రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌ నగరానికే ఏడాదికి రూ.15వేల కోట్ల చొప్పున రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
tsmagazine

హైదరాబాద్‌ నగరాన్ని నిజమైన గ్లోబల్‌ సిటీగా మార్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల కోసం రూ.10 వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ‘ఫోకసింగ్‌ ఆన్‌ అర్బన్‌ తెలంగాణ’ అనే కార్యక్రమం మిషన్‌ మోడ్‌ లో చేపట్టాలని చెప్పారు. మూడేళ్ల కాలంలో రూ.55వేల కోట్లతో చేపట్టే పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నగరాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ”వచ్చే ఏడాది నుంచి వరుసగా మూడేళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. రహదారులు, పార్కులు, చెరువులు, మురికి కాలువలు తదితర అన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఈ పనులు చేయడానికి నిధుల కొరత లేదు. రూ.55 వేల కోట్లు కేటాయిస్తాం. 45 వేల కోట్లు హైదరాబాద్‌ కు, ఇతర నగరాలకు రూ.10వేల కోట్లు కేటాయిస్తాం. ఈ నిధులతో ఏ పనులు చేయాలనే విషయంలో మున్సిపల్‌ శాఖ సమగ్ర నివేదిక తయారు చేయాలి. దాని ప్రకారం పనులు చేసుకుంటూ పోవాలి. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని రకాల నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి” అని సీఎం చెప్పారు.

”నగరాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలి. అక్రమ లే అవుట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. లే అవుట్లలో గ్రీన్‌ లాండ్‌ కోసం స్థలం తీసినా, తర్వాత వాటిని రెగ్యులరైజ్‌ చేసే విధానానికి స్వస్తి పలకాలి. గ్రీన్‌ కవర్‌ ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. చెరువులను శుభ్రంగా

ఉంచడానికి కషి చేయాలి. హైదరాబాద్‌లోని గండిపేట, హిమాయత్‌ సాగర్‌, హుస్సేన్‌సాగర్‌ లాంటి చెరువులను గోదావరి నీటితో నింపాలి. మురికి నీరు చెరువుల్లో కలవకుండా చూడాలి. మురికి నీటిని శుభ్రం చేయడానికి సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు పెట్టాలి. ప్రతీ నగరానికి దానికి అవసరమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి” అని సిఎం చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రి కె.టి. రామారావు, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, మున్సిపల్‌ పరిపాలన కమిషనర్‌ శ్రీదేవి, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం మేయర్లు బొంతు రామ్మోహన్‌, నన్నపనేని నరేందర్‌, పాపాలాల్‌, రవీందర్‌ సింగ్‌, సుజాత, కమిషనర్లు పాల్గొన్నారు.

Other Updates