kcrశ్రీ కన్నెకంటి వెంకటరమణ

రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్‌ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నగరాల్లో చాలీచాలని డబ్బాలాంటి ఇళ్లలో దుర్బర జీవితాలు గడుపుతున్న పేదలూ ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా జీవించాలన్న సంకల్పంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇకపై ఏటా సుమారు రూ.4వేల కోట్ల హడ్కో రుణంతో 60వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ప్రకటించారు. సికింద్రాబాద్‌ ఐడిహెచ్‌కాలనీలో కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంతో దేశంలోని హౌజింగ్‌ రంగంలో కొత్త అంకం మొదలైందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐడిహెచ్‌కాలనీలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలు పొంగించారు. పూజలు నిర్వహించి లాంఛనంగా ఇళ్లను ప్రారం భించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఐడిహెచ్‌కాలనీలో నిర్మించిన ఇళ్లను ఎంతోమంది ప్రముఖులు, అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శించారని, ఇకపై రాష్ట్రంలో ఇదే నమూనాలో పేదల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో పేదలకు ఇళ్లు నిర్మించాలంటే ఊరిబయట, ఏదో రూ.70వేలిస్తే సరిపోతుందన్న భావన ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత డబ్బాలాంటి సింగిల్‌ బెడ్‌రూంలో పేదలు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నట్టు గుర్తించి, పేదల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. హడ్కోనుంచి తీసుకునే రూ.5వేల కోట్లతో ఏటా తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో,ఒక్కో సెగ్మెంట్‌లో సుమారు 400డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఐడిహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్ల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నప్పుడు సందర్శించిన గవర్నర్‌ నరసింహన్‌ సైతం ఇళ్లు నిర్మించిన తీరు, మౌలిక వసతులపై ఎంతో సంతప్తి వ్యక్తం చేశారని కేసీఆర్‌ వెల్లడించారు. ఢిల్లీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు సైతం ఇలాంటి ఇళ్లు అందుబాటులో లేవని, ఎంతో విజయవంతంగా పనులు పూర్తిచేసి కాలనీని ప్రారంభిస్తున్నందుకు తనకు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారని కేసీఆర్‌ సభాముఖంగా వివరించారు. అంతేగాక, తనకూ ఓ డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కేటాయించాలని కోరినట్టు సిఎం పేర్కొనడంతో సభా ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

దేశ గహనిర్మాణ రంగంలో

నూతన అధ్యాయం

భారతదేశ చరిత్రలో మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది కె.చంద్రశేఖర్‌రావు నేతత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.హైదరాబాద్‌ బోయిగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలోనే నిర్మించిన 396 డబుల్‌ బెడ్‌రూం, రెండు టాయిలెట్లు, కిచెన్‌, హాల్‌తో కూడిన మోడల్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నవంబర్‌ 16వ తేదీన ప్రారంభించారు. మొత్తం 33బ్లాకుల్లో ఒక్కోక్కటి 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ 396డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి 42కోట్ల 80లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో ఇంటికి 9లక్షల 48వేల రూపాయల వ్యయంతో ప్రభుత్వ నిధులతో నిర్మించడం జరిగింది. మొత్తం 396డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో 276మంది షెడ్యూల్డ్‌ కులాలవారు, 31షెడ్యూల్డ్‌ తెగల లబ్దిదారులు ఉండగా మిగిలినవాటిలో మైనార్టీలు, బలహీన వర్గాలవారున్నారు. ఈ ఇళ్లను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. గత సంవత్సరం 2014 జూన్‌ మాసంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అభ్యర్థనపై ఈ బోయిగూడ ఐడిహెచ్‌ కాలనీని ముఖ్యమంత్రి కెసిఆర్‌ సందర్శించారు. 1969 సంవత్సరంలో నిర్మించి పూర్తిగా శిథిలావస్థలో ఉండి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ కాలనీని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి టూ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఐడిహెచ్‌ బోయిగూడ నుండే ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. గత దసరారోజు ఈ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిరుపేదలు కూడా గౌరవప్రధమైన జీవనాన్ని గడాపాలని, అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేయగలమని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలకనుగుణంగా జిహెచ్‌ఎంసి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని కేవలం ఒక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పూర్తి జరిగింది. హైదరాబాద్‌ మహా నగరాన్ని స్లమ్‌లెస్‌ సిటీగా తీర్చిదిద్దడానికి ఐడిహెచ్‌ బోయిగూడ మోడల్‌ హౌసింగ్‌ కాలనీ వేదిక కానుంది. దేశంలో మరే రాష్ట్రంలో 580చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను ఉచితంగా ఇంత వరకు ఏ ప్రభుత్వం కూడా నిర్మించి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కేవలం 260 విస్తీర్ణంలో ఒక బెడ్‌రూం, కిచెన్‌ మాత్రమే నిర్మించి ఇచ్చిన దాఖలాలున్నాయి. ఐడిహెచ్‌ బోయిగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మోడల్‌ కాలనీ దేశంలోనే ఒక పర్యాటక ప్రాంతంగా మారింది. ఈ కాలనీని జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సందర్శించి, వీటి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు జిహెచ్‌ఎంసి చేపట్టిన చర్యలను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఐడిహెచ్‌ బోయిగూడలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు న్యూ ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులకు కేటాయించే ఇళ్ల కన్నా విశాలంగా ఉన్నాయని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కూడా కితాబునిచ్చారు. ఇటీవల జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ అధ్యక్షులు ఈ కాలనీని సందర్శించి నిరుపేదలు ఆత్మాభిమానంతో గౌరవ ప్రదమైన జీవనం గడపడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ఇళ్లు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తాయని కితాబునిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 10వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను జిహెచ్‌ఎంసి నిర్మిస్తోంది. ఇందుకు గాను హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులకు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలకు చెందిన వివిధ బస్తీలకు చెందిన ప్రజలు ఐడిహెచ్‌ కాలనీని సందర్శించి తగు స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Other Updates