ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి వచ్చే ఏడాది నుంచి వందకు వందశాతం ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు.
ఎస్.ఆర్.ఎస్.పి.కాలువల ద్వారా 16 లక్షల ఎకరాలకు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు మొత్తం 40 లక్షల ఎకరాలకు గోదావరి నదీ జలాలు అందాలని సీఎం చెప్పారు. గోదావరి నదిలో తెలంగాణకున్న వాటా ప్రకారం నీరు వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి, వచ్చే ఏడాది నుంచే నీరు వాడుకునే వెసులుబాటు ఉందని సీఎం చెప్పారు.
పుష్కలమైన నీటి లభ్యత ఉన్నదని, నిధుల కొరత లేదని ఈ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించలేకపోతే పాపం చేసినట్లేనని సీఎం వ్యాఖ్యానించారు. ఎస్.ఆర్.ఎస్.పి. నుంచి నడిగూడెం వరకు 346 కిలోమీటర్ల మేరనున్న కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, దీనికి ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎస్.ఆర్.ఎస్.పి. కాలువల కింద మొత్తం 16 లక్షల ఎకరాల్లో, ఎల్‌ఎండి దిగువన ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించాలని, వీటి పరిధిలోని చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపాలని సీఎం ఆదేశించారు. పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే చెరువులను రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలను పరిశీలించి, అంచనాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
ఎస్.ఆర్.ఎస్.పి. ని సమర్థంగా వాడుకునే అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు టి.హరీష్ రావు, జి. జగదీష్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గాదరి కిషోర్, ఏనుగు రవీందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎస్.ఇ. నాగేందర్, ఎస్.ఇ.లు, ఇఇలు ఈ సమావేశంలోపాల్గొన్నారు.
”సమైక్య పాలనలో ఎస్.ఆర్.ఎస్.పి. కట్టినట్లు చూపించారు. నీళ్లిచ్చినట్లే మభ్యపెట్టారు. కానీ పూర్తి స్థాయిలో నీళ్లు ఎప్పుడూ ఇవ్వలేదు. చివరి ఆయకట్టు దాకా నీరు చేరలేదు. రైతులు సాగునీరు లేక తల్లడిల్లారు. ఇప్పుడు మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం. దాని ఫలితం రైతులకు దక్కాలి. గోదావరిలో సమైక్య రాష్ట్రంలోనే మనకు 950 టిఎంసిల నీటి వాటా ఉంది. కానీ ఎన్నడూ మన వాటాకు అనుగుణంగా నీటిని వాడుకోలేదు. ఇప్పుడు మనం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కూడా 500-600 టిఎంసిలకు మించి నీటిని వాడుకోలేము. ఈ నీటిని వాడుకున్నా 40 లక్షలకు పైగా ఎకరాలకు గోదావరి నుంచి నీళ్లు అందించవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా 16లక్షలు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో మనం పనిచేయాలి. తెలంగాణ రైతులు మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు. కాల్వల ద్వారా వారికి రెండు పంటలకు నీరందాలి. చెరువులన్నీ ఎప్పటికీ నిండి ఉండాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
”వచ్చే ఏడాది జూన్ నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని తోడడం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మిడ్ మానేరు, ఎల్.ఎం.డి.లకు నీరు చేరుతుంది. అక్కడ నుంచి పాత కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు నీరు రావాలి. ఎల్.ఎం.డి. దిగువ భాగంలోనే ఎస్.ఆర్.ఎస్.పి. కింద 8.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ కాల్వలు సరిగా లేవు. ఎల్.ఎం.డి. నుంచి 8,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీరు ప్రవహించేలా కాల్వలుండాలి. కానీ 6వేల క్యూసెక్కుల సామర్ధ్యాన్ని మాత్రమే తట్టుకునేలా కాల్వలున్నాయి. వెంటనే కాల్వల సామర్ధ్యాన్ని పెంచాలి. దీనికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాళేశ్వరం నీరు అందేలోగానే, వచ్చే ఎండాకాలం పూర్తయ్యే నాటికి కాల్వల పనులు పూర్తి కావాలి. ప్రధాన కాల్వలు, డిబిఎం కాల్వలు,పంట కాల్వలన్నీ సిద్ధం కావాలి. ఎస్‌ఆర్‌ఎస్పి కాల్వలు ప్రవహించే మార్గంలో చెరువులన్నీ నింపాలి. మైలారం, రోళ్లకల్, ఫణిగిరి, కేతిరెడ్డి ఆనకట్, కొత్తగూడ, బయ్యన్నవాగు, మాటేడు తదితర చెరువుల సామర్థ్యం పెంచి రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలను పరిశీలించాలి. పర్వతగిరి చెరువు సామర్థ్యం పెంచాలి. ఇంకా ఏవైనా చెరువుల సామర్థ్యాన్ని పెంచగలిగితే పెంచాలి. వీటికి సంబంధించి అంచనాలు తయారు కావాలి. 45 రోజుల్లో టెండర్లు పిలిచి, ఈ అక్టోబర్ లో పనులు ప్రారంభించాలి. వచ్చే ఎండాకాలంలోపు పనులు పూర్తి కావాలి. దీనికోసం ఎక్కువ ప్యాకేజీలుగా పనులను విభజించి పనులు చేయించాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
”తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన కషి వల్ల, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నందువల్ల కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కొత్తూరు వద్ద బ్యారేజిలు నిర్మించుకుంటున్నం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. బాసర నుంచి భద్రాచలం వరకున్న 500 కిలోమీటర్ల పొడవు గోదావరి నదిలో 275 కిలోమీటర్ల మేర నదిలో ఎప్పుడూ పుష్కలమైన నీరు నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులు నింపుకుంటూనే ఉండాలి. కాల్వల ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు పంపించేందుకు సిద్ధంగా ఉండాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
”నీటి లభ్యత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి దాదాపు 35వేల కోట్ల రూపాయలను నీటి పారుదల రంగానికి ఖర్చు చేస్తున్నాం. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలి. ఎక్కడికక్కడ పనులను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి. ప్రతీ జిల్లాలో మంత్రులు తమ పరిధిలోని పనులు వేగంగా జరిగేటట్లు చూడాలి. కేవలం సమీక్షలతో సరిపోదు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. ఏమైనా అవాంతరాలు ఎదురైతే తొలగించాలి. తమ ప్రాంత రైతులకు సాగునీరు అందించడం తమ బాధ్యత అని ఎమ్మెల్యేలు, మంత్రులు అనుకోవాలి” అని సీఎం కేసీఆర్ సూచించారు.
తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్, కిషోర్ తదితరులు ముఖ్యమంత్రికి వినతులు చేశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టు కెనాల్ కు మూలాధారమైన లక్ష్మి కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టాలనే ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి వినతికి సీఎం సానుకూలంగా స్పందించారు. వరద కాలువ, ఎస్‌ఆర్‌ఎస్పి కాలువల మధ్య ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి లిఫ్టులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్.ఆర్.ఎస్.పి. కాల్వల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని ఈ రెండు జిల్లాల కలెక్టర్లను సీఎం కోరారు.