మార్గం లక్ష్మీనారాయణ
తెలంగాణలో అనేక పథకాలతో ‘ఇంటికి దీపం’…’కంటికి వెలుగు’ అయ్యారు సిఎం కెసిఆర్. ఇక ఇప్పుడు మూగవాళ్ళకు మాటై, చెవిటి వాళ్ళకు వినికిడి అయి, గొంతు, దంత సమస్యలున్న వాళ్ళకు తానే గొంతై నినదించనున్నారు తెలంగాణ సీఎం.
ఇప్పటికే చరిత్రాత్మకంగా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య తెలంగాణ దిశగా మరో మహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. కంటి వెలుగు పథకం విజయవంతంగా అమలవుతున్న దశలోనే ‘చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ), దంత పరీక్షలు’ కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ‘కంటి వెలుగు’ పూర్తవగానే ప్రజలందరికీ ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది.
ది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఓటో-రినో-లార్యాంగోలాజీ (Otorhinolaryngology ) అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 35.65శాతం చెవి సంబంధ మస్యలతో బాధపడుతున్నారు. 23.57శాతం గ్రామీణులు ముక్కు సంబంధ సమస్యలతో ఉన్నారు. 16.58శాతం గొంతు, ఒక శాతం లోపు తల, మెడ సంబంధమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమికంగా ఆర్థిక, సామాజిక వెనుకబాటు, అవగాహన రాహిత్యం, అందుబాటులో తగిన సదుపాయాలు లేకపోవడం, నిర్లక్ష్యాల వల్ల ఈ సమస్యలను గుర్తించలేకపోవడం, గుర్తించినా, వైద్యం చేయించుకోకపోవడం వంటి వాటిని సంబంధిత సర్వే తేల్చింది.
నిజానికి గ్రామీణ పేదలు ఆరోగ్య సమస్యలను అంతగా పట్టించుకోరు. చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ), దంతాలకు సంబంధించిన సమస్యలను కూడా సీజనల్ వ్యాధుల్లా ఇలా వచ్చి అలా వాటికవే నయమయ్యే వ్యాధుల కోవలో చూస్తారు. దీంతో ఆయా సమస్యలు పెద్దవై ప్రాణాంతకంగా మారుతున్నాయి. పుట్టుకతో వచ్చే చెవిటిని, చిన్నతనంలో వచ్చే మూగ, చెవిటికి సంబంధించిన లోపాలను రెండేళ్లలోపు గుర్తిస్తే పూర్తిగా నయం చేసే వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. పుట్టిన వెంటనే చెవుడును గుర్తించే పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనుషుల్లో 50 నుంచి 60 ఏళ్లలో చెవుడు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ లోపాల సవరింపును ప్రజలు తీసులేకపోతున్నారు. అందుకే ప్రభుత్వమే ఆయా లోపాలను సరిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది. సిఎం కెసిఆర్ చొరవతో ఆయా లోపాలను సరిదిద్ది అవసరమైన వైద్యం చేసేందుకే ప్రభుత్వం ప్రజలందరికీ ఈఎన్‌టీ, దంత వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అవసరమైన వాళ్ళకు శస్త్ర చికిత్సలు కూడా చేయడానికి సంకల్పించింది.
గ్రామాల్లో వైద్య శిబిరాలు
ఇందుకు ‘కంటి వెలుగు’ తరహాలోనే ఈఎన్‌టీ డాక్టర్లు, డెంటిస్టులతో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. ఓటోస్కోప్, పిటిఎ ఆడియో మీటర్లు, ప్రాథమిక ఇఎన్‌టి పరీక్షలకు టంగ్ డిప్రెస్సర్ వంటి పరికరాలు, మైక్రో స్కోపులు, నాజల్ ఎండోస్కోపులు, సర్జికల్ పరికరాలు, పిల్లలకు పెద్దలకు హియరింగ్ ఎయిడ్స్, డెంటల్ పరీక్షల కోసం అవసరమైన అడ్వాన్స్‌డ్ చైర్లు, పరికరాలు, మందులు సిద్ధం చేస్తున్నారు. సంబంధిత వైద్య పరీక్షల తర్వాత అక్కడికక్కడే చికిత్సలు, మందులు అందిస్తారు. ఎవరికైనా తీవ్ర సమస్యలు గుర్తిస్తే ఉచితంగా సర్జరీలు చేస్తారు.
‘కంటి వెలుగు’ కింద ఇప్పటికే 1 కోటి 55 లక్షల మందికి పరీక్షలు చేశారు. మరో కోటి మందికి చేసే అవకాశముంది. ఇప్పటికే 24 లక్షల మందికి రీడింగ్ అద్దాలు ఇచ్చారు. మరో 17 లక్షల మందికి ప్రత్యేక అద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగానే రెండు కోట్ల మందికి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తారు వినికిడి యంత్రాలు ఇస్తారు.
ఇతర వైద్య సమస్యల రికార్డు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న ఈఎన్‌టీ, దంత వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. అంతేకాదు లోపాలను సరిదిద్దడం, ఆపరేషన్లు చేయడానికి వీలుగా కొన్ని ప్రైవేటు ఈఎన్‌టీ, దంత వైద్యశాలలతోనూ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఆయా శస్త్రచికిత్సలకు అవసరమైన డబ్బుని కూడా సంబంధిత దవాఖానాలకు ప్రభుత్వమే ఇస్తుంది. తదనంతరం ప్రజలకు ఉన్న ఇతరత్రా అనారోగ్య సమస్యలను తెలుసుకొని వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఇదే సమయంలో ప్రజల బీపీ, షుగర్ సహా ఇతరత్రా అనారోగ్య సమస్యలను కూడా రికార్డు చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఒక నంబర్ కేటాయిస్తారు. అలా చెకప్‌లో వచ్చిన లోపాల ఆధారంగా అవసరమైన వారికి వైద్యం చేస్తారు.
ప్రజలందరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసి వారి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందు కు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేయాలని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలను తాజాగా ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంపై ప్రత్యేక దష్టిసారించారు. వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నట్లు కనీసం 2 కోట్ల మందికి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
ఒక్క క్లిక్ చాలు…హెల్త్ ప్రొఫైల్ ఎంతో మేలు
రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను క్రోడీకరించడమే హెల్త్ ప్రొఫైల్. ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూపు సహా, వారి ఆరోగ్య సమస్యలు, అప్పటి వరకు తీసుకుంటున్న చికిత్స, వాడుతున్న మందుల వివరాలన్నీ సేకరిస్తారు. ఆయా వ్యక్తులకు ఎక్కడకు వెళ్ళినా, ఏ ప్రాణాపాయ, ప్రమాద స్థితుల్లోనూ వైద్యం అందించడానికి వీలు ఏర్పడుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరికి ఎలాంటి కంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని నమోదు చేస్తున్నారు. ఆ రికార్డులను భద్రపరుస్తున్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రతి వ్యక్తి రక్త నమూనాలు సేకరించి విశ్లేషిస్తారు. ఆ వివరాలన్నింటినీ కేంద్రీకరించి విశ్లేషిస్తారు. ఒక వ్యక్తి ఏదైనా సమస్యతో హాస్పిటల్‌కు వెళ్తే.. అతడి ఆరోగ్య వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుస్తాయి. కొత్తగా వచ్చే వ్యాధులను సైతం ఈ హెల్త్‌ప్రొఫైల్‌లో నమోదు చేస్తారు.
హెల్త్‌ప్రొఫైల్ వల్ల రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఏయే సమస్యలతో బాధపడుతున్నారో తెలిసిపోతుంది. దానికి తగినట్టుగా మందులను అందుబాటులో ఉంచవచ్చు. వైద్యారోగ్యశాఖలో ఆయా విభాగాలను బలోపేతం చేయవచ్చు. ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే గాయపడిన వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తెలిస్తే వెంటనే చికిత్స అందించే అవకాశం కలుగుతుంది. ప్రాథమిక పరీక్షలు చేయడం, నివేదికలు వచ్చే వరకు ఎదురుచూడటం తప్పుతుంది. వేగంగా వైద్యం అందడం వల్ల ప్రజల ప్రాణాలు రక్షింపబడతాయి.