– డా|| అయాచితం నటేశ్వర శర్మ
దీపావళి’ అంటే దీపాల వరుస. ప్రతి యేడాదీ అశ్వీయుజ బహుళ చతుర్దశినాడు జరిగే దీపాల పండుగకే దీపావళి అని పేరు. ఈ పండుగ లోకమంతా జరుపుకోవడానికి మూడు చారిత్రకాంశాలున్నాయి
ఒకటి – పూర్వం రాక్షసరాజైన బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి అణగద్రొక్కిన దినం.
రెండు – శ్రీరామచంద్రుడు రావణ సంహారానంతరం
అయోధ్యలో సామ్రాజ్య పట్టాభిషిక్తుడైన దినం
మూడు – అవక్రపరాక్రముడైన విక్రమార్కమహారాజు
సామ్రాజ్య పట్టాభిషిక్తుడైన దినం.
ఇలా ఈ మూడు అంశాలే కాకుండా ఇంకా అనేకాధ్యాత్మికాంశాలు నిబిడీకృతం అయిన ఈ పండుగ దినాన్ని ప్రపంచం అంతా ఎంతో ఆనందోత్సాహాలతో టపాకాయలు పేలుస్తూ జరుపుకొంటుంది.
అసలు దీపావళి ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. ఐదు రోజుల పాటు జరుపుకునే విశేష పర్వదినం. ఆశ్వీయుజ బహుళ త్రయోదశినాడు ధన త్రయోదశి. దీనినే ‘ధన్‌తేరస్’ అని పిలుస్తారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు శక్తి స్వరూపిణి అయిన అమ్మ నరకాసురుణ్ణి వధించిన దినంగానూ, మానవాళికి నరకప్రాప్తి కలుగకుండా రక్షించే పుణ్యదినంగానూ ‘నరక చతుర్దశి’ విరాజిల్లుతోంది. ఆశ్వీయుజ అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రం కనుక ఆనాటి పండుగ దీపావళిగా ప్రసిద్ధం. దీపావళి మరుసటిదినం అయిన కార్తీక శుద్ధ పాడ్యమినాడు ‘బలిపాడ్యమి’ పర్వదినాన్ని పితృదేవతలకు బలులు సమర్పించే పండుగ గానూ, బలిచక్రవర్తికి ఉత్తమలోకాన్ని ప్రసాదించిన పండుగగానూ జరుపుతారు. కార్తీక శుద్ధ విదియనాడు యమద్వితీయ, భ్రాతృ ద్వితీయ అనే పేరుతో ‘భగినీహస్తభోజనం’ గా పిలువబడే పండుగను జరుపుకుంటారు. ఇలా దీపావళి పండుగ ముందు వెనుకలుగా ఐదు దినాల పాటు జరుపుకొనే మహాపర్వదినంగా భాసిల్లుతున్నది.
మొదటి దినం అయిన ధనత్రయోదశిని ‘ధన్‌తేరస్’ అని పిలవడం లోకంలో పరిపాటి. ఈ దినాన ఏది లభించినా అది బంగారం అవుతుందని జనుల నమ్మకం. అందువల్ల అందరూ ఈ పవిత్ర దినాన ఎంతో కొంత బంగారాన్ని కొని, ఇంటికి తెచ్చుకుంటారు. బంగారం లోకంలోనే అత్యంత మూల్యమైన సంపద. అది లక్ష్మీ దేవికి ప్రతిరూపం అని అందరి విశ్వాసం. బంగారం ఇంటికి వచ్చిందంటే సాక్షాత్తూ, లక్ష్మీదేవి స్వయంగా కాలుమోపినట్లు భావిస్తారు. ఈ దినాన సామాన్య జనులూ, వ్యాపారులూ, అన్ని వర్గాల వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుతూ పూజలు చేస్తారు. నగల దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతుంటాయి. మనిషి తన జీవితం అంతా సుఖ సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. ఆ ఆకాంక్షను ప్రతిరూపమే ధనత్రయోదశి.
రెండవ దినం ‘నరక చతుర్దశి’నాడు తొలి పొద్దుపొడిచే ఉషఃకాలంలోనే మేల్కొని మంగళస్నానాలు చేస్తారు. ఈ పవిత్ర దినాన నరక విముక్తి కోసం యమధర్మరాజును పూజించి దీపదానం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. నరకలోకంలో బాధలు అనుభవిస్తున్న వారికి పుణ్యలోకాలను సంప్రాప్తింపజేసే దినంగా కూడా నరకచతుర్దశిని భావిస్తారు. ఈ విషయంలో శాస్త్రం ఇలా చెబుతోంది.
‘చతుర్దశ్యాం తు యే దీపాన్ నరకాయ దదంతి చ |
తేషాం పితృగణాస్సర్వే నరకాత్ స్వర్గమాప్నుయుః ||
అంటే నరక చతుర్దశి నాడు ఎవరు దీపాలను దానం చేస్తారో వారి పితరులు (గతించిన పూర్వ పురుషులు) నరకం నుండి స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం. ఇలా పితృదేవతలకు పుణ్యలోకప్రాప్తిని కలిగించే నరకచతుర్దశి అంటే అందరికీ భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఈ దినాన నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలనీ, స్నానానికి ఉపయోగించే పవిత్ర జలాలలో ఉత్తరేణి, తుమ్మి, తగిరిస చెట్ల కొమ్మలను కలపాలని సంప్రదాయం చెబుతోంది. స్నానానంతరం యమాయనమః, ధర్మరాజాయనమః, మృత్యవేనమః, అంతకాయనమః, వైవస్వతా యనమః, కాలాయనమః, సర్వభూతక్షయాయనమః, ఔదుంబ రాయనమః, ధర్మాయనమః, నీలాయనమః, పరమేష్ఠినే నమః, వృకోదరాయనమః, చిత్రాయనమః, చిత్రగుప్తాయనమః అనే పధ్నాలుగు నామాలతో తర్పణాలు చేయాలని శాస్త్రవాక్యం. అనంతరం నువ్వులతో వండిన పిండి వంటలతో భోజనం చేయాలి. ఈ దినాన దీపదానాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
మూడవదినం అయిన అమావాస్యను దీపావళి అమావాస్యగా పిలుస్తారు. ఈ దినాన లక్ష్మీపూజలతో దినమంతా కళకళలాడుతుంది. ఈ దినాన సాయంకాల వేళలో ఇండ్లలోనూ, వ్యాపార కేంద్రాలలోనూ, వృత్తి కేంద్రాలలోనూ, వాణిజ్య సముదాయాలలోనూ మంగళతోరణాలు కట్టి లక్ష్మీదేవి రాకకోసం పూజలు చేస్తారు. ఈ పూజలు ధనలక్ష్మీపూజలుగా జగత్ప్రసిద్ధాలు. ధనకనకవస్తు వాహనాది సంపదలను లక్ష్మీస్వరూపాలుగా భావించడం ఈ పూజలో పరమార్థం. ఇళ్లవాకిళ్ల నుండి ప్రారంభించి, అన్ని చోట్ల ఆనందోత్సాహాలతో టపాకాయలు పేలుస్తూ, ఆ వెలుగులతో అమావాస్య రాత్రిని వెలుగుల వెన్నెలమయంగా చేస్తారు. ఈనాటి రాత్రి అంతా వాణిజ్య సముదాయాల ప్రధాన ద్వారాలను మూయకుండా తెరిచి ఉంచుతారు. రాత్రంతా ఏ క్షణంలోనైనా ధనలక్ష్మీదేవి తమ ప్రాంగణాలలోనికి ప్రవేశిస్తుందనీ, తమ జీవితమంతా లక్ష్మీకళతో వెలిగిపోతుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. లక్ష్మీపూజలు చేసిన తరువాత ఎవరూ ఆ రాత్రి నిద్రపోకుండా జాగరణ చేసి, లక్ష్మీ దేవిని ధ్యానిస్తారు. ఇలా దీపావళి నాడు పగలూ రాత్రీ లోకమంతా లక్ష్మీదేవి వైభవం వెల్లివిరుస్తుంది.
నాల్గవ దినం బలిపాడ్యమి. బలిచక్రవర్తికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ దినాన అభ్యంగన స్నానాలు చేసి బలిచక్రవర్తిని ధ్యానిస్తూ –
‘బలిరాజ! నమస్తుభ్యం విరోచన సుత! ప్రభో !
భవిష్యేంద్రసురారాతే! పూజేయం ప్రతి గృహ్యతాం’
అని సంకల్పం చేసి, బలి చక్రవర్తిని పూజించి, దీపాలను దానం చేయడం పరిపాటి. పితృదేవతలకు నరకం నుండి విముక్తి కలగడం కోసం దీపాలను వెలిగించడం కూడా ఈ దినం నాడు ప్రత్యేకత.
అయిదవ దినం యమద్వితీయ. దీనినే భ్రాతృద్వితీయ అని కూడా అంటారు. ఈ దినాన యమధర్మరాజునూ, చిత్రగుప్తుణ్ణీ పూజిస్తారు. ఈ పండుగకే ‘భగినీ హస్త భోజనం’ కూడా పేరుంది. ఇందుకు కారణమైన కథ ఇలా ఉంది.
‘పూర్వం యమధర్మరాజు సోదరి యమున తన అన్న అయిన యమధర్మరాజును భోజనానికై ఆహ్వానించింది. యమధర్మరాజుకు తీరిక దొరకక చాలా కాలం దాకా చెల్లెలు ఇంటికి రాలేక పోయాడు. కానీ కార్తీక శుద్ధ విదియ నాడు ఆయనకు తీరిక లభించి చెల్లెలు ఇంటికి భోజనానికి వచ్చాడు. చెల్లెలు యమున ఎంతో సంతోషించింది. తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన యమ ధర్మరాజుకు షడ్రుచులతో కూడిన చక్కటి భోజనాన్ని వడ్డించింది. ఆయన తృప్తిగా భోజనం చేసి, ఏదైనా వరం కోరుకొమ్మని చెల్లెలితో అన్నాడు. అప్పుడు యమున – ‘అగ్రజా! ఈ కార్తీక శుద్ధ విదియ నాడు చెల్లెలు ఇంటికి వెళ్లి, చెల్లెలి చేతి వంటను భుజించిన వారికి అకాల మరణం సంభవించకుండా వరం ఇవ్వు!’ అని అడిగింది. ఆమె కోరిన వరాన్ని యమధర్మరాజు ప్రసాదించాడు. నాటి నుండి యమద్వితీయనాడు అన్నలు చెల్లెళ్ల ఇంటికి వెళ్లి ప్రీతి భోజనాలు చేసి, చెల్లెళ్లకు ఆనందాన్ని కలిగించడం ఆనవాయితీగా మారింది.
ఇలా దీపావళి పండుగ ఎన్నో ప్రత్యేకతలతో అల రారుతూ లోకాన్ని అనుగ్రహిస్తోంది. పండుగలన్నీ మాన వాళికి ఐహిక ప్రయోజనలనూ, ఆముష్మిక ప్రయోజ నాలనూ అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పండుగలు మానవ జీవన సంస్కృతిలో భాగమైపోయాయి. మనిషి తాను బ్రతికినంత కాలం దినమొక పండుగగా గడపాలని కోరు కుంటాడు. ఆ ఆకాంక్షకు ప్రతి రూపాలే ఈ పండుగలు !