తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకుంటున్నది.అరవై యేళ్ల గాయాలను మాన్పుకుంటున్నది. తన దైన ముద్రను అన్ని రంగాల్లో వేసుకుంటున్నది. రెండేళ్ల తెలంగాణ రాష్ట్రంలో సకల రంగాల్లో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నది. జూన్ 2, 2014న తెలంగాణ పురుడు పోసుకున్నది. ఆ తరువాత ఎన్నో అనుమానాలు, అపోహలు. అన్నింటినీ పటాపంచలు చేసింది. ప్రపంచం ముందు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడింది. అంతే కాదు ప్రపంచానికే మార్గదర్శనం చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే హిస్టారికల్ సర్వే చేసింది మన ప్రభుత్వం. మన దేశంలో తొట్ట తొలి సారిగా జరిగిన సర్వే అది. శాస్త్రీయంగా చేసిన సర్వే సకలజన తెలంగాణను గుర్తించింది. ప్రతి మనిషినీ గుర్తించింది. తన జనాలు ఎట్లా ఉన్నారో తెలుసుకున్నది ప్రభుత్వం. మునుపటి సర్కార్లకు మన ప్రభుత్వానికీ ఉన్న తేడా ఏమిటో తెలిసి పోయింది. ఆ ఘటనతోనే ఇది మన ప్రభుత్వం అనే తొలి ఆలోచన వచ్చింది.
ఇండ్లున్న వారు, లేని వారు. ఉద్యోగాలు, భూములు, వత్తులు, పిల్లలు, పెద్దలు అందర్నీ లెక్కలోకి తీసుకుని వెయ్యేళ్ల బంగారు తెలంగాణకు బాటలు వేసింది ఈ ప్రభుత్వం. ఆ సర్వే చేసిన తరువాత ప్రభుత్వం ఇక గత పాలకుల నిర్వాకాల రిపేర్లపై దృష్టి పెట్టింది. అప్పటి నుండి చేస్తూనే ఉన్నది. రోగాలను గుర్తించింది. ఇక ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తున్నది.
మిగులుతో ఆంధ్రాతో విలీనం అయిన రాష్ట్రం అంత కంటే పది రెట్ల మిగులతో తొలి ఆర్థిక మంత్రి ఈటెల తెలంగాణ బడ్జెట్‌ను సభ ముందు పెట్టారు. అట్లా మూడు బడ్జెట్లు తనదైన ముద్రతో ఉన్నవే. ప్రతి దాంట్లోనూ తెలంగాణ కోసం, తెలంగాణ చేసుకున్న కేటాయింపులు. ఇంతకు ముందటి బడ్జెట్లకు దీనికి అస్సలు పోలికే లేదు. అన్నింటినీ మించి ఎనలేని ఆత్మస్థయిర్యాన్ని నింపిందీ సర్కార్.
మనకు ఏది తగినది అవుతుందో దానిపైనే దష్టి పెట్టాలని అనుకుంటున్నది. అందుకే తెలంగాణకే ఆయువు పట్టు అయిన మిషన్ కాకతీయను చేపట్టింది. ఇది తెలంగాణలోని సుమారు యాభై వేల చెర్వులను మరమ్మతు చేస్తున్నది. వాస్తవంగా ఇది తెలంగాణకు జరుగుతున్న తొలి మరమ్మతు కింద లెక్క. మన ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. తమకూ దీని గురించి చెప్పాలని ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానించాయి. తెలంగాణ పల్లెను తట్టిలేపిన మట్టి కార్యక్రమం ఇది. పూడిక తీసిన ఫీడర్ ఛానెల్స్ బాగు చేసిన చెర్వు లు ఈరెండేళ్లలో పది వేల దాకా ఉన్నాయి. అరవై యేండ్ల ఉమ్మడి పాలనలో ఆరు చెరువులు కూడా మరమ్మతు చేయలేదు. చేసినా దాంట్లో మనదైన ప్రేమ లేదు. బిల్లులు చేయడం కోసమే పనులు చేసే వారు. కానీ ఇప్పుడు నీళ్ల కోసం, బతుకు కోసం, బాగు కోసం ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసిన పెద్ద కార్యక్రమం ఇది.
ఇదొక్కటేనా.. మన తిండి, మన పండగ, ఆట, పాటలనూ గుర్తించింది. అందుకే ప్రభుత్వ నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో కూడా అంబలి, గట్క, తలె , చెంబు, తంగేడు పూల గురించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకు ముందు దీన్ని చూశామా మనం. అదే మార్పు. భవిష్యత్తు తరాలు చదువుకునే పాఠ్యాంశాల నిండా ఇప్పుడు తెలంగాణ, బంతిపువ్వుల తోటై వికసిస్తున్నది. మునుపటికి ఇప్పటికీ ఉన్న తేడా ఇదే. కేవలం రెండేళ్లలో సాధించిన మార్పు ఇది.
శ్రమను గుర్తించింది మన ప్రభుత్వం. దాని కంటే మిగతా వారి కంటే మనం ఎందులోనూ తీసిపోమని చెప్పేందుకు అవార్డులు ఇచ్చింది. మేడే రోజు, మహిళా దినోత్సవం రోజున మన తెలంగాణ బిడ్డలను సగౌరవంగా సన్మానించుకున్నది తెలంగాణ. మారుమూల పల్లెలను సైతం గుర్తించి వారి శక్తి సామర్థ్యాలను ప్రపంచం ముందు పెట్టింది. ఇంతకు ముందూ ఇవన్నీ ఉన్నవే. కానీ వారు పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వాటిని గుర్తించింది. సన్మానించింది. ఈ రెండేళ్లలో వచ్చిన తేడా ఇదే.
సాగు, తాగునీటి రంగాల్లోనైతే ఊహకు అందనంత వేగంగా ముందుకు వెళ్తున్నది. రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ లతో అసమానమైన, అనుపమానమైన రీతిలో ముందుకు వెళ్తున్నది. ఎల్లంపల్లి నుండి కొద్ది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించింది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయోచ్చునో, ఎట్లా చేయోచ్చునో చెప్పేందుకు ఎల్లంపల్లి నీటి ఉదాహరణే చాలు. ప్రభుత్వం మనది కాబట్టి మన నగరానికి మనం నీళ్లు ఇచ్చుకున్నాం. ఈ రెండేళ్లలో వచ్చిన తేడా ఇది.
కొత్త కొత్త ప్రాజెక్టులు, పాత ప్రభుత్వాలు పట్టించుకోని పనులను తిరిగి ప్రారంభిస్తున్నది. మేడిగడ్డ, పాలమూరు-రంగారెడ్డి, చిన్నా, పెద్ద ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ప్రాజెక్టుల ఫలితం ఇవ్వాళే ఉండక పోవచ్చు కానీ. ఓ పదేళ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే అభివృద్ధి నమునా అవుతుంది. మన రాష్ట్రంపై జరుగుతున్న అన్ని రకాల కుట్రలను, కుతంత్రాలను ఛేదిస్తున్నది. ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ముద్రతో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలున్నాయి. కళ్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, టిఎస్ పిఎస్సీ ద్వారా నియామకాలు, పెన్షన్ స్కీంలు. ఇవన్నీ మన ప్రభుత్వం చేస్తున్న పనులు. అట్లా అనే దాని కంటే మన తెలంగాణ చేసుకుంటున్న పనులు. రెండేళ్ల తెలంగాణ రాష్ట్రంలో తనదైన ముద్రతో ముమ్మాటికీ మంచి భవిష్యత్తును కలలు గంటూ చేసుకుంటున్న పనులివి.
పారిశ్రామిక రంగంలోనూ మార్పులు స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ వచ్చిన తొలి నెల రోజుల్లోనే ఆ ఫలితాన్ని తెలంగాణ పారిశ్రామిక రంగం చూసింది. నిరంతర విద్యుత్‌తో లాభాలొస్తున్నాయని నిర్వాహకులే చెప్పారు. పైగా మూత పడిన పరిశ్రమలు తెరిపించేందుకు ప్రణాళిక కూడా సర్కారు సిద్ధం చేసుకున్నది. సిర్పూర్ కాగజ్ నగర్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసింది. ఇంకా కొన్ని పరిశ్రమలను తేబోతున్నది. టిఎస్ ఐపాస్ ద్వారా దేశంలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం. సింగిల్ విండో అనుమతులు ఇస్తున్నది. దీనిపైన పక్క రాష్ట్రాలు సైయితం అసక్తితో ఉన్నాయి.
ఐటి రంగానికి మన హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అవుతున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్ వంటి సంస్థలు వచ్చాయి. ఆపిల్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నది. ఇంక్యూబేెటర్లకు ప్రోత్సహ కాలిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం రెండేళ్లలో అంటే తడబడే అడుగులతోనే సాధించిన విజయాలు.
”ఈ ప్రభుత్వంపై మాకైతే ఇప్పుడు కోపం లేదు. తెలంగాణ వచ్చిందే ఇప్పుడు. కేసీఆర్ పునాదులేస్తున్నాడు. అప్పుడే ఫలితం ఉంటుందా. మాకు కాకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటది.” ఇది నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రైతు అన్న మాట. ఈయనకు లక్షలాది రూపాయల వ్యవసాయ అప్పుంది. ఆయనకి ధీమానిస్తున్నది ఈ ప్రభుత్వం. ఇంతకంటే ఏం చెప్పాలి.!