అన్నవరం దేవేందర్
పిల్లకు పిలగాడు దొరింపు అయ్యిండంటేనే ఆ ఇంట్ల పెండ్లి కళ వచ్చేస్తది. అంతకుముందు పిల్లోల్లు పిలగానోల్లు సూడబోవుడు నచ్చుడు నడి పెద్దమనుషులతోటి మాటా ముచ్చట అయితది. లగ్గం ఎక్కడ చేసుడు, కట్నం ఎంత ఇచ్చుడు అర్నం ఆవులకు ఇచ్చుడు ఇవన్నీ కుదురుతయి. అయినంక పూలు, పండ్లు, వరపూజ అయితయి. పిల్లకు పూలు పండ్లు పెట్టితె మన పిల్ల అనిపిఉ్చకునుడు, అట్లనే వరపూజ, పిలగానికి చేస్తే సగం లగ్గం అయినట్టే అన్పిస్తది. లగ్గం కోటు ఏసుకునుడు పెండ్లి ముందట. ఇగ అప్పటినుంచే పిల్ల ఇంటికాడ పనులు మొదలు అయితయి. వడ్లు పట్టిచ్చుడు, కట్టెలు కొట్టిచ్చుడు, ఇస్తారి కట్టలు సదురుడు, పప్పు పోటేసుడు, చింతపండు ఎండబెట్టుడునుంచి మొదలు పెట్టితే సకులం పనులు ఆ ఇంటి ఆమె చూసుకుంటది. ఇంటి ఆయనకు తలకాయమీద పెద్ద భారం పడ్డట్టే అన్పిస్తది. గొర్లను తయారు చేసుడు, పైకం సదురుకునుడు, సుట్టాలతోని మాట్లాడుడు సుర్వు అయినంక పెండ్లికి అవసరమైన పనివాల్లు, అయిరేని కుండలు, కూరాడి కుండలిచ్చేటోల్లు, గాడిపొయ్యిలు తీసేటోల్లు, గొర్లు, మ్యాకలు కోసేటోళ్లు, దప్పు సప్పులోల్లు, సన్నాయి వాయిద్యాలకు తమ్మలోల్లు, గంటె పుస్తె, కాళ్ళకు మట్టెలు చేసేటోళ్లు, ఇట్ల సకలం మందితో సంప్రదిస్తనే ఉంటడు.
లగ్గం పెట్టుకున్నరంటే పనులు మొదలు అయితయి. ఇంటిముంగట, వాకిట్ల పందిరి ఏసుడు, గుంజలు కొట్టుకవచ్చుడు, సొప్ప పట్టుకవచ్చుడు, పచ్చని పందిరి సిద్ధం చేస్తరు. శుభలేఖలు అచ్చుకొట్టిచ్చుడు. వాటికి పసుపు, నూనె రాసి సుట్టాలకు ఇచ్చుడు, బావలకు, ఇయ్యంపులకు, సడ్డకులకు, అత్తగారి ఇండ్లల్లకుపోయి ఇచ్చి వచ్చుడు మొదలయితయి. వారం రోజులముందు అనంగనే బట్టలకు పోవుడు, ఆడబిడ్డలకు శార పోసుడు, ఓడి బియ్యం పోసుడు, దోతుల జోడలు, పట్టుబట్టలు, రైక కనుములు, తువ్వాలలు, లుంగీలు యాది మరువకుంట తెచ్చుకునుడు అయినంక, కిరాణం దుకాండ్లకుపోయి నూనె, కారంపొడి, శక్కరి, శనిగపిండి సరుకులు తెచ్చుకొని ముందుగాల పలారాలు చేస్తరు. పలారాలు చేసేందుకు వాడకట్టోలు, ఇంటి సుట్టాలు, పాలోల్లు వస్తరు. సకినాలు, మడుగులు, లాడు ముద్దలు, కారప్పూస చేసుడు, రెండు రోజులు ముకుడు పెడితె అయితయి.
ఇంతలనే ముందట పందిరి ఏసుడు అంతకుముందే ఇంటికి సున్నం ఏసుడు, సామానంత సదురుడు, మల్ల పేర్సుడు, గూనపెంకలు పేర్సుడు, అన్నీ అయినంక ఇల్లుకు పెండ్లి అందం వస్తది. పెండ్లి ఇల్లు అంటే ఊరందరికి తెల్సిపోతది. ఎన్కట ఆడపిల్ల పెండ్లికి అందరూ సహకరించేది, సామానులు ఇచ్చుడు కాంచి మొదలు పెడితె పైసలు బదలుదాకా ఆదుకుందురు. పిల్ల లగ్గం చేసి సాగనంపాలనంటే వాడకట్టుకు కూడా బాధ్యత ఉండేది. పిల్ల పెండ్లి అంటే పిల్ల మ్యానత్తలు, బావలు, శిన్నవ్వ బిడ్డలు, పెద్దవ్వ బిడ్డలు అందరు ఇల్లు నిండుతరు.
పెండ్లినాడు ఎవలసూసిన హడావిడి. అయ్యగారికి రెండుసార్లు పోయివచ్చి చెప్పుడు సుర్వు అయితది. పెండ్లి పిల్లను చేసుడు సుర్వు అయినంక పిలగాన్ని తీసికరానుపోతరు. పిలగాన్ని తీసికరాను బామ్మర్ధితోపాటు ఇంకో ఇద్దరు పిల్ల మ్యానమామ, ఇంకొకరు పోతరు. పిల్లగాని ఊల్లెకుపోయి అక్కడ సుత పిల్లగాన్ని చేసి, మెడల దండ ఏసి కొత్త బట్టలు పెట్టి, భాజా భజంత్రీలతో తీసుకొస్తరు. ఊల్లె విడిదికాడ లేదంటే, గుడికాడ దించి పిలగాన్ని ఎదుర్కోని పోతరు.
ఈలోపల ఇక్కడ పిల్లకు మైలపోలు తీస్తరు. తయారుచేస్తరు. అంతకుముందే కూరాల్లు పట్టుడు, కుండలమీద శద్దరి ఎత్తిపడుతరు, దాన్ని ఒల్లెడ పట్టుడు అంటరు. ఔసులోల్ల ఇంటికిపోయి పుస్తెలు, మట్టెలు తెస్తరు. యీడికి దప్పుసప్పుల్లతోనే పోతరు. తాంబాలంల కుంకుమ భరణి, బొట్టు, మాణిక్యంతోపోయి తెస్తరు. ఇదొక సందడి. పిల్ల ఇంటి ముందటనే పందిరిల పెండ్లి అయితది. అతకుముందే కొబ్బరి ఆకులతోని పందిరి చేసి ఇంటిముందు ఎర్రమన్నుతో అలికి పచ్చ ముగ్గు ఏస్తరు. పెండ్లి పిల్లను చేసినంక పిలగాన్ని విడిదిలకెల్లి తీసికరాను సప్పుల్లతోని పోతరు. అక్కడ ఇద్దరు ఇయ్యాలు అందుకునేవాల్లు నోట్లే శక్కరి పోసుకుంటరు. ఒగలకు ఒగలు ఇక ఇయ్యము అందుకొనే సంబురం సందర్భం. అక్కన్నుంచి పెండ్లి వాకిట్లకు తెచ్చినంక బామ్మర్ధి కడుపకాడ నిలబడి కట్నం అడుగుతడు. బామ్మర్ధికి పిలగాడు సంబురంగా నాలుగు పచ్చనోట్లు పెట్టుతడు. అదో సంబురం. అప్పుడు బామ్మర్థులు అందరూ కల్సి పిల్లగాన్ని ఎత్తుకోని పందిట్ల కూసుండ పెడుతరు.
దీంతోటి వరుడు, వధువు ఒక్క దగ్గర మంటపంలో బాసింగాలల్లకేలి సూసుకుంటరు. పంతులు వచ్చి లగ్గం మంత్రాలు సదువుడు సుర్వు చేసినంక ఇంటి పెద్ద మనుషులు, ముసలోల్లు, తాత, అమ్మలు, సుట్టు సంబరంగ సూస్తుంటరు. ఇటు పెండ్లి నడుస్తుంటేనే భోజనాల దగ్గర ఇస్తారి ఆకులు, మంచినీళ్ళ జగ్గులు, కూర, అన్నం గిన్నెలు, పప్పు చారు తయారు అయితది. అంతలనే లగ్గం, అయిపోయి అయ్యగారు పుస్తె కట్టిస్తడు. దాంతో కల్యాణం ఘట్టం పూర్తి అయినట్టు. పిల్ల, పిలగాడు కల్సి కాపురంకు పెండ్లి ఒక కళ. అది తల్లిదండ్రుల బాధ్యత.