాకింగ్‌ , జాగింగ్‌, సైక్లింగ్‌, యోగా, జిమ్‌ లాంటి సౌకర్యాలకు తోడు, వారాంతాల్లో కుటుంబ సమేతంగా సేద తీరేలా అటవీ అభివృద్ధి సంస్థ తీర్చి దిద్దింది. బొటానికల్‌ గార్డెన్‌కు వచ్చే పిల్లలకు ప్రకృతి, అడవులు, వన్యప్రాణులపై అవగాహన కలిగేలా, పర్యావరణం ప్రాముఖ్యత తెలిసేలా పరిసరాలను తీర్చిదిద్దారు.

హైటెక్‌ సిటీతో పాటు చుట్టు పక్కల ప్రాంతా ల్లో ప్రజలకు సేదతీరే ప్రదేశంలా ఉండాలని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు, సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ సందర్శకుల కోసం అదనపు వసతుల కల్పన పనులు చేపట్టింది. సందర్శకుల కోసం పెద్దలకు 25 రూపాయలను, పిల్లలకు పది రూపాయలు పార్క్‌ ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు.
tsmagazine

Other Updates