రమజాన్ మాసం
మత సామరస్యానికి, భక్తి భావానికి ప్రఖ్యాతిగాంచిన విశిష్టమైన పండుగ పవిత్ర ‘రమజాన్’. ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై కోట్లకు పైగా ముస్లిములు సాంప్రదాయ బద్దంగా ఆచరించే పండుగ రమజాన్.
ఒక వ్యక్తి దైవంకోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ మహా ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో ఈ సుగుణాలు జనించి తీరవలసిందే. నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మహా ప్రవక్త (స) ఆచరణ గుణాలు తనలో పరివర్తనం చెందాలన్నది అసలు ఉద్దేశ్యం.
అరబిక్ భాషలో ‘రమ్జ్’ అంటే ఆగడం అని అర్థం. ఈ మాసంలోని నెల రోజుల ఉపవాస దీక్షలో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా సర్వపాపాలు సమసిపోతాయి. అరిషడ్వర్గాలైన, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంచబడి మనోనిగ్రహం ఏర్పడుతుంది. మానవుల్లో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ,కర్తవ్య పరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలైన ఉత్తమ గుణాలు అలవాటు చేసేందుకు సర్వశక్తి గల, సర్వవ్యాప్తి గల, సర్వ సాక్షియైన అల్లాహ్ ప్రతి ఏడూ మానవ జాతికి రమజాన్ మాసాన్ని ప్రసాదించాడు.
పవిత్ర మాసం రమజాన్ :
అతి పవిత్రమైన మాసం. సత్కార్య సౌరభాలు పరమళించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి కావలసిన సమస్త విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఈ పవిత్ర మాసంలోనే అంతిమ పవిత్ర దివ్య ఖుర్‌ఆన్ అవతరించింది. ఇది యావత్తు మానవాళికి ఆదర్శ ప్రభోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. ఈ మాసంలో ఉపవాసాలు విధిగా నిర్వహించబడతాయి. ఇది మన హృదయాలను ప్రక్షాళణ గావించి, వాటిలో దైవ భీతిని, దైవ భక్తిని ప్రోదిచేసే అత్యుత్తమ, వరప్రసాదితాలు. ‘రయ్యాన్’ మార్గం గుండా స్వర్గార్హతను సాధించి పెట్టే అమూల్య ఆణిముత్యాలు, అసమాన సాధనా సంపత్తులు. ఈ మాసంలోనే వేయి మాసా లకన్నా ఎక్కువగా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా ఉంది. చిత్తశుద్ధితో ఈ ఒక్కరాత్రి ఆచరించే ఆరాధన వెయ్యి మాసాలకన్నా ఎక్కువగా చేసిన దైవారాధనతో సమానంగా పరిగణించబడుతుంది.
సమాజ వాతావరణంలో చక్కటి ఆహ్లాదకరమైన మార్పు కనిపిస్తోంది. ”తరావి” నమాజులు కూడా ఈ మాసంలో ఆచరించబడతాయి. అదనపు పుణ్యం సంపాదించుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం. ”ఫిత్రా” ఆదేశాలు కూడా ఈ మాసంలోనే ఆచరించబడతాయి. వీటివల్ల సమాజంలోని పేదసాదలకు ఊరట లభిస్తుంది. దాదాపుగా అత్యధిక సంఖ్యాకుల ‘జకాత్’ కూడ ఈ మాసంలోనే చెల్లిస్తారు. దైవం ఈ పవిత్ర మాసాన్ని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహ, పర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఉపకరించే అనేక అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోవడానికి శక్తి వంచనలేని కృషి చేయాలి. అలుపెరగని ప్రయత్నం ఆరంభించాలి. ‘రోజా’ వ్రతమన్నది కేవలం అంతిమ దైవ మహా ప్రవక్త (స) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలిక, సార్వజనీన ఆరాధన. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చలామణిలో ఉన్నట్లు అంతిమ దైవ గ్రంథం ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది.
ఉపవాస వ్రతం కేవలం నేటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేక మైనది కాదని, పూర్వకాలం నుండి, ప్రవక్తలందరి అనుయాయులపై ఇవి విధిగా ఉండేవని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తోంది. ఈనాడు కూడా ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని జాతులు, అన్ని మతాల వారిలో ఈ ఉపవాస వ్రత సాంప్రదాయం కొనసాగుతోంది. కాకపోతే ఒక నిర్ధిష్టమైన, మార్గదర్శకమైన సాంప్రదాయక విధానం లేకపోవచ్చు. మొత్తానికైతే ఆ భావన ఉంది. ఏదో ఒక రూపంలో ఆచరణా
ఉంది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత, సామాజిక నేపథ్యం కలిగినటువంటి ఉపవాసాల ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని కూడా దైవం చాలా స్పష్టంగా విశదీకరించాడు. మానవ సమాజంలో భయభక్తుల వాతావరణాన్ని, నైతిక, మానవీయ విలువలను, బాధ్యతా భావాన్ని పెంపొందించటం ధ్యేయమని సెలవిచ్చాడు.
అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుద్ధికుశలత, విచక్షనా జ్ఞానం, ఆలోచన శక్తి, మాట్లాడే మాట ఒక్క మానవుడికే ప్రసాదించాడు. కాని మానవుడు తన స్థాయిని గుర్తించక దైవ ప్రసాదితమైన బుద్ధిజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగపరుస్తూ తన ఇష్టానుసారం దైవానికి విరుద్ధంగా జీవితం గడుపుతూ, కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. దైవాదేశాలను విస్మరించి ఇష్టానుసారం జీవితం గడుపుతున్నప్పటికీ ఇహలోక జీవితం సుఖవంతంగా, నిరాటంకంగా సాగిపోతుందంటే ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నింటికి ఫలితం అమాంతంగా పెరిగిపోతుంది. ఒక ఐచ్చిక కర్మ (సఫిల్) ఆచరిస్తే, మహా ప్రవక్త (స) సాంప్రదాయాన్ని అనుసరించి చేసిన కర్మతో సమానంగా (సున్నత్‌కు సమానంగా) పుణ్యం లభిస్తుంది. ఒక సున్నత్ ఆచరిస్తే విధిగా (ఫర్జ్) ఆచరించే ఆచరణకు సమానంగా ప్రతిఫలం లభిస్తుంది. ఇలాగే ఒక విధిని నెరవేరిస్తే 70 విధులను నిర్వర్తించినదానికి సమానంగా పుణ్యఫలం పెరిగిపోతుంది. అయితే ఒక్క
ఉపవాసం మాత్రం వీటన్నింటికీ అతీతం. దీనికి ఒక పరిమితి అంటూ లేదు. ఉపవాస ప్రతిఫలం అనంతం, అనూహ్యం.
విశ్వ ప్రభువు తన అనంత ఖజానాలోంచి ఉపవాస ప్రతిఫలాన్ని తానే స్వయంగా ఇస్తానంటున్నాడు. కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో రోజాలు (ఉపవాసం) పాటించి పరమ ప్రభువు నుండి నేరుగా ప్రతిఫలం అందుకోవడానికి ప్రయత్నించాలి. చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి అంతిమ మహా ప్రవక్త (స) ఒక దానాన్ని పరిభాషలో సద్ ఖాయే ఫిత్ర్ అంటారు.ఫిత్రా దానంకి చెల్లించనంత వరకూ రమజాన్
ఉపవాసాలు భూమ్యాకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. దైవ సన్నిధికి చేరవు. అందుకని ఉపవాసాలు దేవుని స్వీకార భాగ్యానికి నోచుకోవాలంటే ఫిత్రా దానం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. దీంతో పాటు ఫిత్రా దానం వల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కలుగుతుంది. అందుకే మహా ప్రవక్త (స) ఫిత్రా దానాన్ని, దీనులు, నిరుపేదల భృతి అన్నారు. ఈ కారణంగానే ఫిత్రా దానాన్ని కేవలం ఉపవాసులకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ విస్తరించారు. పండుగ నమాజుకు ముందు జన్మించే శిశువుతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరి తరపునా ఫిత్రాలు చెల్లించాలి.
ఈ విధంగా ధాన ధర్మాల విధి విస్తరించి, అర్హులైన అధికశాతం మందికి ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఎంత పేదవారైనప్పటికి ఫిత్రా, జకాత్‌ల రూపంలో అందే ఆర్థిక సహాయంతో పండుగ సంబరాల్లో ఆనందముగా, సంతోషముగా పాల్గొనగలుగుతారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖ సంతోషాలతో జీవనం గడుపుతూ, పరలోకంలో దైవ ప్రసన్నతకు పాత్రులు కావాలన్నది ఇస్లాం ఆశయం.
-మహమ్మద్ వహీదుద్దీన్