maga1. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. రాజధాని హైదరాబాద్‌ తో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చే పార్కులను ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతోంది.

2. పట్టణాలకు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని అర్బన్‌లంగ్‌ స్పేస్‌లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గతంలోనే ఆదేశాలిచ్చారు. దీనికి అనుగుణంగానే హైదరాబాద్‌ కు అన్ని వైపులా ఈ పార్కుల అభివృద్ధికి అటవీ శాఖ కృషి చేస్తోంది. రాజధాని పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల, వెలుపల మొత్తం పధ్నాలుగు ప్రాంతాలను అర్బన్‌ పార్కులుగా మార్చేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

3. గుర్రంగూడ, కండ్లకోయ, మేడ్చల్‌, దూలపల్లి, గాజుల రామారం మొదలైన ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాక్‌ ల్లో పార్కుల అభివృద్ధి జరుగుతోంది. ఈ పధ్నాలుగు ప్రాంతాల్లో మొత్తం 3345 హెక్టార్ల అటవీ భూమిలో ఒక్కో చోట కొంత భాగాన్ని పార్కుల అభివృద్దికి గుర్తించారు. నిత్యం ట్రాఫిక్‌, కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన బిజీ లైఫ్‌ లో ఉదయమో, సాయంత్రం పూటో వాకింగ్‌ కు వెళ్లినా, కుటుంబం లేదా స్నేహితులతో సరదాకా కాసేపు గడపాలన్నా, పెద్దలకు వాకింగ్‌ ట్రాక్‌, యోగా ప్లేస్‌ లతో పాటు, పిల్లలకు మంచి రిక్రియేషన్‌ ఇచ్చే ప్లే గ్రౌండ్‌ ను వీటిల్లో డెవలప్‌ చేస్తున్నారు. ఇక కుటుంబాలు కలిసి పిక్నిక్‌ కు వెళ్లినా, అన్ని సౌకర్యాలు ఉండేలా ఈ పార్క్‌ లను అభివృద్ధి చేస్తోంది అటవీ శాఖ.

4. గుర్రంగూడ సంజీవని పార్క్‌, అజీజ్‌ నగర్‌ దగ్గర మృగవని నేషనల్‌ పార్క్‌, కండ్లకోయ నేచర్‌ పార్క్‌, శంషాబాద్‌ సమీపంలో డోమ్‌ నేర్‌ పార్క్‌, ఘట్‌ కేసర్‌ సమీపంలోని భాగ్యనగర్‌ సందనవనం పార్క్‌ లు ఇప్పటికే పూర్తయి పెద్ద సంఖ్యలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న కాలనీలకు, పట్టణ ప్రాంతానికి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ పార్కుల అభివృద్ధి పరచటంతో రోజూ సందర్శించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో వీటిల్లో కొన్ని పార్కుల్లో కాటేజీలను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో ఎకో టూరిజానికి అవకాశాలు పెరిగాయి. ప్రకృతి మధ్యలో అటవీ ప్రాంతాల్లో ఒకటి రెండు రోజులు గడపటంతో పాటు పచ్చటి వాతావరణంలో సేదతీరాలని భావించే వారికి ఇవి చక్కటి అవకాశంగా మారాయి.

5. ఒక్కో పార్క్‌ ను ఒక్కో థీమ్‌ తో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 అర్బన్‌ పార్క్‌ ల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్న అటవీ శాఖ. ఇప్పటికే 24 పార్క్‌ లు అభివృద్ధి చేసేం దుకు ఫారెస్ట్‌ బ్లాక్‌ లను గుర్తించటం, 25 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు కూడా జరిగింది. వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. 12 పార్క్‌లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అన్ని పట్టణ ప్రాంతాలు, ఆవాసాలకు వీలైనంత సమీపంలో ఈ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అటవీ శాఖ పనిచేస్తోంది.

6. హైదరాబాద్‌ నగరం చుట్టూ అభివృద్ధి చేసిన పార్కులు, వాటి ప్రత్యేకతలను మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు తన ట్విట్టర్‌ లో మూడు ట్వీట్‌ల ద్వారా వెల్లడించారు. మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అటవీశాఖ అద్భుతంగా పని చేస్తోందని కొనియాడారు. రోజూ వాకింగ్‌కి వెళ్లే వారికే కాదు వారాంతంలో కుటుంబాలతో సహా గడిపేందుకు ఈ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ పార్కులు చక్కని అవకాశముంటూ కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ మంత్రి జోగు రామన్న , మంత్రి కేటీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

7. కేటీఆర్‌ ట్వీట్స్‌ అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి మరింత స్ఫూర్తిని కలిగించా యని, మిగతా అర్బన్‌ పార్కులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్య మంత్రి కే. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం హరితహారం ద్వారా సాధించటమే లక్ష్యంగా అటవీ శాఖ పనిచేస్తుందని మంత్రి తెలిపారు.

Other Updates