ఇంటర్‌విద్య-పూర్తిగా-ఉచితంaమరో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పదవ తరగతి తర్వాత పై చదువుకు ఫీజు కట్టలేక చదువును మానేసే వాళ్లందరికీ ఇది ఓ వరం. ఇక ముందు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలలో పైసా ఖర్చు లేకుండా చదువును పూర్తి చేసే సదుపాయాన్ని కల్పించింది ప్రభుత్వం.

రెండేళ్ల పాటు సాగే ఇంటర్మీడియట్‌ కోర్సుకు సంబంధించి పాఠ్యపుస్తకాల నుండి పరీక్ష ఫీజు వరకు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. దేశంలో ఇంతవరకు ఎక్కడా అమలు చేయని ఈ విధానాన్ని 2015 -16 విద్యా సంవత్సరం నుండే అమలు పరుస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

ఈ పథకం వల్ల రాష్ట్రంలో వున్న 402 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో చేరబోయే దాదాపు లక్షన్నర మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఇంతకు ముందు వసూలు చేసే నామమాత్రపు ఫీజులు కూడా మినహాయించడం వల్ల ప్రభుత్వంపై రూ. 9 కోట్లు, ఇది కాకుండా ఉచిత పాఠ్యపుస్తకాలను అందించడం వల్ల మరో రూ. 7 కోట్లు, పుస్తకాలు, ఫీజు మొత్తం సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు భారం పడుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు.
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి రూ. 140 కోట్లు కేటాయించినట్లు, వీటిని కాలేజీ నూతన భవన నిర్మాణాలకు, పాత భవనాల మరమ్మతులకు, అదనపు తరగతి గదుల కొరకు వినియోగిస్తామన్నారు. గత ప్రభుత్వాల వలె కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కడియం శ్రీహరి అన్నారు.

Other Updates