gandiప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమాత్యులు డా.లక్ష్మారెడ్డి వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి 30 అధునాతన వెంటిలేటర్‌ పరికరాలను డిసెంబర్‌ 29న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వైద్య రంగం ఎంతో ముఖ్యమైనదని, ఇందుకనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, సిబ్బంది మౌళిక సదుపాయాలు తదితర వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీ ఆసుపత్రి ఎంతో పేరొందిన ఆసుపత్రి, కేవలం హైదరాబాదు వాసులకే కాకుండా అన్ని జిల్లాల నుండి చికిత్స కోసం అధిక సంఖ్యలో ప్రజలు ఈ ఆసుపత్రికి వస్తుంటారని అన్నారు. రోగికి అత్యవసర పరిస్థితుల్లో కృత్రిమ శ్వాసనందించేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో తయారు చేయబడిన వెంటిలేటర్లను ఈ ఆసుపత్రికి అందజేస్తున్నామని తెలిపారు. ఈ వెంటిలేటర్లు పిల్లలు, పెద్దలకు కూడా ఉపయుక్తంగా ఉంటాయని, ఒక్కొక్కటి 11 లక్షల రూపాయల చొప్పున మొత్తం 3.30 కోట్లు వెచ్చించి అధునాతన వెంటిలేటర్లను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. దశలవారీగా జిల్లాస్థాయి ఆసుపత్రులలో కూడా అధునాతన వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా నిమ్స్‌, నీలోఫర్‌ ఆసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇందుకు ఎంతఖర్చయినా వెనుకాడేది లేదని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాముఖ్యతనిస్తున్నదని ఆయన వివరించారు.

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆసుపత్రిలో 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ నర్సుల వద్దకు వచ్చి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇందుకుగాను 5 మంది సభ్యులు కమిటీగా ఏర్పడి తన వద్దకు రావాల్సిందిగా సూచించారు. మంత్రి ఇచ్చిన హామీకి సమ్మతించిన నర్సులు తమ దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, మెడికల్‌, ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ రమాదేవి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other Updates