రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నల్లాతో పాటు డిజిటల్ సేవను అందించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను కూడా వేయడానికి ప్రణాళిక సిద్ధమైందని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. జూలై 1న డిల్లీ లో జరిగిన డిజిటల్ ఇండియా వారోత్సవాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందించడం ద్వారా సమయం, ఖర్చు కలిసివస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ ద్వారా గానీ, మొబైల్ ద్వారా గానీ డిజిటల్ పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వ సేవను అందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి నాణ్యమైన డిజిటల్ సేవను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించిందని, ప్రతి ఇంటిలోనూ ఒకరిని డిజిటల్ పరిజ్ఞానంతో అక్షరాస్యుల్ని చేయాలని భావిస్తున్నామన్నారు. ఆరో తరగతి నుంచే కంప్యూటర్ వినియోగంపై ప్రాథమిక పాఠాలను బోధించడం ద్వారా డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వై – ఫై సేవ లు అందుబాటులోకి వచ్చాయని, ఇదే విధంగా గ్రామ పంచాయతీల్లోనూ లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీతో సేవలందిస్తామన్నారు. ‘డిజిటల్ లిటరసీ’ ప్రాజెక్టుతో ప్రతి ఇంటిలో ఒకరికి డిజిటల్ పరిజ్ఞానం కల్పించడమన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలను విస్తరించడంతోపాటు వాటిని మొబైల్ ఆధారంగా పనిచేసేలా తీర్చిదిద్దుతామన్నారు.
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ లోనూ డిజిటల్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జూలై 1వ తేదీ నుంచే కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. డిజిటల్ టెక్నాలజీతో యాదగిరిగుట్ట, భద్రాచలం దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రజల్లో డిజిటల్ తెలంగాణపై అవగాహన పెంచడానికి 5 కె, 10కె రన్‌తో పాటు విద్యా సంస్థల్లో వ్యాసరచన, క్విజ్ తదితర పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్, నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాయంలో వై-ఫై సేవను ప్రవేశపెడుతున్నట్లు కెటిఆర్ ప్రకటించారు.
ప్రభుత్వ శాఖల డిజిటలైజేషన్:
డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఆయా విభాగాల వారిగా డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు కెటిఆర్ తెలిపారు. దేవాదాయ, సాంఘీక సంక్షేమ, వ్యవసాయ శాఖ కు సంబంధించిన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హరిత హారానికి ప్రత్యేక యాప్‌ను రూపొందించే ఆలోచన ఉన్నదన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలను ఐటికి అనుసంధానం చేసి వీలైనంత ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. అధునాతన వ్యవసాయ సాగులన్నింటిని ఒక చోటికి తెస్తూ ‘ఫ్యాబ్లెట్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దీని కోసం ఇక్రిశాట్‌లోని ఇద్దరు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.