గర్భిణిలు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తుందని సిఎం చెప్పారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసే బాధ్యత అంగన్ వాడీ టీచర్లు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. జనహితలో ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు చెప్పిన విషయాలు విన్నారు. సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించారు. ప్రగతిభవన్లోనే అంగన్ వాడీ కార్యకర్తలకు భోజనం పెట్టి వారితో సిఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంగన్ వాడీ కార్యకర్తలే నేరుగా ఒక్కొక్కరు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సిఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు:
అంగన్ వాడీ కార్యకర్తల హోదాను అంగన్ వాడీ టీచర్లుగా మార్చారు. ఇకపై అంగన్ వాడీ టీచర్లుగానే వారిని సంబోధించాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంగన్ వాడీ టీచర్ల జీతం రూ. 4,200. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 ఫిబ్రవరి 28న సచివాలయంలో అంగన్ వాడీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు వారి జీతాన్ని రూ. 7,000కు పెంచారు. ఇప్పుడు తాజాగా అంగన్ వాడీ టీచర్ల జీతాలను రూ. 10,500కు పెంచారు. అంటే ఒక్కో అంగన్ వాడీ టీచర్ జీతం రూ. 3,500 (50శాతం) పెరిగింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి లెక్కగడితే పెరుగుదల 150 శాతం
మినీ అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, అంగన్ వాడీల్లో పనిచేస్తున్న హెల్పర్ల జీతం తెలంగాణ వచ్చే నాటికి రూ. 2,200 ఉండేది. మొదటి సారి ముఖ్యమంత్రితో సమావేశమయినప్పుడు వారి జీతం రూ. 4,500కు పెంచారు. తాజాగా వారి జీతాన్ని రూ. 6,000కు పెంచారు. మినీ అంగన్ వాడీ కేంద్రాల కార్యకర్తలు, హెల్పర్ల జీతం తాజాగా రూ. 1500 (33.3 శాతం) పెరిగింది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి లెక్క కడితే ఈ పెరుగుదల 172 శాతం
అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలనే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది
అంగన్ వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారి సీనియారిటీని, అర్హతలను పరిగణలోకి తీసుకుని సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పిస్తాం
అంగన్ వాడీ టీచర్, హెల్పర్ కు బీమా సౌకర్యం కల్పిస్తాం
అంగన్ వాడీ కార్యకర్తలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యం కల్పిస్తాం
అంగన్ వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీలు, పిల్లల భోజనానికి సన్నబియ్యం ఉపయోగిస్తాం. వచ్చే నెల నుంచే అంగన్ వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో అన్నం వండి పెడతాం
మే నెలలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు కేంద్రాలకు రావడం ఇబ్బందిగా ఉన్నందున ఆ నెల పోషకాహారాన్ని నేరుగా ఇండ్లలోకే పంపుతారు.
మాతా, శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం
”తెలంగాణ రాష్ట్రంలో మాతాశిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఆరోగ్యాన్ని అన్ని విధాల కాపాడుతాం. పేద గర్భిణీలు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణిగా ఉండి కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్లడం అత్యంత బాధ కలిగించే విషయం. అందుకే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నా. గర్భిణీలు, బాలింతలు, శిశువులకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకంలో పోషకాహారం, పాలు, గుడ్లు అందిస్తాం. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తెలంగాణ తల్లులు జన్మనిచ్చిన పిల్లలు రేపటి తెలంగాణ సంపద. వారు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. అందుకే వారికి మంచిపోషణ కావాలని ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం అమలు చేస్తున్నాం’.
పేదలు ఎక్కువగా వచ్చే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యే గర్భిణీలకు మూడు విడతలుగా రూ.12వేల సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అమ్మాయి పుడితే తెలంగాణ ఆడబిడ్డకు ప్రోత్సాహంగా మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాం. ఏప్రిల్ 1 నుంచే ఈ కార్యక్రమం అమలవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లకు కావాల్సిన సామాన్లతో రూ.2వేల వ్యయంతో ఓ కిట్‌ను ప్రభుత్వం బహుమానంగా ఇస్తుంది. అంగన్ వాడీ టీచర్లు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కషి చేయాలి” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమం కార్యదర్శి జగదీష్, డైరెక్టర్ ఇందిర, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.