ఈ మహాసభకు వి.బి. రాజు, ఎన్. రామచంద్రారెడ్డిలను హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపినారని, కొండా లక్ష్మణ్‌కు ఆహ్వానం పంపలేదని పత్రికల్లో వార్తలు వెలువడినాయి. ఈ వార్తలు విని కలత చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ డా|| చెన్నారెడ్డిపై అనేక విమర్శలు చేసినట్లు ఆంధ్రపత్రికలు ప్రచురించాయి. ఈ విషయాలపై డా|| చెన్నారెడ్డి వివరణ ఇస్తూ, ‘ఈనెల ఎనిమిదో తేదీన ఒక పత్రికా గోష్టిలో నేను చేసినట్లు చెప్పబడుతున్న ప్రకటనను చూచి ఆశ్చర్యం చెందాను. అట్టి ప్రకటనను నేను చేశానని చెప్పడం సక్రమంకాదు. మహాసభకు వి.బి. రాజు, ఎస్. రామచంద్రారెడ్డి హాజరు కాగలరా? అని పత్రికల వారు ప్రశ్నించగా ఆ విషయాన్ని వారినుండి తెలుసుకొనవలసిందిగా నేను పత్రికలవారికి స్పష్టం చేశాను’ అని తెలిపారు.
కొండా లక్ష్మణ్ విషయమై విలేకరులు ప్రస్తావించగా ‘తెలంగాణ ప్రజా సమితి ఉద్యమంతో సంబంధాలను ఆయన వదులుకున్నందున ఈ సమస్య ఉత్పన్నం కాబోదని చెప్పాను. తరువాత ఇతరులతోబాటు, కొండా లక్ష్మణ్‌కు కూడా ఆహ్వానం పంపబడిందని నేను తెలుసుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎస్.బి.గిరి స్వయంగా ఆయనకు ఆహ్వానం అందజేశారు’ అని చెన్నారెడ్డి స్పష్టం చేశారు. ఈ వివరణను ఆయన జనవరి 10న ఇచ్చారు. జనవరి 8న పాత్రికేయుల మాటలను, పత్రికా కథనాలను విశ్వసించిన కొండా లక్ష్మణ్ డా|| చెన్నారెడ్డిపై విరుచుకుపడ్డారని ఆ పత్రికలే ప్రచురించాయి. ఆ పత్రికా కథనాలనుబట్టి బాపూజీ మాటలు…
‘రాజకీయ పునరావాసానికే చెన్నారెడ్డి యత్నం’: బాపూజీ
‘తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయంగా పునరావాసం కల్పించు కొనడానికి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు డా|| చెన్నారెడ్డి ప్రయత్నిస్తున్నారు’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తీవ్రమైన విమర్శ చేశారు. పత్రికా గోష్టిలో మాట్లాడుతూ ”డా|| చెన్నారెడ్డి అధ్యక్షతనగల ప్రజా సమితి యిప్పుడు ఒక ‘మృతసంస్థ’గా పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే’ అని బాపూజీ అన్నారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, టీఎన్జీవోలు, టీచర్లు, న్యాయవాదులు తదితర సంస్థలలో చీలికలకు పూర్తి బాధ్యత చెన్నారెడ్డిదే’ అన్నారు.’సమితికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి డా|| చెన్నారెడ్డి తనతో ఎప్పుడూ సంప్రదించకుండానే నిర్ణయాలు గైకొన్నా’రని బాపూజీ ఆరోపించారు. ‘తెలంగాణ ఉద్యమంపై తమకు సర్వాధిపత్యం ఉన్నదని డా|| చెన్నారెడ్డి వర్గం భావించింది. రాజకీయ ఉద్యమాలలో వ్యక్తి ఎంత గొప్పవాడయినా అతనికి ప్రాధాన్యం ఉండబోదన్న విషయాన్ని ఆ వర్గంవారు తెలుసుకోవడం యుక్తమ’ని ఆయన అన్నారు. తమ భవిష్యత్ కార్యక్రమం విషయమై ప్రస్తావిస్తూ ‘విభిన్న శక్తుల మధ్య సమైక్యత, పరస్పర సహకారం, సమన్వయాల కోసం అన్ని ప్రయత్నాలు చేయగలన’ని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలిపారు.
ప్రజా సమితిని ఒక రాజకీయ పార్టీగా మార్చడానికి తాను వ్యతిరేకినని, ఈ వైఖరిని తాను ఆదిలోనే స్పష్టం చేశానన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని ముడివేయ డాన్ని తాను సహించజాలనని బాపూజీ అన్నారు.జనవరి 15న ప్రజా సమితి ఇచ్చిన బంద్ పిలుపు ‘ఒక తమాషా’ మాత్రమేనని, ఆరోజును ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిందని అన్నారు.
ప్రజా సమితి ప్రథమ మహాసభ
తెలంగాణ ప్రజాసమితి ప్రథమ రాష్ట్ర మహాసభ జనవరి 10, 1970న సికింద్రాబాద్‌లోని బాయస్ స్కౌట్ కేంద్ర కార్యాల యంవద్ద ప్రారంభమైంది. అందంగా అలంకరించిన పందిరి క్రింది వేదికపై తెలంగాణపటాన్ని, మహాత్ముని చిత్రపటాన్ని అలంకరించారు. తొమ్మిది తెలంగాణ జిల్లాల ప్రతినిధులు హాజరైన ఈ మహాసభ డా|| చెన్నారెడ్డి తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ప్రారంభమైంది. చెన్నారెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో ‘1966లో గోవాలో అవలంబించిన పద్ధతిలో తెలంగాణపై రెఫరెండం జరపాలన్న తన కోర్కెను పునరుద్ఘా టించారు. తెలంగాణ సమస్య కేవలం జాతీయ పునర్వ్యవస్థీకరణ సమస్య మాత్రమేనని ఆయన అన్నారు. ఈ సమస్యను ఫజల్ అలీ కమిషన్ పరి శీలించి, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారని డా|| చెన్నారెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజా సమితి ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారాలని ఒకవర్గంవారు చేస్తున్న అభిప్రాయం విషయమై ప్రస్తావించి, ప్రజాసమితి కార్యవర్గంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందినవారు ఉన్నందున వారి అభిప్రాయాలను కూడా పరిశీలించడం అవసరమని చెన్నారెడ్డి అన్నారు. ఆందోళనలో నిర్ణయాత్మకమైన దశను ప్రారంభించవలసియున్న ముఖ్యమైన తరుణంలో ప్రజా సమితి బలహీనం కారాదని, రాజకీయపార్టీగా ప్రజా సమితి మార్పిడి వాంఛనీయమని పరిగణించేపక్షంలో, లేదా అవసరమయ్యే పక్షంలో మార్పిడి కార్యక్రమాన్ని కొంతకాలంపోయిన తర్వాత సమగ్రంగా పరిశీలించిన పిదప చేపట్టాలని డా|| చెన్నారెడ్డి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రజలపట్ల తమకెట్టి విద్వేషభావంలేదని చెన్నారెడ్డి పునరుద్ఘాటించారు. ఆంధ్రులు తెలంగాణా ప్రాంతానికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చునని, అందుకు తమకెట్టి అభ్యంతరంలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆంధ్రులు తమపై రాజకీయ పెత్తందారీతనాన్ని చెలాయించడం తమకు ఇష్టంలేదని, రాజకీయ పెత్తందారీతనాన్ని పోగొట్టడమే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ‘మా భవితవ్యాన్ని మమ్మల్నే నిర్ణయించుకొననివ్వండి. మా ప్రాంతాలను మా అభీష్టానుసారం అభివృద్ధి చేసుకొననివ్వండి. మా అంతర్గత వ్యవహారాలలో ఇతరుల జోక్యాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఇతరుల అంతర్గత వ్యవహారాలలో మేము కూడా జోక్యం చేసుకోము’ అని డా|| చెన్నారెడ్డి స్పష్టం చేశారు. ‘మనం మన చరిత్రాత్మకమైన లక్ష్యం సాధించేవరకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని కొనసాగిస్తామని అందరూ ప్రతిన తీసుకుందాం’ అని డా|| చెన్నారెడ్డి అన్నారు. ‘జై తెలంగాణ’, ‘జైహింద్’ అనే నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగుతుండగా చెన్నారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని ప్రజాసమితి రాష్ట్ర కౌన్సిల్ ఆమోదించింది. శాసనసభ్యుడు అచ్యుతరెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రింద తెలంగాణకు తీరని అన్యాయాలు జరిగినట్లు వివరించారు. ప్రాంతీయసంఘం కేవలం ‘కంటి తుడుపు’ మాత్రమేనని, తెలంగాణాకు ఆర్థికంగా అన్యాయం చేయడానికి ప్రాంతీయ సంఘం ఒక కవచం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉపయోగపడిందని అచ్యుతరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఆంధ్రుల పెత్తందారీ తనం నుంచి విముక్తిని కలిగిస్తుందని ఆయన అన్నారు.
ప్రజాసమితి మహాసభకు రెండువేల మంది ప్రతినిధులు హాజరైనారు. 275మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులలో 200మంది హాజరయ్యారు. ఇతర ప్రజా సంఘాలనుండి 500 మంది హాజరైనారు. బ్రిటన్ లేబర్‌పార్టీ ఎంపీ డాక్టర్ గ్రే ఈ సభకు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైనారు.
రెండోరోజైన జనవరి 11న జరిగిన సభలో తెలంగాణ మృతవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చెన్నారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదటగా తెలంగాణ మృతవీరులకు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉత్తర్వులు జారీకాగలవ’ని డా|| చెన్నారెడ్డి అన్నారు. జనవరి 15వ తేదీని మృత వీరులదినంగా అధికారపూర్వకంగా ప్రకటించడం జరుగుతుందని ఆయన అన్నారు.
‘రాష్ట్రం ఏర్పడేవరకు విశ్రాంతి వుండరాదు. కాంగ్రెస్‌లోని చీలికలతో మనకు ప్రమేయం లేదు. మనం ప్రజలకోసం, ప్రజల మధ్యన జీవిస్తాము. వారికోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా వున్నాము’ అని చెన్నారెడ్డి అన్నారు.
కేంద్రం వచ్చే నెల 20వ తేదీ లోపల నిర్ణయం తీసుకోనట్లయితే, లక్ష్యంకోసం అటోఇటో తేలిపోయే పోరాటానికి సిద్ధం కావలసిందిగా ఆయన ప్రతినిధులను కోరినారు. అంతకుముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి టేపుచేసి పంపిన సందేశాన్ని సభలో వినిపించారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేవరకు ఆందోళన ఆగిపోద’ని రంగారెడ్డి అన్నారు. ఈ సభల్లో ప్రసంగించిన వారిలో బ్రిటన్ ఎంపీ డాక్టర్ గ్రే, జి. రాజారాం, పన్నాలాల్ పిట్టీ, ఎస్.కె. అహ్మద్, ఇ.వి. పద్మనాభన్, టి. రామారెడ్డి, ఎమ్. ముకుందరెడ్డి, డా|| బి.కె. నాయర్ తదితరులున్నారు.
జనవరి 15న బంద్
తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు 1970 జనవరి 15న జంటనగరాలతోబాటు అన్ని తెలంగాణ జిల్లాల్లో బంద్ జరిగింది. హింసాత్మక సంఘటనలు జరుగలేదు. కొన్ని బస్సులు ధ్వంసమైనవి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో పాల్గొంటున్న విద్యార్థి నాయకులు మల్లికార్జున్, కె.యం. అలీవుద్దీన్, జలీల్‌పాషా, వెంకటరెడ్డి, వహీద్, యస్. గోపాల్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. మల్లికార్జున్ ప్రసంగించవలసిన క్లాక్ టవర్ సభకు అనుమతి నివ్వలేదు. వరంగల్‌లో ఆజంజాహి మిల్లు మూతపడింది. డ్రైవర్లు రానందున పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నడపలేదు.
పార్టీకంటే లక్ష్యమే ప్రధానం: చెన్నారెడ్డి
జనవరి 15 బంద్ సందర్భంగా మృత వీరుల సంస్మరణ సభలో ప్రసంగిస్తూ ‘కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యమే తనకు ముఖ్యమైనద’ని డా|| చెన్నారెడ్డి అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో కాంగ్రెస్‌లోని సిండికేట్, ఇండికేట్ వర్గములు రెండింటికీ శక్తిలేదని, అందుచేత రాష్ట్ర సాధనకై తెలంగాణ ప్రజలు స్వయంగా ఆందోళన చేయడం ఒక్కటే మార్గమని, రాజకీయ ఎత్తుగడలు ఎన్ని అనుసరించినప్పటికీ ప్రయోజనం లేదని అన్నారు. బంద్ సందర్భంగా విద్యార్థి నాయకుడైన మల్లికార్జున్, జలీల్‌పాషా మరికొందరిని అరెస్టు చేయడాన్ని చెన్నారెడ్డి నిరసించారు. విద్యార్థి నేతల అరెస్ట్‌కు వ్యతిరేకంగా జనవరి 16న సమ్మె జరపాలని పులి వీరన్న, బి. పుల్లారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేశవ మెమోరియల్ హైస్కూల్ (నారాయణ గూడ)లో శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మరోసభలో కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఎంపీ బాకర్ అలీ మీర్జా, సదాలక్ష్మి, కేఆర్ ఆమోస్ తదితరులు పాల్గొన్నారు.
నేతల అరెస్టుకు నిరసనగా విద్యార్థుల సమ్మె
తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అధ్యక్షుడు మల్లికార్జున్‌ను, ఇతర విద్యార్థి నాయకులను జనవరి 15 బంద్ సందర్భంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, జంటనగరాలలోని 25 స్కూళ్ళలో, వరంగల్, హన్మకొండలలో విద్యార్థులు తరగతులకు గైర్హాజరైనారు.
స్వతంత్ర రాజకీయపక్షంగా తెలంగాణ కాంగ్రెస్: కొండా లక్ష్మణ్ బాపూజీ
ఇందిరాగాంధీ, నిజలింగప్పల సారథ్యంలోని కొత్త, పాత కాంగ్రెస్‌లు తెలంగాణకు ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగానే వున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా యని కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులు, ఇతర కాంగ్రెస్‌వాదులు తెలంగాణ పీసీసీని స్వతంత్ర రాజకీయ పక్షంగా ప్రకటించడమో లేక తెలంగాణ కాంగ్రెస్ సంఘం పేరుతో స్వతంత్ర రాజకీయపక్షాన్ని ఏర్పాటు చేసుకోవడమో అత్యుత్తమ మార్గం కాగలదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల తెగతెంపులు
రాష్ట్ర మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి అధ్యక్షతన శాసనసభ్యుల క్లబ్‌లో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్ధతును ఉపసంహరించాలని నిర్ణయించారు. తెలంగాణ సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ వీరీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులతో సంప్రదింపులు జరిపి శాసనసభ్యులు కృషి చేస్తున్న పద్ధతిలోనే వారిని కూడా కృషి చేయవలసిందిగా కోరడానికి డా|| చెన్నారెడ్డి, వి.బి. రాజు, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఎన్. రామచంద్రారెడ్డి, జె. రామేశ్వర రావు, కె. అచ్యుతరెడ్డి, కె. రామచంద్రారెడ్డి, జి. సుధా కర్, జి. వెంకటస్వామి, ఆర్. సురేందర్‌రెడ్డి, జి. రాజారాంలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావే శానికి 22మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, 4గురు ఎంపీలు హాజరైనారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంవల్ల లేదా ప్రతిపక్షంలో కూర్చోవడంవల్ల ప్రభుత్వానికి నష్టంలేదని బ్రహ్మానందరెడ్డి విలేకరులతో అన్నారు.
జనవరి 24న అమరుల సంస్మరణ దినం
డా|| చెన్నారెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రజాసమితి జనవరి 15న తెలంగాణ మృతవీరుల సంస్మరణదినంగా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహించగా, శ్రీధర్‌రెడ్డి, టి.ఎస్. సదాలక్ష్మిల నాయకత్వానవున్న ప్రజాసమితి సంస్థలు, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర నేతలు సంయుక్తంగా తెలంగాణ మృతవీరుల సంస్మరణదినాన్ని జనవరి 24న నిర్వహించారు. 1969 జనవరి 24న మెదక్ జిల్లా, సదాశివ పేటలో 8వ తరగతి విద్యార్థి శంకర్ పోలీసు కాల్పులలో గాయ పడి ఆ మరునాడు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో మరణించిన విషయం తెలిసిందే. శంకర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు. బొంబాయిలో కూడా తెలంగాణ మృతవీరుల స్మారక సభను (వర్లీలోని) తెలుగు సుధాకర్ యువక సంఘం నిర్వహించింది. గంగారామ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అంకం మల్లేశ్వర్, జక్కుల శంకర్, భూమేశ్వర్, కటుకం రాజలింగం పాల్గొన్నారు.
(తుది పోరుకు సిద్ధం కావాలన్న ప్రజాసమితి… వచ్చే సంచికలో)