maga

ఇక ‘పానీ’ పట్టు యుద్ధాలు తప్పనున్నాయి. తాగునీటి కోసం దూరం వెళ్లే క’న్నీటి’ కష్టాలు దూరంకానున్నాయి. గుక్కెడు నీటికి అల్లాడిన పల్లెలు జలసిరితో మురిసిపోనున్నాయి. పని వదులుకొని కుటుంబసభ్యులంతా తాగునీటి కోసం బారులు తీరే రోజులు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మిషన్‌ భగీరథ’ పథకంతో పల్లె, పట్టణాల్లో జలసవ్వడులు వినిపించనున్నాయి. కేసీఆర్‌ మానస పుత్రిక మిషన్‌ భగీరథ పథకం పనులు శరవేగంగా జరుగుతుండడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది.

మిషన్‌ భగీరథ పథకం.. నేడు తెలంగాణ ప్రజానీకం ప్రతిచోట చర్చించుకుంటున్న సరికొత్త బృహత్తర పథకం. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిప్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ప్రజానీకానికి వరం. ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించే బృహత్తర పథకమే ఈ మిషన్‌భగీరథ (వాటర్‌గ్రిడ్‌). తెలంగాణ రాష్ట్ర డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా రాష్ట్రంలో శరవేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టు ఇది. కేసీఆర్‌ మానసపుత్రికైన ఈ పథకం.. 2017 డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు భగీరథ నీటిని అందించడమే లక్ష్యంగా దూసు కెళ్తున్నది. దివి నుంచి భువికి నీటిని తెచ్చేందుకు జరిగిన భగీరథ ప్రయత్నం పురాణాల్లో విన్నాం. 2015లో ఈ పథకం వాటర్‌గ్రిడ్‌ పేరుతో ప్రారంభమైంది. ఈ పథకానికి మరింత మంచి పేరు తేవాలన్న సంకల్పంతో ‘మిషన్‌ భగీరథ’గా నామకరణం చేశారు. ఇదే పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృహత్తర ప్రాజెక్టు నిజంగా ‘భగీరథ’ ప్రయత్నమే. ఇది. మరి కొన్ని నెలల్లో ప్రజలకు వరప్రదాయినీ కానుంది. తెలంగాణ సర్కార్‌ కల సాకారం కానుంది.

గోదావరి, కృష్ణా నదుల్లో చిన్ననీటి వనరుల కింద తెలంగాణకు 265 టీఎంసీల నీటివాటా ఉంది. 1974లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తేల్చినప్పటికీ సమైక్య రాష్ట్రంలో చెరువులు ధ్వంసం కావడంవల్ల వినియోగించుకో లేకపోయాం. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల నీటి లభ్యత ఉంటుంది. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నప్పటికీ సరైన తాగునీటి ప్రాజెక్టులు లేని కారణంగా వేసవిలో భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. 82 శాతం తాగునీటి అవసరాలు భూగర్భజలాల ద్వారానే తీర్చుకుంటున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండేది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం పరిస్థితులు. దీంతో తెలంగాణలోని ప్రతీ ఇంటికి పైపుల ద్వారా సురక్షిత మంచినీటిని అందించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేవలం తాగు నీటి అవసరాలు తీర్చడమే కాకుండా బహుళ ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు ద్వారా సిద్ధించనున్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన భగీరథ ప్రాజెక్టు పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. 2018 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ, గడువును మరింత తగ్గించి, 2017 డిసెంబర్‌ నాటికి ఆవాసాలకు మంచినీటిని అందించేలా పనులను ముమ్మరం చేశారు. 19 ఇన్‌టేక్‌ వెల్స్‌కు గాను ఇప్పటికే 15 పూర్తయ్యాయి. మిగతావి త్వరలోనే పూర్తి కానున్నాయి. ప్రధాన పైప్‌లైన్‌లు 49229 కిలోమీటర్లకు గాను ఇప్పికే 30 వేల కిలోమీటర్ల వరకు నిర్మాణం పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న గుజరాత్‌ తాగునీటి శుద్ధి విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తెరాస ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తున్నది. నీటికి నడక నేర్పిన గుజరాత్‌ తరహా నీటిశుద్ధి పథకాన్ని కేసీఆర్‌ తెలంగాణ లోనూ అమలు చేసేందుకు పూనుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు తాగునీరందిం చేందుకు వీలుగా 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో భగీరథ పథకానికి 2015లో సీఎం పునాది వేశారు.

ప్రజలకు ప్రతీ రోజు ఒక్కో మనిషికి 100 నుంచి 135 లీటర్ల తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేప్టారు. ముఖ్యంగా గుజరాత్‌లో సఫలమ్కెన ఈ వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం. సమీపవనరుల నుంచి ఉపరితల జలాల్ని ఎత్తయిన ప్రాంతాలకు పంపింగ్‌ చేసి అక్కడి నుంచి అవసరమైన గ్రామాలకు అందజేయటం వల్ల ప్రజలకు మంచి పోషకాలతో కూడిన తాగునీరు లభ్యమవుతుంది. ఇది శుభపరిణామం. ముఖ్యంగా తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకం ముమ్మాటికీ సాధ్యమేనని…దేశంలోని అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన మంచినీటిని కుళాయిల ద్వారా అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మిషన్‌ భగీరథ వైెస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేయడం ఈ పథకం అమలుకు మరింత బలం చేకూర్చుతున్నది.

తెలంగాణలోని ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించే ఈ బృహత్తర కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమే. ‘తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌’ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు నేరుగా నల్లానీరును అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ‘మిషన్‌ భగీరథ’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఈ భగీరథ పథకానికి ‘హడ్కో’ సంస్థ కూడా అవార్డును అందజేసింది. అంతేగాక, బంగారు తెలంగాణ ఆవిష్కరణలో ఈ భగీరథ పథకం సరికొత్త అధ్యాయానికి తెరతీస్తోంది.

ముఖ్యంగా వేల కోట్ల రూపాయల వ్యయంతో ‘మిషన్‌ భగీరథ’ ను ఏర్పాటు చేసినందున నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేయడం మంచిపరిణామం. పైపులైన్లు, మోటార్లు, ఇతర యంత్ర సామగ్రి కొనుగోలు నుంచి పనితీరు వరకు ప్రతీ ప్రక్రియలో నాణ్యత అవసరం కాబట్టి.. ఈ విషయంలో రాజీపడొద్దని…అవినీతి దరిచేర నీయవద్దని ముఖ్యమంత్రి పేర్కొనడం బంగారు తెలంగాణకు బాటలు పడుతున్నట్లుగా మనం భావించాలే తప్ప మరోకోణంలో చూడకూడదు.

మనిషికి ప్రాణ ప్రదమైన తాగునీటిని అందించాలనే తపన…తాపత్రయం…లక్ష్యసాధనలో అంకిత భావం… పక్కా ప్రణాళిక…ఇవన్నీ కలగలిపిన కేసీఆర్‌ నూతన రాష్ట్రంలో అద్భుత ఫలితాల్ని సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తుండడం హర్షనీయం. ముఖ్యంగా దప్పికతో అలమటించిపోయిన తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అపరభగీరథ ప్రయత్నమే అయినప్పటికీ, ఇది ముమ్మాటికీ సాధ్యమవుతున్నది. అసాధ్యాల్ని సుసాధ్యం చేయడంలో ఘనత వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయించి ప్రజల దాహార్తిని తీరుస్తారనడం ఎలాంటి సందేహం లేదు. ఈ పథకం పూర్తయితే కుళాయిల వద్ద కొట్లాటలు ఇక ఉండవు. ఇక ఏ ఆడబిడ్డ కూడా నీటి కోసం బిందె పట్టు కుని క్యూలో నిలుచునే పరిస్థితి ఎదురవదు. తాగడానికి, వంట చేసుకోవడానికి, కనీస అవసరాలకు నీరెట్లా అనే దిగులుకు ఇక చరమగీతమే. వేసవి వచ్చినా, కరువు నెలకొన్నా గుక్కెడు నీటి కోసం పడే కష్టాలు ఇక దరిదా పుల్లోనే కనిపించవు. తాగేందుకు మంచినీటి (మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌)ని కొనుగోలు చేసే పరిస్థితులు కానరావు. కావల్సినంత సురక్షితనీరు నల్లాల ద్వారా ఇటింటింకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో పూర్తి స్థాయిలో ఆవిష్క తం కానున్న ఈ విప్లవానికి మూలం మిషన్‌ భగీరథ పథకం అని చెప్పక తప్పదు.

గడ్డం కేశవమూర్తి

Other Updates