Untitled-1ప్రజా సుఖే సుఖం రాజ్ఞః  ప్రజానాంచహితేహితం!
నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాంతుప్రియంహితం!!

ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉన్నది. ప్రజా హితంలోనే రాజు హితం ఉన్నది. రాజు తనకు ప్రియమైన దానినే హితమనుకొనూడదు. ప్రజలకు ఏది ప్రియమో అదే తన హితం. దీనికి అన్యధావర్తించిన వారికి, రాజుకు, రాజ వంశాలకు అనర్ధం తప్పదు.’ ఇది కౌటిల్యుడు తన అర్థశాస్త్రమని పిలవబడే రాజనీతిశాస్త్రంలో చెప్పినమాట.

రాజులు గానీ, ప్రభుత్వాలు గానీ ప్రజా సంక్షేమాని పని చేయాలి. లేకుంటే వారికి అనర్ధాలు తప్పవు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యతాక్రమం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఒకసారి విద్యా, వైద్యం మొదటి ప్రాధాన్యతాంశమైతే, మరొకసారి రహదారులు ప్రాధాన్యతాంశం కావచ్చు. కానీ, అన్ని కాలాలలోనూ తాగు, సాగు నీరు అత్యధిక ప్రాధాన్యతాంశమే. ముఖ్యంగా మన దేశం లాంటి వ్యవసాయ దేశంలో. మన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రకంగా అనేక రాజ వంశాలు ఈ నీటి ప్రాధాన్యతను గుర్తించి, దానికై పాటు పడ్డారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకొనవలసిన వారు కాకతీయులు. వీరు సముద్రాలనబడే చెరువులు, తటాకాలను నిర్మించి, ఈ ప్రాంత వ్యవసాయాభివృద్ధికి, తద్వారా ప్రజల ఆర్థిక పరిపుష్టికి పాటుపడ్డారు.

ఈ తటాక నిర్మాణాలు ఉన్న గ్రామాలలోనే చేశారా లేక నూతన గ్రామాలనేర్పాటు చేశారా అంటే రెండు రకాలుగాను చేశారని చెప్పవచ్చు. సమకాలీనంగా జనాభా అధికం కావడం వల్ల అరణ్యాలను నరికి, నూతన వ్యవసాయ భూములను, గ్రామాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులోనే నూతన తటాకాలను నిర్మించారు. ఉదాః వరంగల్‌ జిల్లాలోని సేముద్రం గ్రామాన్ని ప్రోలరాజు ముందుగా ‘పెద్ద తటాకాన్ని’ నిర్మించి, దానికి తన బిరుదు మీద ‘సేరి సముద్రం’ అని పేరు పెట్టి, దాని పక్కనే ఆగ్రహార, గ్రామాలను ఏర్పాటు చేశాడు. కాలక్రమేణ ఆ సేరసముద్రమే సేముద్రంగా మారింది. గ్రామం వృద్ధి చెందింది. అట్లే నెక్కొండ గ్రామం కూడా.

కానీ, నల్లగొండ జిల్లాలోని పానుగల్లులో పాత గ్రామం లేక నగరంలో నూతన తటాకం నిర్మించి, దానికి ‘ఉదయాదిత్య సముద్రం’ అని పేరుపెట్టారు. ఈ విషయాన్ని హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి శాసనం రూఢిపరుస్తుంది. అసలు పెద్ద పెద్ద చెరువులు, తటాకాలను తవ్వించి వాటికి సముద్రాలు అని పేరు పెట్టడం కళ్యాణీ చాళుక్యుల కాలంలోనే కన్పిస్తుంది. తెలంగాణలో లభించిన కళ్యాణీ చాళుక్యుల శాసనాలలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. కళ్యాణీ చాళుక్యుల కింద ప్రాంతీయ సామం తులుగా పరిపాలన చేసిన కాకతీయులు, వారి సామంతులు ూడా తదుపరి కాలంలో ఈ తటాక నిర్మాణాలను ‘సముద్రాలను విస్తృతపరచి’, అమలు పరిచారు. మన ప్రాంతంలో అతిపెద్ద చెరువు, దాని పక్కనే శివాలయం, గ్రామం కన్పిస్తే గుడ్డిగా అవి కాకతీయుల నాటివని చెప్పవచ్చు.

Town (గ్రామం, నగరం), Temple (ఆలయం), Tank (తటాకం, సముద్రం) కాకతీయుల లక్షణం. అందుకే ‘three T’s are Kakatiyas అంటారు. కాకతీయులనాటి తటాక నిర్మాణం, నిర్వహణ నాటి శాస్త్రీయ విజ్ఞానానికి, దాని అత్యున్నత దశకి తార్కాణాలు. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పద్మనాయ కులు, కుతుబ్‌ షాహిలు కూడా కాకతీయుల వలెనే తటాక నిర్మాణాలుగావించారు. రాజులు, రాజ వంశస్తులు, అధికారులే గాక, ధార్మిక సంస్థలు, వర్తక వ్యాపార సంస్థలు, సామాన్యులు కూడా ఈ నీటి వనరుల నిర్మాణం గావించారు. ఇది సప్త సంతానాలలో ఒకటిగా కుమార సంభవంలోను, కరీంనగర్‌ శాసనాలలోను చెప్పబడినది. ఇది గొప్ప ధర్మకార్యంగా, పుణ్యకార్యంగా కూడా భావించబడినది.

కుతుబ్‌ షాహీల కాలంలో నూతన తటాక నిర్మాణాలేగాక, అంతకుముందు నిర్మితాలైన తటాకాలు, కాలువలు, కత్వాలు ఏవైనా శిథిలమైతే వాటిని పునరుద్ధరించారు. ఇది నేటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ వంటిదే. ఈ కత్తువ, కాల్వల పునరుద్ధరణకు సంబంధించిన శాసనం ఒకటి నల్లగొండ జిల్లా పానుగల్లులో ఉన్నది. దీన్ని ‘ఉదయ సముద్రం’ కట్టమీది నుండి ప్రస్తుత వ్యాస రచయిత పానుగల్లు పురావస్తు ప్రదర్శనశాల ఆవరణలో భద్రపరిపించారు. ఈ శాసనాన్ని నేలటూరి వెంకటరమణయ్య 1994లో రాష్ట్ర పురావస్తు శాఖవారు ముద్రించిన నల్లగొండ జిల్లా శాసనాలు. సంపుటం-2లో పరిష్కరించి ప్రకటించారు. దీన్ని సరిగా విశ్లేషిస్తే, అది అచ్చం మన మిషన్‌ కాకతీయకు సరిపోతుంది. ప్రతిరూపం అనిపిస్తుంది.

1554 నాటి ఈ పానుగల్లు శాసనంలో ఇబ్రహీం కుతుబ్‌ షా నిజహితుడైన రహమ తుల్లా నెమిలెవద్ద మూసీనది కాలువపై గల కత్తువ (అడ్డుకట్ట, ఆనకట్ట, డ్యాం) ఖిలమై ఉంటే దాన్ని పునరుద్ధరించి కాలువలు చేయించి, ఆ నీళ్ళు ఉదయ సముద్రం నుండి, కృష్ణా నది వరకూగల కుంటలు, కాలువలు, చెరువులు నీళ్ళతో నింపుతూ కృష్ణతో కలిసేటట్లు చేశాడని చెప్పబడినది. నెమిలెకాలువ నుండి నీరు ముందుగా ‘ఇందుపురేల’ ద్వారా ‘పానుగల్లు ఉదయాదిత్య’ సముద్రం వరకు సాగి అక్కడి నుండి తిరిగి కృష్ణానది (వాడపల్లి) వరకు నీరు పారేటట్లు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ‘ఇందుపురేల’ అన్నది ఇంద్రపాలపురము, నేటి తుమ్మల గూడెం. ఇది విష్ణు కుండినుల జన్మస్థలము లేక తొలి రాజధాని.

నెమిలెకాలువ నల్లగొండ జిల్లాలో వలిగొండ దగ్గరి నాగారంకి పశ్చిమాన సుమారు 4 కి.మీ. దూరంలో ఉన్నది. అక్కడి నుండి పానుగల్లు సుమారు 60 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో సుమారు 40 గ్రామాల వరకు ఉన్నాయి. అట్లే తుమ్మల గూడెం, ముని సంపుల, ఇన్కిళ్ళ, ఎరసాని గూడెం, సామనగుండ్ల, చిట్యాల, నార్కెట్‌ పల్లి, చెర్లపల్లి వంటి 35 వరకు చిన్న, పెద్ద తటాకాలు, వాటి కాలువలు ఉన్నాయి. వీటిలో ఇస్కిళ్ళ తటాకానికి కమళ సముద్రమని పేరు. ఈ చెరువులు, వాటికి అనుబంధంగా వున్న కాలువలు, కుంటులు నీటితో నిండి, జలకళను సంతరించుకొనేవి. ఈ నీటి కింద సాగుపై ఉదయ సముద్రం (పానగల్లు) దగ్గర ‘దశబంధం’ ఉండేది. దశబంధ మన్నది పండిన పంటలో పదవ వంతు పన్నుగా చెల్లించడం. దీన్ని చెరువుల కాలువల మరమ్మతులకు, నిర్వహణకు ఉపయోగించే వారు. ఉదయ సముద్రం నుండి నీరు కృష్ణానది వరకు వెళ్ళేవని శాసనంలో చెప్పబడినది. పానుగల్లు నుండి కృష్ణానది (వాడపల్లి) సుమారు 90 కి.మీ.ఉన్నది. అనగా నెమిలెకాలువ నుండి కృష్ణ వరకు గల సుమారు 150 కి.మీ.ల మధ్య శథాధిక తటాకాలు, కాలువలు ఒక దాని తరువాత మరొకటి చొప్పున అన్నీ నీటితో నిండేవి. వీటిని మనం ‘గొలుసుకట్టు చెరువులు’గా వ్యవహరిస్తున్నాం.

వీటి నిర్వహణ, మరమ్మతులకు దశబంధ శిస్తు వసూలుండేదని పైన చెప్పుకున్నాం. ఈ నిర్వహణకు ప్రభుత్వ అధికారుల (నీరుగాడు, తోర్పరి వంటివారు) చిత్తశుద్ధితో పాటు ప్రజల నైతిక, అంకిత భాగస్వామ్యంతోడై ఉండేదని శాసనాన్ని బట్టి చెప్పవచ్చు. శాసనం తెలుగు, ఉర్దూ రెండు భాషలలో లిఖింపబడినది. అట్లే ఉదయ సముద్రం దాకా రాజుకు ఒకపాలు, ప్రజలకు ఒకటిన్నరపాలు, బ్రాహ్మణులకు, తురకలకు రెండు పాల్లు చెందేవని చెప్పబడినది. దీన్ని బట్టి రాజు, ప్రజలు అన్ని మతాల, కులాల వారు ఈ నీటి నిర్వహణలో భాగస్వాములై ఉండేవారని భావించవచ్చు. శాసనం చివర దీన్ని విఫలం చేసిన వారికి ధన నష్టం, నాలుగు రెట్లుంటుందని చెప్పబడినది. మధ్యయుగాల శాసనాలలో, శాసనంలో చెప్పబడిన ధర్మాన్ని నిర్విఘ్నంగా అమలు జరిపిన వారు తమ వంశీయులైనా, పరవంశీయులైనా (మద్వం శజా పరమహీపతివా…) వారిపాద ద్వయానికి శిరస్సు వంచి నమస్కరిస్తాము. వారి పాదధూళిని మా శిరస్సుపై ధరిస్తామని చెప్పుకున్నారు. ఎంత గొప్పవిషయం.

వీరి ధర్మ కార్య ఆకాంక్ష ఆ చంద్రర్కాస్థాయిగా నిలవాలన్న సంకల్పంతో ఉండేది. కనుకనే అంతకుముందెప్పుడో నిర్మితమైన కత్తువ ఖిలమైతే ఇబ్రహీంకుతుబ్షా కాలంలో పునరుద్ధరింపబడినది. అట్లే తర్వాత కాలగమనంలో ఖిలం అయిన (చేయబడిన) చెరువులను నేడు రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది.

గోల్కొండ సుల్తానయిన ఇబ్రహీంకుతుబ్‌ షాను తెలుగువారు అత్యంత ప్రేమతో ఇభరాముడు, మల్కి భరాముడు అని పిలుచుకున్నారు. ఇతడు ప్రజా సంక్షేమానికి, తెలుగు వారి సంస్కృతిని చక్కగా పోషించాడు. ఇబ్రహీం కుతుబ్‌ షానే గాక, మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా కుమార్తె హయత్‌ బక్షీ బేగంను కూడా తెలుగువారు అత్యధికంగా అభిమానించారు. ఈమెను ప్రేమగా, అప్యాయంగా, ఆదరంగా ‘హయత్‌ మా’ అని, ‘మాసాహిచా’ అని పిలుచుకునేవారు. ఈ హయత్‌ బక్షీ బేగం మూడు తరాల కుతుబ్‌ షా సుల్తానుల పరిపాలన చూసిన సహస్రమాసజీవి. నేటి హయత్‌ నగర్‌, అక్కడి మసీదును ఈమె 1626లో అబ్దుల్లా కుతుబ్షా ప్రథమ రాజ్యాభిషేక చిహ్నంగా హయతాబాద్‌ పేర నిర్మించింది. ఇక్కడ సరాయే మాసబ్‌ అనేవి శాంతిమందిరము, తటాకమును నిర్మించినది. అట్లే హైదరాబాద్‌ నగరంలో ఈమె పేర నిర్మించిన తటాకమే. ‘మా సాహిబా టాంక్‌.’ నేటి మాసబ్‌ టాంక్‌. కాలక్రమంలో తటాకం మాయమై మా సాహిబాటాంక్‌ నామమాత్రంగా మాసబ్‌ టాంక్‌గా మిగిలిపోయింది.

Other Updates